బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి

ద్రౌపది సంవత్సరానికి ఒకరితో ఉంటుంది. ఆ రోజులలో వారి శయన మందిరానికి మిగిలిన పాండవుల్లో ఎవ్వరైనా వెళ్తే పన్నెండేళ్ళు అరణ్యవాసం చేయాలన్నారు. ఇదివిని నారద మహర్షి సంతోషించాడు. అంతా సుఖశాంతులతో వున్నారు. ఒకసారి దొంగలు ఒక బ్రహ్మణుడి ఆస్తిని దొంగిలించగా, అర్జునుడు ఆ తొందర్లో ధర్మరాజు ద్రౌపది ఉన్న శయనమందిరంలోకి అడుగుపెట్టాడు. నియమభంగం అయిందని అర్జునుడు అడవులకు వెళ్లానన్నాడు. కానీ ధర్మరాజు వారించాడు. ఇలా చెప్పాడు. అన్నగారు శయనమందిరంలో ఉన్నప్పుడు తమ్ముడు రావచ్చును. తమ్ముడి శయనమందిరానికి అన్న వెళ్ళకూడదని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది అన్నాడు. అయినా అర్జునుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అన్నాడు. అడవులకు బయలుదేరాడు. యాత్రలు సాగిస్తూ సాగిస్తూ హరిద్వారం చేరాడు. అర్జునుడు గంగలో స్నానం చేస్తుంటే నాగకన్య ఉలూచి అతగాడిని వలచింది. వారిరువురికీ ఐరావంతుడనే కొడుకు పుట్టాడు.

ఆ తరువాత అర్జునుడు హిరణ్యబిందు తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానమాచరించాడు. ఉత్పలినీ, యశస్వీనీ, నందా, అపరనందా అనే నదులలో వారి పూర్వీకులకు తర్పణాలు విడిచిపెట్టాడు. మణిపుర రాజ్యం చేరగా, ఆరాజ్యానికి రాజైన చిత్రవాహనునిచే గౌరవించబడ్డాడు. రాజకుమారి చిత్రాంగదను చూసి మనసు పడ్డాడు. ఆమెను వివాహమాడ నిశ్చయించాడు. చిత్రవాహనుడు సంతోషించినా, చిత్రాంగదకు పుట్టినవాడే వారికి వంశకర్తగా వుండాలన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి చిత్రాంగదను వివాహమాడాడు.  కొంతకాలం గడచిన తర్వాత వారికి బభ్రువాహనుడనే పుత్రుడు కలిగాడు. మరలా తీర్దయాత్ర ప్రారంభించి, అగస్త్య, సౌభద్ర, పీలోమ, కరంధమ, భరద్వాజ క్షేత్రాలు దర్శించాడు. సౌభద్ర క్షేత్రంలో స్నానం చేయడానికి దిగగానే ఒక ముసలి అర్జునుని పట్టుకుంది. దాన్ని ఒడ్డుకు లాక్కుని రాగానే ఆ ముసలి స్త్రీ ఆకారం దాల్చింది. ఆమె కోరికి మేరకు మరో నాలుగింటిని ఒడ్డుకు లాగగానే అవీ స్త్రీ రూపాలుగా మారిపోయాయి.

(మిగతా..వొచ్చేవారం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page