దేశ రాజకీయాలపై చర్చించిన అగ్రనేతలు
బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై మోదీకి వివరణ
న్యూ దిల్లీ, ఏప్రిల్ 5 : దిల్లీలో బీజేపీ హైకమాండ్ భేటీ అయ్యింది. పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలు సమావేశం అయ్యారు. దేశంలోని రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం ముగిసిన తర్వాత.. నడ్డా, అమిత్ షా.. ప్రధానమంత్రి మోదీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, ఎంపీ అయిన బండి సంజయ్ అరెస్ట్ అయిన అంశంపై వీరు చర్చించారు. జరిగిన పరిణామాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మోదీ పర్యటనకు ముందు ఇలా జరగటంపై చర్చించారు. అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్‌కు కారణాలు ఏంటీ.. ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. అరెస్ట్ చేసిన తీరును ప్రధాని మోదీకి నడ్డా, అమిత్ షా వివరించారు. 8వ తేదీన రాష్ట్రంలో పర్యటించాల్సిన ఉన్న క్రమంలో.. ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయటం.
చేసిన తీరును ప్రధాని మోదీకి వివరించారు. టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన తీరు రాజకీయ కుట్రలో భాగంగానే ఉందని మోదీకి.. నడ్డా వివరించినట్లు సమాచారం. పరీక్ష సమయం పూర్తయ్యే సమయానికి.. రెండు గంటల తర్వాత.. పరీక్ష రాసిన విద్యార్థులు బయటకు వొచ్చే సమయంలో పేపర్ లీక్ అయ్యినట్లు పోలీసులు చెప్పటం వెనక ఉద్దేశం ఏంటనే ప్రశ్నలను జేపీ నడ్డా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ సైతం స్పందించినట్లు తెలుస్తుంది. న్యాయపరమైన అన్ని అంశాలను పరిశీలించాలని.. బండి సంజయ్‌కు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని స్పష్టం చేశారాయన. రాష్ట్ర నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ..పరిస్థితులను తెలుసుకోవాలని మోదీ సూచించారు.