కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : రాష్ట్ర స్థాయి అధికారి హోదాలో పనిచేస్తున్న కరీంనగర్ జిల్లా, కోతగట్టు గ్రామానికి చెందిన కోరెం అశోక్ రెడ్డి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) హోదాను పొందారు. ఈ మేరకు రాష్ట్రంలోని పలువురు సీనియర్ గ్రూప్ 1 అధికారులకు ఐఎఎస్ క్యాడర్‌కు పదోన్నతి కల్పించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. దీంతో ఈ జాబితాలో ఉన్న అశోక్‌రెడ్డి ఐఎఎస్‌కు పదోన్నతి పొందారు. కోతగట్టు గ్రామానికి చెందిన కోరెం అశోక్ రెడ్డి ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత హుజురాబాద్ పట్టణంలో రవిశంకర్ శుక్లా, ఒంటెల రమణారెడ్డి, విప్లవ్ దత్ శుక్లాల ఆధ్వర్యంలో స్థాపించిన విశ్వప్రగతి స్కూల్లో కొద్దికాలం హాస్టల్ వార్డెన్ గా పనిచేసారు. విద్యాభ్యాసాన్ని అమితంగా ప్రేమించే ఆయన ఆనంతరకాలంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎం.ఏ. (పొలిటికల్ సైన్స్) పూర్తిచేశారు.
ఆ తర్వాత ఆయన ఉమ్మడి ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ వన్ అధికారిగా ఎంపికయ్యారు. 1999 నుండి 2002 వరకు అశోక్ రెడ్డి వరంగల్ జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2002 నుండి 2004 వరకు చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారిగా పనిచేసిన అశోక్ రెడ్డి 2004 నుండి 2006 వరకు సర్వశిక్ష అభియాన్ (డిపిఈపి) ప్రాజెక్ట్ అధికారిగా విధులను నిర్వర్తించారు. ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో అశోక్ రెడ్డి పనితీరును గమనించిన ముఖ్యమంత్రి తమ స్వంత జిల్లా కడపలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆయనను నియమించారు. అశోక్ రెడ్డి కడపలో 2006 నుండి 2009 వరకు పనిచేశారు. 2009 నుండి 2011 వరకు ఆయన హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై స్కీమ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.
2011 నుండి 2012 వరకు రంగారెడ్డి జిల్లా సహాకార అధికారిగా, 2012 నుండి 2014 వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్లో అదనపు కమిషనర్‌గా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడ్డ తొలి మంత్రి వర్గంలోని నీటిపారుదల శాఖ మంత్రిహరీష్ రావు వద్ద ప్రైవేట్ కార్యదర్శిగా 2014 నుండి 2018 వరకు పనిచేశారు. 2019 లో తొమ్మిది నెలల పాటు మూసినది నీటి అభివృద్ధి సంస్థ మానేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. 2019 నుండి ఇప్పటివరకు అశోక్ రెడ్డి రాష్ట్ర ఆర్ధిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావుకి ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాగా ఐఎఎస్ అధికారిగా అశోక్‌రెడ్డి పదోన్నతి పొందడం పట్ల ఆయన స్వగ్రామమైన కొత్తగట్టుతో పాటు కరీంనగర్ జిల్లాలోని పలువురు స్నేహితులు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.