తెలంగాణ రాష్ట్రం లో 7007 రైతు ఆత్మహత్యలు…

  ‘‘‌మళ్లీ ఇంకొన్ని నెలల లోపునే తెలంగాణ శాసన సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, శక్తులు తమ తమ బలాలను మోహరించుకుంటున్నారు. ఈ  సందర్భంలో, దశాబ్దిలోకి అడుగుపెడుతున్న తెలంగాణ సామాజిక జన జీవనం ముందు ఉన్న  ముఖ్యమైన అంశాల గురించి తెలంగాణ పౌర సమాజం ఏ విధంగా ఆలోచిస్తోంది? ప్రభుత్వాల ప్రాధాన్యత ఏ అంశాల మీద ఉంది? వేటి గురించి కనీసం పట్టించుకోలేదు? నిజంగా అవి పట్టించుకోదగని అంశాలా? క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సామాజిక, పర్యావరణ  విధ్వంసాన్ని, వ్యవస్థల వైఫ్యల్యాన్ని, ప్రజాస్వామ్య హక్కులను నేలరాయటాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ప్రజల మీద లేదా? ఒకవైపు రాష్ట్రం లో ఉన్న సమస్యలను అడ్డుపెట్టుకుని ప్రజల మధ్య మత వైషమ్యాలను రాజేసి దానిద్వారా తెలంగాణ జనజీవితంలో కలగలసిన ‘గంగా జమున తెహజీబ్‌’ ‌ని ధ్వంసం చేయాలని కాచుకునివున్న శక్తులను ఏ విధంగా అడ్డుకోగలుగుతాం అని తెలంగాణ పౌర సమాజం వేసుకోవాల్సిన ప్రశ్న.. తెలంగాణ ప్రజల జనజీవితం లోని ప్రతీ అంశం గురించీ వాస్తవాల ఆధారంగా చర్చించుకోవలసిన సందర్భం ఇది. ఈవారం రైతు ఆత్మహత్యల గురించీ మాట్లాడుకుందాం..’’

ఈ రోజుతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యి తొమ్మిది సంవత్సరాలు. భౌగోళిక తెలంగాణ కోసం అనేక దశాబ్దాల పాటు ఎన్నో పాయలుగా సాగిన ప్రజాఉద్యమంలో సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు తమవైన ఆకాంక్షలతో మమేకమ య్యాయి. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ సమస్యలు పూర్తిగా కాకపోయినా ఒక మేరకు పరిష్కారమవుతాయని మాత్రం ఆశించాయి. రాష్ట్రం సాకారమయ్యింది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటికీ రెండుసార్లు శాసనసభ ఎన్నికలు జరిగాయి. వివిధ కారణాలతో కొన్ని నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు కూడా జరిగాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో మహా కట్టడాలు నిర్మాణమయ్యాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ‌నగరం… హుస్సేన్సాగర్‌ ‌నీటి గలగలలకు తోడుగా నిలబడిన బుద్ధ విగ్రహం, అల్లంత దూరంలో గంభీరమైన డాక్టర్‌ ‌బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌విగ్రహం, పక్కనే మహా కట్టడంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం, ఎదురుగా అమరవీరుల స్తూపం… వీటిని వీక్షించటానికి వేసవి సాయంకాలాలు టాంక్‌ ‌బండ్‌, ‌నెక్లెస్‌ ‌రోడ్డు మీద పెరిగిన జన సందోహం… సెల్ఫీల సందడి… తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సన్నాహాలతో అంతా కనుల పండుగగా వుంది.

