మాస్కో మూకల పైశాచిక దాడుల్లో..
గాల్లో కలిసిన లక్షల జవాన్ల ప్రాణాలు
వేలల్లో శ్వాస విడిచిన సామాన్య జనాలు
లక్షల్లో నిరాశ్రయులైన అభాగ్యుల ఆక్రందనలు
పైశాచిక కదనకాండకు నిలువెల్లా చిధ్రమై..
విలవిల్లాడుతున్న ఉక్రెయిన్ ఆవాసాలు !
బతుకు పంటల్ని పండించుకోవాలని..
తపించే సామాన్యుల కలల్ని కాలరాసి..
హరిత కోక కట్టుకున్న భూమాతని..
నెత్తుటి గాయాల జీవచ్ఛవంగా మార్చి..
సమాజ స్వప్నంలోంచి ఊపిరిపోసుకున్న..
మా’నవ’ సంస్కృతికి సామాధి కట్టి..
ప్రకృతి, నాగరికత, నిండు జీవితాలను..
విచక్షణారహితంగా విధ్వంసం చేస్తూ..
ఏకపక్ష పుతిన్ పులిసిన పుర్రెలో పుట్టిన..
అంతులేని భీభత్స కర్కష కదన రచనలు !
డ్యాములు, కన్నీటి ఆనకట్టలు తెగి..
కొట్టుకుపోతున్న జలాలు, అశేష జనాలు
క్రెన్లిన్ సామ్రాజ్యవాద దురహంకారమే..
విశ్వ ఆర్థిక రథాన్ని అధోముఖం పట్టించిన..
కిరాతక యుద్ధంతో బావుకునేదెవరు !
విజేతంటూ వీరతాడు ఎవరి మెడలో పడినా..
చివరికి మిగిలేది పెను విషాదమే కదా !
సరుకుల సరఫరా గొలుసులు తెగ్గోసి..
ప్రపంచ ఆకలి మంటలకు ఆజ్యం పోసి..
ముగింపే కనబడని భీకరపోరు భీభత్సం
ఆత్మవినాశక మూర? సమరాన్ని కొనసాగిస్తూ..
రణపిశాచిని ఒంటినిండా ఆవాహన చేసుకొన్న..
పుతిన్ పుర్రెకు పట్టిన పురుగును తరిమేదెవరూ
ప్రపంచ శాంతి కపోతానికి స్వేచ్ఛ ఇచ్చేదెపుడు
– డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037