ఎన్నికల రాజకీయం – ఉమ్మడి పౌర స్మృతి -ఎవరి కోసం?

 ఇంకో  సంవత్సరం లోపు సారస్వత ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఉమ్మడి పౌర స్మృతి  అనే  వివాదాన్ని రాజకీయ రంగంమీదకు తీసుకురావాలనేదే మొత్తం ఆలోచనగా మోదీ  గారి ప్రసంగం వెల్లడి చేస్తోంది. నిజానికి, UCC ను కేవలం ముస్లింలు మాత్రమే వ్యతిరేస్తూ వున్నారని ముందుకు తీసుకు రావటం ద్వారా, ఈ దేశంలోని అసంఖ్యాక SC, ST, OBC, ఇతర మైనారిటీల వైవిధ్యమైన అంశాలు, హక్కులు గురించీ చర్చలోకి రాకుండా, ఒకే దేశం -ఒకే జాతి అనే మాయలో వారిని వుంచీ, వాటి గురించీ ఈ వర్గాలు మాట్లాడకుండా చేసే ప్రయత్నం నిస్సిగ్గుగా బయట పడుతోంది.

2024… మనదేశంలో ప్రతీ ఐదేళ్లకు జరగబోయే సారస్వత ఎన్నికల సంవత్సరం. ఆ హడావుడి  ఇప్పటికే మొదలయ్యింది కూడా! అందులో భాగం గా 22 వ లా కమిషన్ యూనిఫాం సివిల్ కోడ్‌ UCC (ఉమ్మడి పౌర స్మృతి) గురించీ సరిగ్గా సారస్వత ఎన్నికలకు ఇంకొక సంవత్సరం లోపు ఉందనగా సంప్రదింపులకు ఒక  ప్రకటనను 14 జూన్, 2023 న ఇచ్చింది. దానితో మళ్లీ పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది.

అయితే, ఇదే అంశం మీద 2018 లో 21వ లా కమిషన్ తన రిపోర్ట్ లో UCCపై ఏకాభిప్రాయం రాదని స్పష్టం చేయటమే కాకుండా,   దీనివల్ల ప్రాథమిక హక్కులకు భంగం  కలుగకుండా “వైవిధ్యాన్ని కాపాడుకోవడం” అత్యంత అవసరం అని చెప్పింది. ఇంత ముఖ్యమైన సూచనలు ఇచ్చినప్పటికీ, అప్పటి నుంచీ వాటి అమలుని  పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రిత్వ శాఖ ఇప్పుడు 22 వ లా కమిషన్ ద్వారా సంప్రదింపులు అని మొదలు పెట్టాయి.

 

చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

యూనిఫాం సివిల్ కోడ్ గురించి ప్రజలుగుర్తింపు పొందిన మత సంస్థల అభిప్రాయాలు & ఆలోచనలను అభ్యర్థించనున్న లా కమిషన్ ఆఫ్ ఇండియా

Posted On: 14 JUN 2023 6:56PM by PIB Delhi

న్యాయ మంత్రిత్వ శాఖ పంపిన సూచన మేరకు  22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా యూనిఫాం సివిల్ కోడ్‌ను పరిశీలిస్తోంది. ప్రారంభంలో 21వ లా కమిషన్ ఆఫ్ ఇండియా యూనిఫాం సివిల్ కోడ్‌పై సబ్జెక్ట్‌ను పరిశీలించింది. 07.10.2016 నాటి ప్రశ్నాపత్రంతో పాటు తన అప్పీల్ ద్వారా వాటాదారులందరి అభిప్రాయాలను 19.03.201827.03.201810.4.2018 తేదీలలో పబ్లిక్ అప్పీళ్లు/నోటీస్‌లను కోరింది.  దీని ప్రకారం కమిషన్ కు అధిక మొత్తంలో స్పందనలు లభించాయి. 21వ లా కమిషన్ 31.08.2018న “కుటుంబ చట్టం సంస్కరణల” పై సంప్రదింపు పత్రాన్ని విడుదల చేసింది. ఈ విషయం ఔచిత్యం, ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకునిఈ అంశంపై వివిధ కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకునిఈ కన్సల్టేషన్ పేపర్‌ను జారీ చేసిన తేదీ నుండి మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం గడిచిపోయినందున, 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై కొత్తగా చర్చించడం సముచితమని భావించింది. దీని ప్రకారంయూనిఫాం సివిల్ కోడ్ గురించి పెద్ద, గుర్తింపు పొందిన మత సంస్థల నుంచీ,  ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలను సేకరించాలని 22 భారత లా కమిషన్ మళ్లీ నిర్ణయించిందిఆసక్తి గలవారు, సిద్ధంగా ఉన్నవారు తమ అభిప్రాయాలను నోటీసు తేదీ నుండి 30 రోజుల వ్యవధిలో membersecretary-lci@gov.in to the Law Commission of India.  లో ఇమెయిల్ ద్వారా లా కమిషన్ ఆఫ్ ఇండియాకు అందించవచ్చు.

