విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రతిఘటించాలి

దేశంలో తొలిసారిగా విదేశీ విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు వీలుగా యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమీషన్‌ ( ‌యు.జి.సి) ‘భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థల ప్రాం గణాల ఏర్పాటు – నిర్వహణ’ పేరుతో ముసా యిదా నిబంధనలను విడుదల చేయడం విస్మ యానికి గురిచేసింది. ఆయా విదేశీ విశ్వ విద్యాలయాలకు అనుమతులు ఇచ్చే దిశగా యు.జి.సి చైర్మన్‌ ఎం.‌జగదీష్‌ ‌కుమార్‌ ‌శరవే గంగా అడుగులు కదుపుతూ ముసాయిదా ప్రతిపాదనలపై ఈనెల 18 వ తేదీ లోగా సలహాలు, సూచనలు పంపించాలని పేర్కొనడం అటు విద్యార్థులనే కాకుండా ఇటు అధ్యాపకులు మరియు విద్యారంగ మేధావులను తీవ్రంగా కలచి వేస్తుంది. జాతీయ విద్యా విధానం – 2020 సిపార్సుల మేరకే విదేశీ విశ్వవిద్యాలయాలను స్వాగతి స్తున్నట్లు ఆయన పేర్కొన్ననూ అవి అంతిమంగా సంపన్న వర్గాల లబ్ధికే దోహదపడే విధంగా ఉంటాయని స్థూలంగా అంచనా వేయవచ్చు. దేశీయ విద్యార్థులకు దేశంలోనే అధిక నాణ్యత గల అంతర్జాతీయ విద్యని అందించడం అనే లక్ష్యంతో విదేశీ విశ్వ విద్యాలయాలను స్వాగ తిస్తున్నట్లు ఆయన వ్యక్తీకరించడం ఏమాత్రం సహేతుకంగా కనిపించడం లేదు.

దేశాన్ని విశ్వ విద్యా కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఈ ముసాయిదా ప్రతిపాదనలు రూపొందించినట్లు యు.జి.సి. ఛైర్మన్‌ ‌జగదీష్‌ ‌కుమార్‌ ‌పేర్కొన్ననూ అవి యదార్థానికి ఆమడ దూరంలో ఉన్నాయని చాలా సృష్టంగా అర్థమ వుతుంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖ విశ్వ విద్యాలయాలు మనదేశంలో విద్యా సంస్థలను లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్ననూ విద్య మరింత వ్యయంతో కూడుకున్నదిగా మారి ‘బలహీన వర్గాలకు అందని ద్రాక్ష’గా పరిణమించే ప్రమాదాన్ని ఆయన గుర్తించ కపోవడం ఏమాత్రం సహేతుకం కాదు. విదేశీ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలు పొందాలనుకునే మనదేశ విద్యార్థులలో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారు ఉంటే వారికి వివిధ మార్గాలలో ఆర్థిక సహాయం అందించే విధంగా వెసులుబాటు కల్పిస్తామని ఆయన వెల్లడించడం ఏమాత్రం నమ్మశక్యంగా కనిపించడం లేదు. విదేశాలలో చదువుకోవడానికి మనదేశం నుండి ఏటా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు వెళుతున్నారని, దేశంలోనే విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పడితే వారికి నివాస వ్యయం, ట్యూషన్‌ ‌ఫీజు తగ్గి మరింత తక్కువ ఖర్చుతో వారు కోరుకున్న విదేశీ విద్యని అభ్యసించగలుగుతారు అనే వాదన సహజంగానే ముందుకు వచ్చిననూ మరో రకంగా టాప్‌ 500 ‌ర్యాంక్‌ ‌లో గల విదేశీ మాతృ విద్యాలయాలలో ఉన్న విద్యా ప్రమాణాలు భారతదేశంలో నెలకొల్పబోయే విద్యాసంస్థలల్లో ఏ మేరకు సాధింపబడతాయో అనేది మిలియన్‌ ‌డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోగలదు. అంతేకాకుండా ఆయా స్వదేశీ విద్యార్థులు విదేశాలలో చదువు కుంటూనే సంపాదించుకునే ( లెర్నింగ్‌ ‌బై ఎర్నింగ్‌) అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

