సిఎం కెసిఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది :సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 17 : ఎంతోమంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని మాయమాటలు చెప్పి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణాను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అయిదు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టాడని సిఎల్‌పి నాయకుడు మల్లు బట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రెండోరోజు (బుధవారం) ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజల నుండి పార్టీ శ్రేణుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ఆయన యాత్రకు ఏపీసీసి మాజీ అధ్యక్షుడు శైలజనాథ్ సంఘీభావం తెలిపారు. మధ్యాహ్నం గురకుంట వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కెసిఆర్, కేటీఆర్‌లు రాష్ట్రాన్ని అప్లోడ్ నెట్టారన్నారు. బ్యాంకులు కూడా నేడు మన రాష్ట్రానికి అప్పులు ఇవ్వలేమని చెప్తున్నాయన్నారు.
నాడు కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలని భూములు ఇస్తే, నేడు ప్రభుత్వం వాటిని గుంజుకుంటుందన్నారు. అసైన్ భూములను గుంజుకుని లేఔట్ చేసి అమ్మకానికి పెట్టారన్నారు. అసైన్డ్ భూములను ప్రాజెక్టుల నిర్మాణాలకు, జాతీయ రహదారుల నిర్మాణాలకు తీసుకుంటారన్నారు. అది కూడా 13 యాక్ట్ ప్రకారం డబ్బులు చెల్లించి తీసుకోవాలన్నారు. కానీ ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి పేదవాళ్లను బెదిరించి బలవంతంగా సంతకాలు పెట్టించుకుని దాదాపు 30 వేల ఎకరాలను సేకరించి అమ్మకానికి పెట్టారన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన భూములను వెనక్కు లాక్కుని నేడు బహుళ జాతి కంపెనీలకు అప్పనంగా కట్టబెట్టారన్నారు. ఈ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసింది పేదలు, పోరాడింది ఆదివాసీలు, దళితులు, గిరిజనులు. నేడు వారి భూములు గుంజుకుని వారిని నిరాశ్రయులు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ ప్రజల సంక్షేమం మరచి వారి స్నేహితుల సంక్షేమం కోసం, బహుళ జాతి కంపెనీల సంక్షేమం కోసం చేస్తున్నారని విమర్శించారు. పేదల ఉసురు ఈ తండ్రీ కొడుకులకు తప్పదన్నారు.
కాంగ్రెస్ హాయంలో పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇస్తే నేడు వాటిని కూడా గుంజుకుంటున్నారన్నారు. అదే క్రమంలో ఐడిపిఎల్ వంటి కంపెనీలను అమ్మకానికి పెట్టారన్నారు. ఆనాడు నిజం పరిపాలనపై ఎదురు తిరిగిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నేడు తెలంగాణ ప్రజలు టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఆరు నెలలు కాపాడుకోండి ఆ తర్వాత ధరణిని రద్దు చేసి, కాస్తు కాలాన్ని పునిద్దరిస్తామని చెప్పారు. నీళ్ల పేరు చెప్పి పదవులు పొందారు తప్ప చుక్క నీరు కూడా ఇవ్వలేదన్నారు. సీఎం కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు అన్న కట్టారా అని ఆయన ప్రశ్నించారు. నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ జూరాల నుండి నీళ్ళు తీసుకోలేమని, శ్రీశైలం నుండి తీసుకోవచ్చని అయ్యా మంత్రి 263 టీఎంసీల నీరు జూరాల ప్రాజెక్టు నుండే శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తాయన్నారు. జూరాల నుండి శ్రీశైలం కు నీళ్లు వచ్చే మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర లిఫ్టుల ద్వారా రోజుకు 11 టీఎంసీల నీరు తరలిస్తుందన్నారు. దాంతో శ్రీశైలంలో నీరు ఎక్కడ ఉంటుంది పాలమూరు ఎలా వస్తుంది అన్నారు. శ్రీశైలం నుండి ఎత్తిపోసేందుకు పంపులు పెట్టి ,పైపులు వేసి పైసలు మాత్రం కెసిఆర్ జేబులో వేసుకున్నాడని అన్నారు. ఇక ఎత్తిపోతల ద్వారా నీళ్లు వస్తాయి అన్ని ఉత్త పోతలే అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో నువ్వు మార్చిన పైపులపై మా నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇస్తలేవు అన్నారు. కాంగ్రెస్ హయం లో జూరాల, శ్రీశైలం, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులు కట్టామన్నారు. బీ ఆర్‌ఎస్ నాయకులు నేడు అనుభవిస్తున్నదంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్నారు. పేదలకు ఒక ఇల్లు ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. కానీ గొప్పలు చెప్పుకుని ,మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు రవి, ఒబేదుల్ల కోత్వాల్, జనంపల్లి అనిరుద్ రెడ్డి,సంజీవ్ ముదిరాజ్, ఎర్ర శేఖర్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గన్నారు.