బీజేపీ ఆశల దక్షిణాది ద్వారం ఒక్కసారిగా కుప్పకూలింది. కేంద్రంలో 9ఏళ్లుగా ఆ పార్టీ అధికారంలో కొనసాగుతున్నా.. కర్ణాటక రాష్ట్రంలో గౌరవ ప్రదమైన స్థానం కోసం ఎదురీత తప్పలేదు. సహజంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కిందిస్థాయిలో బలపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలుత ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్, జెడిఎస్ నుంచి కొన్న శాసన సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర బీజేపీ అధినేతల తీరుతో వారిని కూడా పార్టీలో ఇముడ్చుకోలేని విచిత్ర పరిస్థితి, ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పలితాలతో తేటతెల్లమైంది. కర్ణాటక పోరులో ఎలాగైనా మరోసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ డబుల్ వ్యూహాలు పన్నింది. మోడీ, అమిత్ షా పోటా, పోటీగా కాలుకు బలపం కట్టుకొని కలితిరిగారు. 104 ఉన్న స్థానాలను మేజిక్ ఫిగర్ దాటేందుకు విపక్షాలను బుల్డోజ్ చేయడానికి విద్వేషాలను రగిలించారు. ప్రధాని 2024కు ఫ్రీ ఫైనల్ గా తీసుకున్నాడో ఏమో ఒక్కరోజులోనే 25 కిలోమీటర్ల ‘రోడ్’ షో చేసినారు. అడుగడుగునా హిజాబ్ పేరుతో మంటలు రేపి రాజకీయ ప్రయోజనం పొందాలనే ఎత్తుగడ దక్షిణాదిన చెల్లలేదు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ‘ఉచితాలు’, ‘తాయిలాలు’ అంటూ వ్యంగంగా విమర్శలు చేసిన ప్రధాని మోదీ, దక్షిణాదిలో ఎంట్రీ ఇవ్వడానికి బీజేపీ కూడా అంతకుమించి ఉచిత హామీలిచ్చి, ప్రయత్నాలు చేసి భంగపడ్డది. కర్ణాటక ప్రజల తీర్పు ఒక గుణపాఠం.
ప్రజా సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీ ఉచితాలని సంబోధించటం ద్వారా తాను పేదల వ్యతిరేకినని చెప్పకనే చెప్పి, కర్ణాటక ఎన్నికల్లో బిజెపి తన మేనిఫెస్టోలో అన్నా (ఆహార భద్రత), అభయ (సామాజిక సంక్షేమం), అక్షర (విద్య), ఆరోగ్య (ఆరోగ్యం), అభివృద్ధి (అభివృద్ధి), మరియు ఆదాయ (ఆదాయం) వంటి ఆరు హామీలను జాబితా చేసింది. సమ్మిళిత అభివృద్ధి విభాగంలో, ఉగాది, గణేష్ చతుర్థి మరియు దీపావళి పండుగల సందర్భంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అన్ని కుటుంబాలకు సంవత్సరానికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తామని అధికార పార్టీ వాగ్దానం చేసింది.ప్రతి పేద కుటుంబానికి అరలీటర్ నందిని పాలు, నెలవారీ రేషన్ కిట్లు అందజేసే పోషణే పథకాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. నిజానికి భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల్లో అతి ప్రధానమైనది ‘సంక్షేమ రాజ్య భావన’. రాజ్యాంగంలోని నాలుగో భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ప్రజల కోసం ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలో స్పష్టంగా చెప్పబడింది. కర్ణాటక ఎన్నికల ముందు ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్లను రద్దుచేస్తామని ,ఈ అస్త్రంలో ముస్లిం వ్యతిరేక హిందూత్వ భావజాలం వ్యాపింప జేసి లబ్ది పొందాలనే ఎత్తుగడ నెరవేరలేదు. ఈ మౌలిక సూత్రాలలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కదానిని కూడా నెరవేర్చకపోవటమే కాకుండా, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని రాజ్యాంగ పండితులు మండిపడుతున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికల ఫ్రీ ఫైనల్ గా భావించిన బెస్ట్ ఆఫ్ ఫైవ్ లో మొదటిది కర్ణాటక. బీజేపీయేతర