ఈ ప్రకటన ప్రకారం ఈ జులై 15 నాటికి వివిధ సమూహాల ప్రజలు తమ అభిప్రాయాలను లా కమిషన్ కు పంపాల్సి ఉంటుంది.

అయితే, ఇక్కడ వచ్చే ప్రశ్న ఏమిటంటే అసలు 21వ లా కమిషన్ తన రిపోర్ట్ లో ఏం పేర్కొంది? వాటి గురించి మాట్లాడకుండా కొత్తగా మళ్లీ సూచనలు కోరటం వెనుక ఉన్న  ప్రయోజనాలేమిటి? లింగ వివక్షను అంతం చేయాలని, అసమాన ఆస్తి హక్కులను తొలగించాలని నివేదికలో స్పష్టం  చేసిన 21వ లా కమిషన్ సూచనలు అమలు చేయటంలో ఏమి అడ్డంకులు ఎదురయ్యాయి అని ఎక్కడా పేర్కొనకుండానే కొత్త ప్రక్రియను ప్రారంభించారు.

 అసలు ముందు 21 వ  లా   కమిషన్  ఏం ప్రతిపాదనలు చేసిందో చూద్దాం:

నిజానికి 17 జూన్, 2016 నాటి చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ  “సూచన” ఆధారంగా, 21వ లా కమిషన్ UCC కి సంబంధించిన  అనేక అంశాలను (ఆస్తి హక్కులు, పెళ్లి, విడాకులు, మనోవర్తి, దత్తత, సంరక్షణ, వారసత్వం మొదలైనవి)  పరిశీలించడం ప్రారంభించింది.  పరిశోధనతో పాటు ఆయా రంగాల న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక వివరణాత్మక నివేదికను సిద్ధం చేసింది. రెండు సంవత్సరాల తరువాత ఆగష్టు 31, 2018న, “కుటుంబ చట్టాల సంస్కరణ” పై కమిషన్ 182 పేజీల సుదీర్ఘ సంప్రదింపుల పత్రాన్ని వెలువరించింది. అందులో వివరించిన ముఖ్యమైన అంశాలు క్లుప్తంగా ఇవి:

“ఒకే విధమైన పౌరస్మృతి పై ఏకాభిప్రాయం లేనప్పుడు, వ్యక్తిగత చట్టాల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకి వెళ్ళాలి.  అయితే అదే సమయంలో వ్యక్తిగత చట్టాలు భారత రాజ్యాంగం క్రింద హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా లేవని కూడా నిర్ధారించుకోవాలి.”

 “ప్రస్తుతం UCC అవసరం లేదు, కోరదగినది కూడా కాదు. లింగ వివక్షను అంతం చేయడానికి, అసమానతలను తొలగించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.”

“చాలా దేశాలు ఇప్పుడు భిన్నత్వాన్ని గుర్తించే దిశగా కదులుతున్నాయి.  ఆ భిన్నత్వాల ఉనికి బలమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుంది.”