మరోవైపు, హైటెక్‌ ‌సిటీ చుట్టుపక్కల ఆకాశంలోకి దూసుకువెళ్ళిన నిర్మాణాలను, రాత్రిపూట వాటి ధగధగలను చూసి అభివృద్ధిలో ఈ నగరం న్యూయార్క్ ‌నగరంతో పోటీపడుతోంది అని ప్రశంసలు కురిపిస్తున్న హీరో రజనీకాంత్‌ ‌లాంటి వారు! ఈ విపరీతమైన వేగంలో కోట్ల సంవత్సరాలనాటి సహజసిద్ధమైన కొండలు కనుమరుగు అయ్యాయనీ, వాటి చుట్టూ వున్న అతి సున్నితమైన పర్యావరణ వ్యవస్థ కనుమరుగు అయ్యిందని ఆ హీరో గారికి తెలిసే అవకాశం వుండకపోవచ్చు. ఆయనకీ, ఆయనలాంటి అనేకమందికీ కళ్ళను మాయచేసే ధగధగలు చాలు. మొత్తం రాష్ట్రం అంతా అలా వెలిగిపోతోంది అనుకుంటారు. అయినా కొండల వల్ల ఉపయోగం ఏముంటుంది!? మనకు కావలసింది సూపర్‌ ‘అభివృద్ధి’ కదా!? నగరం ఆకాశంలోకి పెరుగుతోంది అంటే గ్రామాల సహజ వనరులు, అక్కడి ప్రజల జీవితాలు ధ్వంసం అవుతున్నాయి అని ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదేమో!
మళ్లీ ఇంకొన్ని నెలల లోపునే తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు, శక్తులు తమ తమ బలాలను మోహరించుకుంటున్నాయి. ఈ  సందర్భంలో, దశాబ్దిలోకి అడుగుపెడుతున్న తెలంగాణ సామాజిక జనజీవనం ముందు వున్న ముఖ్యమైన అంశాల గురించి తెలంగాణ పౌరసమాజం ఏ విధంగా ఆలోచిస్తోంది? ప్రభుత్వాల ప్రాధాన్యత ఏ అంశాల మీద వుంది? వేటి గురించి కనీసం పట్టించుకోలేదు? నిజంగా అవి పట్టించుకోదగని అంశాలా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న సామాజిక, పర్యావరణ  విధ్వంసాన్ని, వ్యవస్థల వైఫ్యల్యాన్ని, ప్రజాస్వామ్య హక్కులను నేలరాయటాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ప్రజల మీద లేదా? ఒకవైపు రాష్ట్రంలో వున్న సమస్యలను అడ్డుపెట్టుకుని ప్రజల మధ్య మత వైషమ్యాలను రాజేసి దాని ద్వారా తెలంగాణ జనజీవితంలో కలగలసిపోయి వున్న ‘గంగా జమున తెహజీబ్‌’‌ని ధ్వంసంచేయాలని కాచుకుని వున్న శక్తులను ఏ విధంగా అడ్డుకోగలుగుతాం అని తెలంగాణ పౌరస మాజం వేసుకోవాల్సిన ప్రశ్న. తెలంగాణ ప్రజల జీవితంలోని ప్రతీ అంశం గురించీ వాస్తవాల ఆధారంగా చర్చించుకోవలసిన సందర్భం ఇది. ఈవారం రైతు ఆత్మహత్యల గురించీ మాట్లాడుకుందాం.

ప్రత్యేక రాష్ట్ర నినాదం అనే నిప్పుని మలిదశ ఉద్యమంలో మళ్లీ రాజేయటానికి కారణమైన రైతు ఆత్మహత్యలు తెలంగాణలో ఆగాయా? ఆగలేదనీ, ఇంకా ఎక్కువయ్యాయనీ పత్రికలు రాస్తున్నాయి. జాతీయ నేర గణాంకాల శాఖ కూడా ఈ అంశాన్ని నిర్ధారిస్తోంది. మరి ఈ సమస్యని పరిష్కరించటానికి ఈ తొమ్మిదేళ్లలో నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతు ఆత్మహత్యలే లేవని కొంతమంది అపోహలో కూడా వున్నారు. అంటే వాస్తవాన్ని చూడటానికి నిరాకరిస్తున్నారన్నమాట! ఆత్మహత్య బాధితుల కుటుంబాలకి ఉమ్మడి రాష్ట్రం వున్నప్పుడు ఇచ్చిన లక్షా యాభై వేల రూపాయల నష్టపరిహారాన్ని ఆరు లక్షల రూపాయలకు పెంచటం అభినందనీయమే. కానీ, వాస్తవంగా జరుగుతున్న దేమిటి? రైతుల బలవన్మరణాలను వ్యవసాయ సంబంధిత మరణాలుగా అధికారులు గుర్తించటం లేదు. రకరకాల సాకులు చూపిస్తున్నారు. నిజానికి, ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు కంటే అత్యంత కరుకుగా, అహంభావంతో తెలంగాణ రైతు ఆత్మహత్య కుటుంబాలతో అధికారులు ప్రవర్తిస్తున్నారని అనేకమంది చెబుతున్నారు. కొంచం మర్యాదతో మాట్లాడే అధికారులైతే, ‘రైతు ఆత్మహత్యాలపై స్పందించవద్దని పైనుంచి ఆదేశాలు వున్నాయని, ఏమీ చేయలేమని’ చేతులెత్తేస్తారు.

