వికలాంగులకు మరో వేయి పెన్షన్‌ ‌పెంపు

వొచ్చే నెల నుంచే పెంచిన మొత్తం అందచేత
సింగరేణి కార్మికులకు ముందే వొచ్చిన దసరా
దసరా బోనస్‌ 700 ‌కోట్లుగా ప్రకటన
సింగరేణిని కాపాడుకున్న ఘనత తమదే
మంచిర్యాల వేదికగా సిఎం కెసిఆర్‌ ‌వరాల జల్లు

మంచిర్యాల,ప్రజాతంత్ర,జూన్‌9: ‌రాష్ట్రంలోని వికలాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త వినిపించారు. తెలంగాణలోని వికలాంగులకు ఆసరా పెన్షన్లు పెంచుతున్నట్లు కేసీఆర్‌ ‌ప్రకటించారు. పెంచిన పెన్షన్లు వొచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ‌ప్రగతి నివేదన సభలో కేసీఆర్‌ ‌మాట్లాడారు. మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలి అని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. ముసలమ్మలు, ముసలి తాతలు ఆసరా పెన్షన్లతో బ్రహ్మాండంగా ఉన్నారు. వికలాంగులకు రూ. 3,116 పెన్షన్‌ ఇస్తున్నాం. ఇవాళ మంచిదినం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్‌ ‌కూడా పెంచబోతున్నాం. మరో వెయ్యి రూపాయాలు పెంచుతున్నాం. మంచిర్యాల గడ్డ నుంచి తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచి ప్రకటించాలని నేను సస్పెన్షన్‌లో పెట్టాను. వొచ్చే నెల నుంచి రూ. 4,116 పెన్షన్‌ అం‌దుతుందని కెసిఆర్‌ అన్నారు. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నాం అని కేసీఆర్‌ ‌తెలిపారు. అలాగే సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త వినిపించారు. వచ్చే దసరా బోనస్‌ను ఇప్పుడే ప్రకటించారు. వొచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్ల బోనస్‌ ఇస్తామని ప్రకటించారు.

సంక్షేమంలో బాగున్నాం. వ్యవసాయంలో బాగున్నాం అని కేసీఆర్‌ ‌తెలిపారు. సింగరేణి సోదరులు కూడా చాలా మంది ఈ సభలో ఉంటారు. సింగరేణి 134 ఏండ్ల చరిత్ర ఉంది. వాస్తవానికి అది మనకు సొంత ఆస్తి. నిజాం కాలంలో ప్రారంభమైంది. వేలాది మందికి అన్నం పెట్టింది. కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలో సింగరేణిని సర్వనాశనం చేసింది. కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చింది. అప్పు తిరిగి చెల్లించక, మన సొంతదైన కంపెనీని.. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా కింద అమ్మేసింది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం. ఆ విధంగా సింగరేణిని పూర్తిగా నాశనం చేసింది అని కేసీఆర్‌ ‌ధ్వజమెత్తారు. 2014 కంటే ముందు కార్మికులకు ఇచ్చే బోనస్‌ 18 ‌శాతం మాత్రమే అని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. అంటే కేవలం రూ. 50 నుంచి 60 కోట్లు మాత్రమే కార్మికులకు పంచేది. తెలంగాణ వచ్చాక సింగరేణి నడక మారింది. 2014లో సింగరేణి టర్నోవర్‌ ‌రూ. 11 వేల కోట్లు మాత్రమే. ఇవాళ అదే సింగరేణి టర్నోవర్‌ను రూ. 33 వేల కోట్లకు పెంచుకున్నాం.

అదే విధంగా సింగరేణి లాభాలు కేవలం రూ. 300 నుంచి రూ. 400 కోట్లు మాత్రమే ఉండే. ఇవాళ సింగరేణిలో ఈ ఏడాది వచ్చిన లాభాలు రూ. 2,184 కోట్లు. వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్‌ ‌రూ. 700 కోట్లు. సింగరేణిలో నూతన నియామకాలు చేసుకుంటున్నాం. 10 సంవత్సరాల కాంగ్రెస్‌ ‌సామ్రాజంలో 6453 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత డిపెండెంట్‌ ఉద్యోగాల హక్కును పునుదర్ధరించి 19,463 ఉద్యోగాలను కల్పించాం. 15,256 మందికి డిపెండెంట్‌ ఉద్యోగాలు కల్పించాం అని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. సింగరేణిలో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే గత ప్రభుత్వాలు రూ. లక్ష ఇచ్చి చేతులు దులుపుకునేది అని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కానీ బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇస్తుంది అని తెలిపారు. వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణం ఇంటి కోసం ఇస్తున్నాం అని కేసీఆర్‌ ‌తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్‌ ‌రెడ్డి, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, జోగు రామన్న,బాల్క సుమన్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page