మంచి మిత్రుడిని కోల్పాయాను
కృష్ణ భౌతిక కాయం వద్ద సిఎం కెసిఆర్ నివాళి
కుటుంబ సభ్యులకు పరామర్శ..ప్రభుత్వ లాంఛనాలతో నేడు అంత్యక్రియలు
మంత్రులు, ఎంపిలు నివాళి
హైదరాబాద్, ప్రజాతంత్ర: తానో మంచి మిత్రుడిని కోల్పోయానని కృష్ణ మృతిపై సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. కృష్ణ మంచి నటుడే గాకుండా, ఓ ఎంపిగా దేశానికి అద్భుత సేవ చేశారని, అల్లూరి సీతారామరాజు లాంటి దేశభక్తి సినిమాను తీసారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నానక్‌రాంగూడలోని కృష్ణ నివాసానికి చేరుకుని సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి అర్పించారు. మహేష్ బాబు, కృష్ణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన చెందారు. సుప్రసిద్ధ నటుడు కృష్ణ మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కృష్ణ అని అన్నారు.
పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేశారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాను చాలా సార్లు చూసినట్లు తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కెసిఆర్ వెంట మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ఎంపి సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. నానక్‌రాంగూడలోని విజయకృష్ణ నివాసానికి చేరుకున్న కేటీఆర్.. అక్కడ కృష్ణ భౌతికకాయం వద్ద పూలు ఉంచి అంజలి ఘటించారు. మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.