రైతు ఆత్మహత్యల మీద గత పదిహేను సంవత్సరాల నుంచీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్త, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్‌  ‌కొండల్‌ ‌ని ఈ విషయం గురించి అడిగినప్పుడు ఈ విధంగా వివరించారు. ‘‘లెక్కలు చూస్తే, తెలంగాణ రాష్ట ఆవి ర్భావం అయిన జూన్‌ 2, 2014 ‌నుంచీ ఇప్పటివరకు 7007 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో కేవలం 1600 మందిని మాత్రమే ప్రభుత్వం రైతు ఆత్మహత్యలుగా గుర్తించి ఎక్స్ ‌గ్రేషియా ఇచ్చింది. ప్రభుత్వమే నిర్ధారించిన ఈ  కుటుంబాలకు కూడా ఎక్స్ ‌గ్రేషియా విడుదల చేయండని మేము హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం రెండుసార్లు వేస్తే గానీ ప్రభుత్వ యంత్రాంగంలో చలనం రాలేదు. బాధిత కుటుంబాలు ఎక్స్ ‌గ్రేషియా కోసం  అధికారుల దగ్గరకి వెళ్ళినప్పుడు ‘2018లో రైతు బీమా వచ్చింది కాబట్టి ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్ట పరిహారం కోసం జారీచేసిన 194 జీవో ప్రకారం ఇంక ఏమీ నష్ట పరిహారం రాదని, ఆ జీవో అసలు అమలులో లేదని అంటున్నారు. మీకు అర్హత వుంటే, అంటే భూ యాజమాన్య పట్టా వుంటే రైతు బీమా వస్తుంది,  లేదంటే ఏమీ రాదు అనేస్తున్నారు. రైతు బీమా కౌలురైతులకు వర్తింపచేయటం లేదు. వాళ్లు ఆతహత్యలకు పాల్పడినప్పుడు 194 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు కానీ అసలు అధికారులు ఆ దరఖాస్తును కనీసం పరిశీలించటం లేదు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పేరు మీద భూమి పట్టా లేకపోతే  అసలు పరిగణనలోకి తీసుకోవటం లేదు. అప్పుల కాగితాలను చూపిస్తే ఫోర్జరీ చేస్తున్నారని అవమానిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి భూమికి ఇంత అప్పు ఎలా అయ్యింది అనటం, వ్యక్తిగత కారణాలు అంటే పెళ్లిళ్లు, ఆరోగ్యం, చదువు, హెల్త్, ఇం‌టి నిర్మాణం వంటి వాటిని చూపించి ఇవి వ్యవసాయ సంబంధ అప్పులు కాదని తిరస్కరిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే, ఆ సంవత్సరం లెక్కల్లో సరాసరి ఉత్పత్తి బానే వుంది, మీరు అబద్ధాలు చెబుతున్నారు అని హేళనగా మాట్లాడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు ఇంటి కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా ఇరుగుపొరుగు వారిని అడిగి రిపోర్ట్ ‌తయారు చేసుకుంటూ పోతున్నారు. బాధితులు వెళ్లి అడిగితే ‘మాకు గ్రామంలో తెలిసింది, ఇది మీ ఇంటి సమస్యలతో, భార్యాభర్తల వ్యక్తిగత తగవుల కారణంగా జరిగిన ఆత్మహత్య, కాబట్టి వీటిని గుర్తించేదే లేదు’ అని దబాయిస్తూ  ఉన్నారు. ఏ జిల్లాకు వెళ్ళినా ఇలాంటి బాధితుల గోస వినిపిస్తూనే వుంది. మొత్తం మీద బాధితులకు మరింత  నిరాశ కలిగేలా ‘ఇది రైతు ఆత్మహత్య కాదు, మీకే కాదు ఎవ్వరికీ ఎక్స్ ‌గ్రేషియా ఇవ్వటం లేదు’ అని చెప్తున్నారు. చనిపోతున్న రైతుల సరాసరి వయసు 35 కంటే తక్కువే వుండటం అత్యంత బాధాకరం’’ అని కొండల్‌ ‌చెప్పుకొచ్చారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 7007 మంది అన్నదాతలు బలవన్మరణం పాలవటం, వ్యవసాయం నుంచీ అంతమంది మాయమవడం, అదీ చిన్న వయసులో… తీసిపారేసేంత  చిన్న విషయం కాదని ఈపాటికి అందరికీ అర్థమయ్యే వుండాలి. ఆ రైతులతో ముడిపడిన కుటుంబాలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు వీళ్లందరూ మరింత సంక్షోభంలోకి వెళ్ళినట్లే కదా! వాళ్లు ఈరోజు ప్రతి వొక్కరినీ ప్రశ్నిస్తున్నారు… తమ ఈ సంక్షోభానికి మూల కారణం ఎవరని????? ప్రత్యేక రాష్ట్రంలో తమకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని?????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page