దేశవ్యాప్త నిరసనదినం జయప్రదం చేయండి –
ఐజేయూ పిలుపు!
అమరజీవి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మార్చ్ 23న నిర్వహించ తలపెట్టిన “సేవ్ జర్నలిజం డే ” నిరసనదినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐ.జే.యూ. జాతీయ కార్యవర్గసమావేశం పునరుద్ఘాటించింది. ఐజేయూ జాతీయకార్యవర్గ సమావేశం మార్చ్ 18 ఉదయం చండీఘడ్ లోని కిసాన్ భవన్ లో ప్రారంభమయ్యింది . రెండవ రోజు
సమావేశానికి ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.
పత్రికా స్వాతంత్ర్యాన్ని , పాత్రికేయవృత్తి అస్తిత్వాన్ని పరిరక్షించుకునేందుకు , పాత్రికేయులపై నానాటికీ పెరిగిపోతున్న దాడులను అరికట్టాలని కోరుతూ మార్చ్ 23 న దేశవ్యాప్తంగా “సేవ్ జర్నలిజం డే” పాటించాలని చెన్నయ్ లో జరిగిన ఐజేయూ ప్లీనరీ సమావేశం పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
దేశంకోసం ఉరికంబాలెక్కిన భగత్ సింగ్ , రాజగురు , సుఖదేవ్ అమరవీరులైన మార్చి 23 న “సేవ్ జర్నలిజం డే ” ను విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని పాత్రికేయులకు ,పౌర సమాజ సంస్థలకు చండీఘర్ లో జరుగుతున్న ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. అన్ని రాష్ట్ర శాఖలు ఈకార్యక్రమాన్ని పెద్దఎత్తున జయప్రదం చేయాలని జాతీయకార్యవర్గం పిలుపు ఇచ్చింది.
సమావేశంలో ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం కార్మికచట్టాలను సవరించి లేబర్ కోడ్లు తెచ్చాక వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి భద్రత మరింతగా దిగజారిందని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రక్షించుకోవాలని , పూర్వం సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలని అన్నారు.
సమావేశంలో ఐ.జే.యు. పూర్వాధ్యక్షులు ఎస్.ఎన్. సిన్హా మరియు దేవులపల్లి అమర్, ట్రిబ్యూన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అనిల్ గుప్తా, ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు శ్రీవాస్తవ్, తదితరులు మాట్లాడారు.
సమావేశాల్లో తెలంగాణా నుంచి వై .నరేందర్ రెడ్డి, ఎం. ఏ. మాజిద్, దాసరి కృష్ణారెడ్డి , కే.సత్యనారాయణ , నగునూరి శేఖర్ , విరాహత్ ఆలి, కే.రామ్ నారాయణ్ ,ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు , జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ కుమార్ , డి.సోమసుందర్, ప్రత్యేకఆహ్వానితులు నల్లి ధర్మారావు ,రాష్ట్ర అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఐవి సుబ్బారావు ,చందు జనార్ధన్ హాజరయారు