ప్రభుత్వాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరాంలో కాంగ్రెస్ బలపడడానికి ఐక్యత రాగం తీస్తున్నారు. సౌత్ లో పాగా వేయాలనే పగటి కలలకు కన్నడ ప్రజలు కొట్టిన దెబ్బకు కమలం కకావికలం అయ్యింది. తెలంగాణలో మత తత్వ పార్టీకి, కులతత్వ పార్టీకి అవకాశం లేదు. రాజ్యాంగ సంస్ధలను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తూ, ప్రభుత్వాలను కూలదోస్తూ పాసిస్టు పాలన కొనసాగిస్తున్న పార్టీకి ప్రజలు సరైన సమయంలో సరైన దెబ్బకొట్టి ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు, గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా రాష్ట్రాల సమగ్రాభివృద్ధిని దెబ్బతీయడం, ఆకాశానంటిన నిత్యావసర ధరలు, పెట్రో,డీజిల్, గ్యాస్ మంటలు, బీజేపీ పై ప్రతీకారానికి కారణమైంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ వర్గ పోరు కల్సి వస్తుందనుకున్న బిజెపికి ఎన్నికల సమయానికి రాహుల్ చొరవతో అగ్రనేతలు సిద్దిరామయ్య, డి.కె.శివకుమార్ ఒక్కటైనారు. ఓబీసీల కుల జనగణన, ఎస్సి వర్గీకరణ చేయకుండా రాహుల్ పై కక్ష సాధింపుతో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. లింగాయత్ మఠాధిపతి కమీషన్ ఆరోపణలు, సత్యపాల్ మాలిక్ కమీషన్లకు మోడీ వ్యతిరేకం కాదన్న మాటలను పెడచెవిన పెట్టలేదు.దేశ వ్యాప్తంగా అనేక ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊరట కల్గిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదు. ఏది ఏమైనా భారత్ జోడో యాత్ర జవసత్వాలు నింపింది. బీజేపీ ఓటమి ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
ఉత్తరాదిన సన్నగిల్లిన నమో తంత్రంతో దక్షిణాదిపై పెట్టుకున్న బీజేపీ ఆశలు ఆవిరైనాయి. అలాంటిది తెలంగాణపై ఆశలు పెట్టుకోవడం అత్యాశ కాకపోతే ఏమిటని? రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణలో ఒకటి,రెండు మీడియా సంస్థలు హైప్ క్రియోట్ చేయడం వల్ల ,పట్టుమని పది మంది గట్టి అభ్యర్థులు లేని కాషాయం పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎంత తీవ్ర స్థాయిలో ప్రయత్నించినా చేరికలు మాత్రం ఉండటం లేదు. అటువంటప్పుడు తెలంగాణలో గెలుస్తుందని ఎవరూ అనుకుంటారు? కర్ణాటక ఫలితం తర్వాత ఇక తోక ముడిచినట్టే, ఏపీలో నైతే ఆ పార్టీ ఉనికి లేదు. అక్కడి రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు కేసుల నుండి బయట పడేందుకు పోటీ పడి బీజేపీకే మద్దతు అంటూ..ఆ పార్టీ ఏపీలో పాతుకోకుండా చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు బలంగా ఉన్నంత కాలం బీజేపీకి స్థానం లేదు. తమిళనాడులో సిద్దాంత వైరధ్యం ఉంది. అక్కడ ఎదగడానికి ప్రయత్నిస్తున్నా.. కష్టమేనని లెక్కలు చెబుతున్నాయి. ఇక కేరళలో అసలు సాధ్యం కాదు. బీఆర్ఎస్ దూకుడుతో ప్రమాదం ఘంటికలు ముంచుకొస్తున్నాయనే భావంతో కొంగ జపం చేస్తుంది. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఆశలు గల్లంతయినట్లేనని ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి ఉన్న 303 సీట్లలో 90 శాతానికిపైగా ఉత్తరాది నుంచి వచ్చినవే. అలా పెంచుకోవాలంటే ముందు పార్టీ బలపడాలి. ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలో లేకుండా%••%దక్షిణాదిలో పార్టీని విస్తరించడం దుర్లభమవుతంది. అందుకే ఇప్పుడు బీజేపీ కంగారు పడుతోంది.
డా.సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాయం, వరంగల్.
సెల్. 9866255355