అంతా అనుకున్నట్లే అయింది. ప్రధాని నరేంద్రమోదీ రాకతో తెలంగాణలో యుద్ధవాతావరణం ఏర్పడింది. ఇంతకు క్రితం నాలుగుసార్లు మోదీ తెలంగాణలో పర్యటించినా బిఆర్‌ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలను సంధించడంతోనే పరిమితమైంది. కాని, శనివారం నాడు ఆయన బిఆర్‌ఎస్‌పైన యుద్ధ భేరీని మోగించినట్లు స్పష్టమవుతున్నది. ఇప్పటివరకు బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల మధ్య సాగుతున్న యుద్ధమల్లా ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర సంబంధా విఘాతానికి దారితీసేలా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సరస్పర సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కుంటుపడే ప్రమాదం ఏర్పడుతుంది. దీని వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదానికి దారితీసేదిగా ఉంది. అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అందులో ప్రాంతేతరుల పాలనలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కుని, ఏడు దశాబ్దాల తర్వాత తమకంటూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరుచుకున్న తెలంగాణ ప్రజలు పురోగమించాల్సిన దశలో తిరోగమనాన్ని చూడాల్సిన పరిస్థితులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరివల్ల ఏర్పడుతున్నది.
నిన్నటి వరకు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించడంలేదంటూ ఆరోపిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి శనివారం రోజు సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన సమాధానం సరస్పర సహకారలోపాన్ని ఎత్తిచూపుతుంది. తెలంగాణ కొత్తగా ఏర్పడినప్పుడే ఎన్‌డిఏ ప్రభుత్వం కూడా కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధికోసం తాము తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే విషయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్న విషయాన్ని ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా పర్యడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో స్పష్టం చేయటంతో ఎవరు ఎవరికి సహకరించడంలేదన్న విషయంలో గందరగోళం ఏర్పడింది. కేంద్రం సహకరించడంలేదని రాష్ట్రం, రాష్ట్రమే సహకరించడంలేదని ఇప్పుడు మోదీ ద్వారా కేంద్రం ఆరోపించడం చూస్తుంటే, ఈ రెండు ప్రభుత్వాలు ప్రజలు, సంక్షేమాన్ని పక్కకు పెట్టి కేవలం తమ ప్రాబల్యానికే పెద్ద పీట వేస్తున్నట్లు కనిపిస్తున్నది. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదని ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్పష్టంచేవారు. రాష్ట్ర ప్రభుత్వ సహకరించకపోవడంవల్ల తెలంగాణలో అభివృద్ధి ఆలస్యమవుతున్నదన్న విషయాన్ని రైల్వేకు సంబంధించిన పనుల జాప్యానికి కారణాన్ని ఆయన ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.
అయితే ఇక్కడ కెసిఆర్ పేరుగాని, బిఆర్‌ఎస్ పార్టీ పేరునుగాని ఉచ్చరించకుండ ఏమేరకు విమర్శించాలో అ మేరకు ప్రధాని కడిగిపారేశాడనే చెప్పవచ్చు. కేంద్రం- రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తుంటే కొందరు కుటుంబం కోసమే పనిచేస్తున్నారని పరోక్షంగా కెసిఆర్ కుటుంబ పాలనను ఆయన ఎత్తిచూపారు. వీరు ప్రతీ పనిలో తమ స్వలాభాన్ని కాంక్షించే పనిచేస్తారని, ఇలాంటివారి వల్లే తెలంగాణ ఇబ్బంది పడుతున్నదంటూ, ఈ అవినీతిని ముక్తకంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పిలుపునివ్వడమేకాదు, అవినీతి- కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని మోదీ ఇచ్చిన పిలుపు ఒక విధంగా బిఆర్‌ఎస్‌పైన జంగ్ సైరన్‌ను మోగించినట్లైంది. ఆయన తన ప్రసంగంలో ఎక్కువగా అవినీతి, కుటుంబ పాలనపైనే కొనసాగించడం గమనార్హం. అవినీతి వేరు-కుటుంబ పాలన వేరుకాదని, అందుకే తెలంగాణను కుంటుంబ పాలన నుండి విముక్తి కలిగించాలని చెబుతూనే కలిగించాలా? వద్దా? అని ఆయన సంధించిన ప్రశ్నకు సభికుల నుండి నినాదాలతో సమాధానం లభించింది. అవినీతిని నిలదీసేందుకు చట్టపరమైన సంస్థలు తీసుకుంటున్న చర్యలకు అడ్డుతగులుతున్నారని, ఆ సంస్థలను పనిచేయనివ్వకుండా అనేక ఆరోపణలు చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణ అన్నది తమ గుప్పిట్లోనే ఉండాలన్నది కొందరి భావన. కాని, ఎంతటి వారైనా సరే చట్టం ముందు ఒక్కటేనని, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందంటూ ప్రతిపక్షాలు ఆరోపణలకు ఆయన సమాధానమచ్చారు.
ఒక్క తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా అవినీతిమయ పాలన అంతానికి తాను చేస్తున్న కృషికి అవినీతిమయ శక్తులు అడ్డు తగులుతున్న విషయాన్ని ఊటంకిస్తూ, తనను వ్యతిరేకిస్తున్న వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల అధినేతలంతా ఏకమవుతున్నారంటూ…వారిని పిరికెడు మందిగా ఆయన అభివర్ణించడమంటే, తనను వ్యతిరేకిస్తున్నవారి బలం చాలా తక్కువేనని ఆయన చెప్పకనే చెప్పారు. తన నిర్ణయాలు, విధానాలను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళిన వీరంతా ఆబాసు పావడమే కాకుండా కోర్టు వారిని చివాట్లు పెట్టిన అంశాన్ని ఆయన ఈ సందర్బంగా ప్రస్తావించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా ఎలా వ్యవహరిస్తున్నదన్న విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేసే విధంగా ప్రధాని సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కోసం స్థానం ఖాళీగా ఉంచారు. అంటే సభకు విచ్చేసినవారంతా ఆ సీటు గురించి మాట్లాడుకోవడం ద్వారా తాము పిలిచినా సభకు సిఎం కెసిఆర్ రాలేదన్న విషయాన్ని పరోక్షంగా ప్రజల్లో ప్రచారం కావాలన్నదే ఆ పార్టీ ఉద్దేశ్యంగా కనిపించింది.
అయితే ఈ సభకు సిఎం రావడం లేదని తెలిసినా కావాలనే బిజెపి నాయకులు అలా చేశారని బిఆర్‌ఎస్ ఆరోపణకు పిఎంఓ తమకా విషయం తెలియదంటుంది. కాగా ఏ రాష్ట్రంలో అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించినా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి పిఎంఓ నుండి ఆహ్వానం రావాల్సి ఉంటుంది. కాని ఇక్కడ అలాంటిదేమీ రాలేదని బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కె. కేశవరావు ఆరోపిస్తున్నారు. అంతేకాదు తనకు పంపిన ఆహ్వాన పత్రంలో ఎంపీల పేర్లు లేవంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే పిఎం రాక సందర్భంగా సింగరేణిని ప్రైవేటు పరం చేసే యత్నాన్ని నిరసిస్తూ బిఆర్‌ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. మోదీ హఠావో..సింగరేణి బచావో అంటూ సింగరేణి అనుబంధ నగరాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు ఒకపక్క, పిఎంపై ఆరోపణలు మరొపక్క హాట్ హాట్‌గా కొనసాగడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జంగ్ షురువయిందన్న సంకేతాలిచ్చినట్లైంది.