- బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా కుట్ర చేస్తున్నయ్
- మీడియా బ్రేకింగులు పట్టించుకోవద్దు…
- సింగిల్ గానే పోటీ చేయబోతున్నాం
- అధికారాన్ని కైవసం చేసుకుంటాం
- ఖమ్మం ప్రిపరేటరీ మీటింగ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్
రాష్ట్రంలో పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలతోపాటు ఓ సెక్షన్ మీడియా కుట్ర చేస్తోందన్నారు. ఎవరెంత దుష్ప్రచారం చేసినా పట్టించుకోవద్దని కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సూచించారు. బీజేపీ సింహంలాంటి పార్టీ అని, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ యాడుంది? కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా దేశంలో ఎక్కడా ఆ పార్టీ లేదు.. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేవదు.. కమ్యూనిస్టుల పనైపోయింది. సూది దబ్బడం పార్టీలని అవమానించిన కేసీఆర్ పంచనే చేరిన సిగ్గు, శరంలేని పార్టీల నేతలు కమ్యూనిస్టులు అని బండి సంజయ్ ధ్వజమెత్తారు.బండి సంజయ్ అధ్యక్షతన శుక్రవారం పట్టణంలోని వాసిరెడ్డి ఫంక్షన్ హాలులో ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, జిల్లాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…సర్దార్ పటేల్ గ్రౌండ్ కు అభినవ సర్దార్ పటేల్ రాబోతున్నడు…ఖమ్మంలో బీజేపీ సత్తా ఏందో ‘‘నిరుద్యోగ మార్చ్’’ ద్వారా చూపించాం. రేపు అమిత్ షా సభను సక్సెస్ చేసి మరోసారి దమ్ము చూపిద్దాం..ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ సక్సెస్ తో కేసీఆర్ కళ్లు బైర్లు కమ్మినయ్.
మళ్లీ 15న అమిత్ షా వస్తున్నారని తెలుసుకుని కేసీఆర్ కు చెమటలు పడుతున్నయ్. ఇక్కడ అమిత్ షా సభ సక్సెస్ అయిన తరువాత అవసరమైతే ప్రధాని మోదీ సభను కొత్తగూడెంలో ఏర్పాటు చేస్తాం..అని బండి సంజయ్ అన్నారు..అందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి అని పేర్కొంటూ…ఖమ్మం జిల్లాలో నేతల ఆగడాలకు బలైపోయిన సాయి గణేష్ త్యాగాలను వ్రుధా పోనీయ్యం. తప్పకుండా బీఆర్‌ఎస్ సంగతి చూస్తాం. అందులో భాగంగా ఈనెల 15న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి..అని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ తెలంగాణలో సింగిల్ గా పోటీ చేస్తాం.. గెలిచి సింగిల్ గానే అధికారాన్ని కైవసం చేసుకుంటాం.. మీడియాలో బ్రేకింగుల పేరిట జరుగుతున్న షేకింగులను పట్టించుకోవద్దు.
అందరూ కష్టపడి ఇష్టపడి పనిచేసి కాషాయ రాజ్య స్థాపనకు క్రుషి చేయాలి. అందులో భాగంగా 15న జరిగే సభను విజయవంతం చేయాలి… తెలంగాణ ప్రజల గుండెల్లో బీజేపీ ఉంది..అని తెలిపారు.ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు పార్టీ తమిళనాడు సహ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, మాజీమంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎం.ధర్మారావు, కొండేటి శ్రీధర్, కుంజా సత్యవతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ తోపాటు వివిధ జిల్లాల అధ్యక్షులు గల్లా సత్యానారాయణ, కోనేరు చిన్ని, బొబ్బ భాగ్యారెడ్డి, రామచంద్రారెడ్డి, రావు పద్మ, కంకణాల శ్రీధర్ రెడ్డి, అధికార ప్రతినిధులు రాకేశ్ రెడ్డి, పాల్వాయి రజనీతోపాటు రాష్ట్ర నాయకులు గీతామూర్తి, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, కడగంచి రమేశ్, విద్యా సాగర్ రెడ్డి, ఉప్పల శారద తదితరులు హాజరయ్యారు.