భారతదేశం పారిశ్రామిక వారసత్వం స్వదేశీ బొగ్గుపై నిర్మించబడింది. దేశంలో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు 75% బొగ్గును ఇంధనంగా ఉపయోగించి థర్మల్ పవర్ ప్లాంట్ నుండి ఉత్పత్తి జరుగుతున్నది. వందల మిలియన్ల సంవత్సరాలలో జీవ పదార్థం ఒత్తిడి మరియు వేడి భౌగోళిక శక్తులకు లోబడి ఉన్నప్పుడు బొగ్గు ఏర్పడుతుంది. విశ్రాంత బొగ్గు ఉద్యోగులు పెన్షన్ ను సవరించకపోవడం వల్ల అదే వేడిని మరియు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాము. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తక్కువ పెన్షన్ తో జీవిస్తున్నారు మరియు మా జీవితాలు సామాజికంగా మరియు ఆర్థికంగా పట్టాలు తప్పినాయి. సీఎంపీఎస్ 1998 ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు రిటైర్ అయిన బొగ్గు ఉద్యోగులు పెన్షన్ కు అర్హులు. ఈ సవరణ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. కానీ సీఎంపీఎస్ 1998 ప్రారంభం నుండి, పెన్షన్ ఒక్కసారి కూడా సవరించబడలేదు. పెన్షన్ స్కీమ్ కింద పదవీ విరమణ చేసిన కొంతమంది ఉద్యోగులకు నెలకు ? 500 లోపు అందుతోంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందించే వైద్య మరియు బీమా సౌకర్యాలు ఉద్యోగుల ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. అలాగే బొగ్గు కంపెనీల యాజమాన్యం కూడా వివక్షాపూరిత విధానాలను పాటిస్తోంది.
పెన్షన్ రేటు పెంచాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ధర్నాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాము. కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద జోషికి, నితిన్ గడ్కరి, కిషన్ రెడ్డి ఇతర కేంద్ర మంత్రులు మరియు దాదాపు 100కు పైగా పార్లమెంట్ సభ్యులకు కూడా పలు సందర్భాలలో విజ్ఞప్తి పత్రాలను సమర్పించినాము. భారత ప్రభుత్వం ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ ఆలోచనను ప్రచారం చేస్తున్న, అంటే పాలన అన్ని అంశాలలో స్వావలంబన. ఇప్పుడు విశ్రాంత బొగ్గు ఉద్యోగులు ఆ ఆత్మనిర్భర్తను సాధించేందుకు పెన్షన్ ను కాలానుగుణంగా సవరించాలని ముకుళిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తున్నాము.
పదవీ విరమణ పొందిన బొగ్గు గని ఉద్యోగుల బాధలు అధికారులు పరిశీలించి, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన విధానాలను రూపొందించడం అత్యంత అవసరం. భారత ప్రభుత్వం మా సమస్యలను ‘‘గతి’’ (వేగం)తో పరిష్కరిస్తుందని మరియు ప్రశాంతతతో జీవితాన్ని గడపడానికి మాకు ‘‘శక్తి’’ (శక్తి)ని ప్రసాదిస్తుందని మేము ఆశిస్తున్నాము. కోరుకున్న కోరికలు నెరవేరాలంటే తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది రాళ్ళను రప్పలను చెట్లను కొమ్మలను మొక్కితే అనుకున్న పనులు అవుతాయని నమ్మకం. ఇదే పద్ధతిలో మేము కనిపించిన ప్రతి నాయకుడిని అధికారులను వేడుకుంటున్నాము. మాకు పెన్షన్ పెంచి జీవితపు ఆఖరి రోజులలో ఆనందదాయకంగా ఆరోగ్యంగా ఉండుటకు సహాయ పడాలని మనసారా కోరుతున్నాం.
దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ సింగరేణిభవన్
అధ్యక్షుడు, సింగరేణి రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాద్.
lalliram.sindhu@gmail.com