తుది దశకు సిద్ధిపేట-మిట్టపల్లి రైల్వే స్టేషన్ పనులు
మంత్రి హరీష్‌రావు ప్రత్యేక దృష్టి…పలుమార్లు సమీక్షలు, పనుల పరిశీలన
సిద్ధిపేట ట్యాగ్ లైన్ సిద్ధిపేట జిల్లా… గోదావరి జలాలు.. రైలు.. ఈ మూడు కలలు ఉండే అందులో సిద్దిపేట జిల్లా 2016లో సిద్దిపేట జిల్లా సాకారమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లో మత్తళ్లు దుంకే జలసిరులు మన కళ్ల ముందు సాక్షాత్కారమైంది. మరో కల సిద్ధిపేట వాసుల సుదీర్ఘ స్వప్నం నెరవేరుతున్నది సిద్దిపేటకు రైలు రాబోతుంది. మంత్రి హరీష్ రావు నిత్య పర్యవేక్షణలో ఇప్పటికే పలుమార్లు రైల్వే అధికారులతో సమీక్షలు జరిపారు. మరో వైపు సిద్దిపేటకు కొద్దీ రోజుల్లో రైలు తేవాలని సిఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టెలా పనులను మంత్రి హరీష్ రావు స్వయంగా వెళ్లి పరిశీలిస్తు సూచనలు చెప్పారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి వరకు నిర్మిస్తున్న రైలు మార్గంలోని తొలి దశ పూర్తయ్యింది. మనోహరబాద్-గజ్వేల్- దుద్దెడ వరకు పనులు పూర్తి కగా..దుద్దెడ• నుండి సిద్దిపేట వరకు ఉన్న 12కిలోమీటర్లకు 1కిలో మిటరన్నర మాత్రమే మిగిలింది. ఆ పనులు చక చక కావాలని మంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.
వచ్చే ఆగస్టుకల్లా సిద్ధిపేటకు రైలు కూత…
ఇప్పటికే సిద్దిపేట జిల్లాలోని సిఎం కేసీఆర్ నియోజకవర్గంలో గజ్వేల్‌లో రైలు ప్రారంబమైంది. అదే దిశగా జిల్లాలో మంత్రి హరీష్ రావు పట్టుబట్టి పనులు పూర్తి చేపించారు. మనోహరాబాద్ నుంచి వర్గల్ మండలం నాచారం, రాయపోల్ మండలం అప్పాయిపల్లి మీదుగా గజ్వేల్ పట్టణం వరకు మూడు స్టేషన్లతో … మనోహరాబాద్ నుంచి నాచారం, బేగంపేట, అప్పాయిపల్లి, గజ్వేల్, కొడకండ్ల రైల్వే స్టేషన్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే గజ్వేల్‌కు గూడ్స్ రైలు ప్రయాణం సాగిస్తున్నాయి. లకుడారం, దుద్దెడ, సిద్ధిపేట స్టేషన్ల ఏర్పాట్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గజ్వేల్ రైల్వే స్టేషన్లో మొత్తం 5 లైన్లుగా రైల్వే పట్టాలను వేశారు. మొదటి మూడు లైన్లలో ప్యాసింజర్ రైళ్లు, 4వ లైనులో గూడ్స్ రైళ్లు, 5వ లైన్లో ప్యాకింగ్, మరమ్మతులు, ఇంజన్ల సైడింగ్ కోసం వినియోగించనున్నారు.ఈ రైల్వే లైన్ గజ్వేల్ నుంచి దుద్దెడ వరకు 32 కిలోమీటర్లు…దుద్దెడ నుండి సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో మరో 32 కిలోమీటర్లు ఉంటుంది. సిద్ధిపేట శివారులో నిర్మించనున్న రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సిద్దిపేట సిరిసిల్ల మధ్య గుర్రాలగొంది వద్ద మరో రైల్వేస్టేషన్ ఏర్పాటు కాకుంది. నాలుగు జిల్లాలు, 70 గ్రామాలు, పలు పుణ్యక్షేత్రాల మీదుగా సాగే ఈ రైల్వేలైన్ మొత్తం పొడవు 151.36 కిలోమీటర్లు.
ఇక తిరుపతికి ట్రైన్ సిద్ధిపేటలో ఎక్కాల్సిందే…
ఇక మీదట సిద్దిపేట ప్రాంత ప్రజలు తిరుపతి వెళ్లాలి అంటే హైదరాబాద్, వరంగల్ పోను అవసరం లేదు. సిద్దిపేట నుండి తిరుపతికి వెళ్లేందుకు సిద్ధిపేటలోనే రైలు ఎక్కొచ్చు. వచ్చే ఆగస్టులో ఆ కల నెరవేరబోతుంది. అదేవిధంగా సికింద్రాబాద్-మన్మాడ్ వెళ్లే మార్గంలో మనోహరాబాద్ నుంచి రైల్వేలైన్ ప్రారంభమై, సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి-నిజామాబాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద కలువనున్నది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే కోల్‌కతా, న్యూఢిల్లీ, ముంబై తదితర మహా నగరాలకు ఈ ప్రాంతంతో రైల్ కనెక్టివిటీ పెరుగుతుంది. భవిష్యత్తులో గజ్వేల్, సిద్ధిపేట రైల్వేస్టేషన్లు కేంద్ర బిందువులుగా మారనున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రయాణీకుల తాకిడి ఎక్కువగా ఉంటున్న దరిమిలా 50 కిలో మీటర్ల దూరంలోని గజ్వేల్ రైల్వేస్టేషన్‌పై మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రారంభించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి ఇక్కడి నుంచి రైళ్లు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారిక వర్గాల ద్వారా తెలుస్తున్నది.
మనోహరబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ విశేషాలు..
రైలు మార్గంలో ఉన్న జిల్లాలు సిద్ధిపేట, రాజన్న సిరిసిల్లా, కరీంనగర్ రైలు మార్గంలో ఉన్న గ్రామాలు 70. రైలు మార్గంలో మొత్తం రైల్వే స్టేషన్లు 15. రైలు మార్గంలో ఉన్న పుణ్యక్షేత్రాలు….వేములవాడ రాజన్న, కొమురవెల్లి మల్లన్న, కొండపోచమ్మ, నాచారం లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయాలు. మొత్తం పొడవు 151.36 కిలోమీటర్లు. మెదక్ జిల్లాలో 9.30 కిలోమీటర్లు. సిద్ధిపేట జిల్లాలో 83.40 కిలోమీటర్లు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో 37.80 కిలోమీటర్లు. కరీంనగర్ జిల్లాలో 20.86 కిలోమీటర్లు. పూర్తిస్థాయిలో పూర్తయిన మార్గం 42.6 కిలోమీటర్లు. రెండవ దశలోని గజ్వేల్ టూ దుద్దెడ 32 కిలోమీటర్లు. దుద్దెడ నుండి సిద్దిపేట నియోజకవర్గ పరిధి గుర్రాలగొంది వరకు 32 కిలోమీటర్లు.
మమ్మరంగా సాగుతున్న సిద్దిపేట రైల్వేస్టేషన్ పనులు..
సిద్దిపేట ప్రజల ఏళ్ల కల సిద్దిపేటకు రైలు. ఆ కలను సాకారం చేసేందుకు మంత్రి హరీష్ రావు అనునిత్యం కృషి చేస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్‌కు రైలు రాగా..దుద్దెడ వరకు రైల్వే లైన్ పనులు పూర్తి అయింది. అదేవిధంగా దుద్డెడ నుండి సిద్దిపేట రైల్వేస్టేషన్ వరకు ఉన్న 12 కిలోమీటర్లలో ఒక కిలోమీటరున్నర మాత్రమే మిగిలి ఉంది. ఈ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. మంత్రి హరీష్‌రావు ఇటీవలే పనులను పరిశీలించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేసుకుని సిద్దిపేటకు రైలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దుద్దెడ నుండి సిద్దిపేట రైల్వే స్టేషన్ వరకు ఉండే 12 కిలోమీటర్లలో అవసరం అయిన చోట బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. బంధారం, బక్రిచెప్యాల, నాంచారుపల్లి, మందపల్లి, మిట్టపల్లి బ్రిడ్జిలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. సిద్దిపేట-హుస్నాబాద్ రోడ్డులో రంగధాంపల్లి వద్ద తాత్కాలికంగా గేట్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌లో బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేయనున్నారు.. మిట్టపల్లి పరిధిలో రూ. 6కోట్లతో నిర్మిస్తున్న రైల్వే స్టేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులు తుదిదశకు చేరుకున్నాయి. అదేవిధంగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని గుర్రాలగొంది గ్రామం వద్ద ఏర్పాటు చేసే రైల్వే స్టేషన్ పనులకు ఇటీవలే టెండర్లు పూర్తి అయ్యాయి. త్వరలోనే మంత్రి హరీష్‌రావు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రజల కలలు నెరుతున్నందుకు ఎంతో సంతృప్తి ఉంది.. మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట జిల్లా… గోదావరి జలాలు.. సిద్దిపేటకు రైలు ఇవీ ఈ ప్రాంతానికి ప్రజల ఎన్నో ఏండ్ల కల.. నాటి ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా సిద్దిపేట జిల్లా.. గోదావరి జలాలు కల నెరవేరింది మన కళ్ల ముందే ప్రత్యక్షంగా కనపడుతున్నాయని మరో కల రైలు వచ్చే రెండు నెలల్లో సిద్దిపేట రైలు రాబోతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక నాయకుడు ప్రజల కల నెరవేర్చేడం కన్న గొప్ప తృప్తి ఏముంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకుంటే.. మన నాయకుడు సిఎంగా కేసీఆర్ లేకుంటే ఇవ్వని కలలు గానే మిగిలిపోయేవి. కానీ, నేడు మన కళ్ల ముందు చూసే భాగ్యం దక్కడం.. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం రావడం అదృష్టంగా భావిస్తున్న అని మంత్రి హరీష్‌రావు అన్నారు.