ఒకవైపు అనువైన ఫీజులు అంటూనే మరోవైపు నచ్చిన రీతిలో ఫీజుల విధానాన్ని రూపొందించుకునే స్వేచ్ఛని ఆయా విదేశీ విశ్వవిద్యాలయాలకు వదిలి వేయడం అంటేనే ఫీజులు అత్యధిక స్థాయిలో ఉండబోవచ్చు అనే విషయాన్ని చాలా సులువుగా ప్రాథమికంగా అంచనా వేయవచ్చు. దీనిని బట్టి విదేశీ విద్య మొత్తం కార్పోరేట్‌ ‌కనుసన్నులలో వ్యాపా రాత్మకంగా మారబోతుంది అనే విషయం చాలా సృష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి విశ్వ విద్యాలయాల పేరుతో భారతీయ సంపదను విదేశాలకు కొల్లగొట్టడానికి అనువుగా ము సాయిదా ప్రతిపాదనలు ఉండడం విస్తు గొలుపుతుంది. ఫీజుల నిర్మాణం పారదర్శకతని పాటిస్తూ సహేతుకంగా ఉండాలి అనే తూతూ మంత్రపు నిబంధనలు ఉండడం గమనార్హం. ఒక పక్క విదేశీ విశ్వవిద్యాలయాలు స్థాపించే సంస్థలు తాము ప్రారంభించబోయే కోర్సుల యొక్క ప్రవేశాలకు సంబంధించిన ఫీజుల వివరాలను 60 రోజుల ముందే వెల్లడించాలని పేర్కొంటున్ననూ మరోపక్క దేశంలో క్యాంపస్‌ ‌లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆయా విదేశీ విశ్వవిద్యాలయాలు తమ అడ్మిషన్‌ ‌ప్రక్రియ, ఫీజుల నిర్మాణం మరియు వారి మాతృ క్యాంపస్‌ ‌లకు నిధులని స్వదేశానికి పంపించే స్వేచ్ఛని కలిగి ఉంటాయి అని యు.జి.సి ముసాయిదా ప్రతిపాదనలో పేర్కొనడం స్వేచ్ఛా వాణిజ్యానికి దోహదం చేసే విధానానికి బలాన్ని చేకూరుస్తుంది అనే విషయం చాలా సృష్టంగా తేటతెల్లం అవుతుంది.

నిజానికి భారతదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించేందుకు భారత ప్రభుత్వం 1995 నుండి విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకు సంబంధించిన తొలి బిల్లును 1995 లో తీసుకురాగా అది పలు కారణాలతో అది ముందుకు కదలలేదు. మళ్ళీ 2005-06 లోనూ ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చిననూ అది కూడా కేబినేట్‌ ‌దాకా వెళ్లి అక్కడే ఆగిపోయింది. చివరగా 2010 లో యు.పి.ఎ – 2 ప్రభుత్వం విదేశీ విద్యాసంస్థల బిల్లుని ప్రవేశపెట్టగా కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించగా అది పార్లమెంట్‌ ఆమోదాన్ని పొందడంలో విఫలమైనది. నాడు విదేశీ విధానాలను తూర్పారా స్వదేశీ జపం చేసి విదేశీ విశ్వవిద్యాలయాల బిల్లుని వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ నేడు ఆ బిల్లుపై అత్యంత ఉస్తుకతని ప్రదర్శించడం విడ్డూరంగా ఉంది. విదేశీ విద్యని భారతదేశ విద్యార్థులకు చేరువ చేయడమే ప్రధాన ఉద్దేశ్యం అని నూతన విద్యావిధానం మార్గదర్శకాల ప్రకారం యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమీషన్‌ ‌వెల్లడించిన ప్పటికి అది ముమ్మాటికీ సంపన్నుల కోసమే దోహదం చేస్తుంది తప్ప సామాన్యులకు ఒరిగేది ఏమి లేదు. సామాజిక న్యాయం అమలు కానేకాదు. ఆయా విదేశీ విశ్వవిద్యాలయాలు దేశీయ విశ్వవిద్యాలయాలను మరింతగా దెబ్బతీస్తాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటికే దేశీయ విశ్వవిద్యాలయాలలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ఫలితంగా విద్యార్థుల భవిషత్తు మరింత ప్రమాదకరంగా మారనుంది. అందువలన బుద్ధిజీవులు యూనివర్సిటీ గ్రాంట్స్ ‌కమిషన్‌ ‌విడుదల చేసిన విదేశీ విశ్వవిద్యాలయాల ముసాయిదా ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ అంతిమంగా విదేశీ విశ్వవిద్యాలయాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– జె.జె.సి.పి. బాబూరావు
రీసెర్చ్ ‌స్కాలర్‌, 94933 19690.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page