వీటి అమలుకు ఏమాత్రం  ప్రయత్నం చేయకపోగా మళ్లీ అదే విషయం మీద అభిప్రాయ సేకరణ అంటూ మొదలెట్టారు. సరే, మళ్లీ మొదలయిన ప్రహసనం లో వివిధ సమూహాలకు సంబంధించిన వాళ్లు తమ తమ నిక్కచ్చి అభిప్రాయాలను మళ్లీ రికార్డు చేస్తున్న సందర్భంలోనే ఆలూ లేదు చూలూ లేదు అన్న చందంగా ఓ వారం  రోజుల తర్వాత తన అమెరికా ప్రయాణాన్ని ముగించుకుని వచ్చిన మన ప్రధానమంత్రి మోదీ  గారు భోపాల్ లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ దేశాన్ని కుటుంబాన్ని ఒకే విధమైన పోలీకతో ప్రస్తావిస్తూ ఒక ఇంట్లో రెండు రకాల విధానాలు ఎలా వుంటాయని, అలానే ఒక దేశంలో రెండు భిన్న పౌర స్మృతులు ఎలా వుంటాయి  అంటూ, UCC ని ప్రతిపక్షాలు మూర్ఖం గా వ్యతి రేకిస్తూ ముస్లిం లను రెచ్చగొడుతున్నారని తనదైన భాష్యంతో మతపరమైన సమీకరణకు  తెరతీశారు. నిజానికి, ఉమ్మడి పౌర స్మృతి UCC ని వ్యతిరేకించేది కేవలం ముస్లింలు మాత్రమే కాదు. హిందూ మతం లో విభిన్న కులాలుగా, తెగలుగా భిన్నత్వమే ఉనికిగా వున్న  అనేక సమూహాలు తమవైన ఆచార వ్యవహారాలలో ఈ ఏకత్వం పేరిట జరుగుతున్న ఆధిపత్యాన్ని బలంగా ప్రశ్నిస్తున్నారు. ముందే చెప్పినట్లు  విభిన్న మతాలకు ఆయా వ్యక్తిగత చట్టాలు మన రాజ్యాంగం లో పొందు పరిచారు. ఆస్తి హక్కులు, పెళ్లి, విడాకులు, మనోవర్తి, దత్తత, సంరక్షణ, వారసత్వం మొదలైనవన్నీ వ్యక్తిగత చట్టాలలో భాగంగా వుంటాయి. ఇది ముస్లిం వివాహ వ్యవస్థకు మాత్రమే సంబంధించిన అంశం కాదు. కేవలం ముస్లింలకు మాత్రమే వ్యక్తిగత చట్టం లేదు. అన్ని మతాలకు వున్నాయి. వొకొక్కరిదీ విభిన్నమైన సాంస్కృతిక జీవనం.

ఇంకో  సంవత్సరం లోపు సారస్వత ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఉమ్మడి పౌర స్మృతి  అనే  వివాదాన్ని రాజకీయ రంగంమీదకు తీసుకురావాలనేదే మొత్తం ఆలోచనగా మోదీ  గారి ప్రసంగం వెల్లడి చేస్తోంది. నిజానికి, UCC ను కేవలం ముస్లింలు మాత్రమే వ్యతిరేస్తూ వున్నారని ముందుకు తీసుకు రావటం ద్వారా, ఈ దేశంలోని అసంఖ్యాక SC, ST, OBC, ఇతర మైనారిటీల వైవిధ్యమైన అంశాలు, హక్కులు గురించీ చర్చలోకి రాకుండా, ఒకే దేశం -ఒకే జాతి అనే మాయలో వారిని వుంచీ, వాటి గురించీ ఈ వర్గాలు మాట్లాడకుండా చేసే ప్రయత్నం నిస్సిగ్గుగా బయట పడుతోంది.

-కె సజయ సామాజిక విశ్లేషకులు,స్వతంత్ర జర్నలిస్ట్
-కె సజయ
సామాజిక విశ్లేషకులు,స్వతంత్ర జర్నలిస్ట్

-కె. సజయ,

సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page