వడ్లు కొనమంటే కొనరు…కాని వందల కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను కొంటారు

ప్రజల కోసం పని చేయాలి తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాదు
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు… ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
బిజెపిపై మంత్రి హరీష్‌రావు మండిపాటు
సిద్ధన్నపేటలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర: కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తుందనీ, వడ్లను కొనమంటే కొనరు. కానీ, వందల కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యేలను మాత్రం కొనుగోలు చేస్తుందనీ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కేంద్రంలోని బిజెపి సర్కార్‌పై తనదైన శైలిలో మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలి తప్ప ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కాదన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని సిద్ధన్నపేటలోని వ్యవసాయ మార్కెట్‌ ‌యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారనీ, తగిన సమయంలో బిజెపికి ప్రజలు తగు గుణ పాఠం చెబుతారనీ మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికీ జిల్లాలో లక్ష నుండి లక్షన్నర మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం పండగ ప్రస్తుతం ఐదు లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం పండుతుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రైతన్నల కోసం రాష్ట్రంలోని పెండింగ్‌ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ ‌కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వాగులు, నదులపై చెక్‌ ‌డ్యాముల నిర్మాణం వలన రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భూగర్భ నీటి వనరుల అభివృద్ధి చెంది రాష్ట్రంలో కోటి మెట్రిక్‌ ‌టన్నుల వారి ధాన్యం ఒక సీజన్‌లోనే పండుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరి ధాన్యం ఉత్పత్తి పెరుగుతూ వొస్తుందన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించడంతో, ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుల నిర్మాణంతో అధిక పంట ఉత్పత్తి సాధ్యమైందన్నారు. గతంలో యాసంగి పంట అంటే వెనుక మడి ఎండకుండా పంట పండేది కాదనీ, ప్రస్తుతం గుంట కూడా ఎండకుండా బంగారంలాగా రెండు పంటలు పండుతున్నాయి. గతంలో వాన కాలం వొచ్చిందంటే వర్షాల కోసం రైతులు ముఖాలను మొగులు వైపు పెట్టి వర్షాల కోసం ఎదురు చూసేవారనీ, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. కాలంతో పని లేదనీ, కాళేశ్వరం నీళ్లు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఇప్పుడు వర్షాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, వాన కాలమైన, ఎండాకాలమైనా నీటికి కొదువ లేదన్నారు. రంగనాయక సాగర్‌ని నిండు కుండలా నింపుకొని ఆ నీటిని జిల్లాలోని అన్ని చెరువులను నింపి పంట పొలాలకు నీటిని అందిస్తున్నామన్నారు. కొంతమంది హైదరాబాద్‌లో కూర్చుని కాళేశ్వరం ఫలితం రాలేదని ఎద్దేవా చేస్తున్నారనీ, ఫలితం రాలేదనీ అనేవారు హైదరాబాద్‌ను వదిలి గ్రామాల్లో తిరిగితే పచ్చని పల్లెలలో ఉండే రైతులు సమాధానం చెప్తారన్నారు. భూగర్భ జలాల సమృద్ధిగా ఉండడంతో కొత్తగా బోర్లు వేయాల్సిన అవసరం లేక పల్లెల్లో బోరుబండ్లు, క్రేన్లు కనబడడం లేదన్నారు.

రంగనాయక సాగర్‌తో అన్ని గ్రామాల్లో చెరువులు, పంట పొలాలను నింపుతున్నామనీ, ఈసారి పెదవాగులోకి కూడా వీటిని వదిలి చెక్‌ ‌డ్యాములను నింపనున్నామన్నారు. వరి ధాన్యానికి క్వింటాలకు 2060రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనీ, రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామనీ, రై•తులందరూ తప్పనిసరిగా ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. ధాన్యం ఎండేలా కోసిన వెంటనే రెండు రోజులు పొలంలో ఎండబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలనీ, వరి ధాన్యం కొన్న మూడు రోజుల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమయ్యేలా ప్రభుత్వం నిధులను సమకూర్చిందన్నారు. గడిచిన యాసంగి కాలంలో వరి ధాన్యాన్ని కొనమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే నూకలు ఎక్కువగా వస్తాయని రాష్ట్రంలోని ప్రజలతో నూకలు తినిపించాలని కేంద్ర మంత్రులు అవమానించారనీ గుర్తు చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేసి వారం రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిందనీ, ఈ వానకాలం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒక కోటి మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం పండిందనీ,తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్యగారంగా మారిందన్నారు. రాష్ట్రంలో 20వేల వరి కోత యంత్రాలు, కూలీలు ఎంతమంది ఉన్నా కూడా వరి ధాన్యం కోయడానికి ఎదురు చూసేంత విపరీతమైన ధాన్యం రాష్ట్రంలో పండిందన్నారు.

ఇదంతా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయమన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం రైతుల బావుల వద్ద మోటార్లకు మీటర్‌ ‌పెట్టి రైతులకు బిల్లులు పంపియాలని అలా చేస్తేనే రాష్ట్రానికి ఇచ్చే 30 వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెబుతున్నారన్నారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకొని వేల కోట్ల రూపాయల కేంద్రం వద్ద నుండి తీసుకున్నారన్నారు. కానీ, సిఎం కేసీఆర్‌ ‌రాష్ట్రంలోని 65 లక్షల రైతుల క్షేమమే ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 30 వేల కోట్ల రూపాయలను కూడా రైతుల కోసం వదులుకుని మోటార్లకు మీటర్ల పెట్టనని తెగేసి చెప్పారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి కేసీఆర్‌ ‌ప్రభుత్వం తీసుకున్న చర్యల మూలంగా రాష్ట్రం ఏర్పడే నాటికి ఒక ఎకరానికి 4 లక్షల రూపాయలు ఉన్న భూమి విలువ ప్రస్తుతం 40 నుండి 50 లక్షల రూపాయలకు పెరిగిందనీ, తద్వారా రైతులకు కూడా విలువ పెరిగిందన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో త్వరగా కొనుగోలు చేసేలా, రైస్‌ ‌మిల్లులో ధాన్యం దింపుకోవడానికి తరుగు ఇతరత్రా పేరుతో ఇబ్బంది పెట్టకుండా త్వరగా దింపుకునేలా, రైతులకు త్వరగా పేమెంట్‌ అం‌దేలా ఆర్డీవోలు, తహశీల్దార్లు, మార్కెట్‌ ‌కమిటీ ఛైర్మన్లు, ఐకెపి సిబ్బంది పర్యవేక్షించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. పెద్ద రైతులు ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు ముందుకు రావాలనీ, ఆయిల్‌ ‌పామ్‌ ‌తోటలు పెంచడానికి ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందన్నారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌పెంపకంతో మూడు సంవత్సరాల తర్వాత రెట్టింపుకు మించి ఆదాయం వస్తుందనీ, మరియు నెల నెలా జీతంలాగా ఆదాయం ప్రతి నెలా వస్తుందన్నారు. పామాయిల్‌ ‌పంట అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్లకుండా నర్మెటలోనే 300 •ట్ల రూపాయలతో ఆయిల్‌ ‌పామ్‌ ‌ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందన్నారు. ఆయిల్‌ ‌ఫామ్‌తో పాటు సెరికల్చర్‌ ‌పంటలను పండించాలనీ, దీనికి కూడా ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందనీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌తో పాటు స్థానిక టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page