బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
కొంతకాలం తరువాత, పాండురాజుకు పర్వంతవన ప్రాంతాల్లో విహరించాలనే కోరిక కలిగింది. భార్యలిద్దరినీ తీసుకుని హిమాలయ ప్రాంతానికి వేటకై వెళ్ళాడు. గాంగేయుడు విదురుడిక్కూడా వివాహంచేయాలని తలచి తగిన వినయ సంపన్న కన్య కోసం ప్రయత్నించి, చివరకు దేవకునే రాజుగారి పుత్రికను తెచ్చి వివాహం జరిపించాడు.పాండురాజు వన విహారినికి వెళ్తే, ధృతరాష్ట్రుడు సర్వాధికారి అయ్యాడు. ఆయన రాజ్యపాలన గావిస్తున్నాడు. ఆ సమయంలో ఒకనాడు వ్యాస మహిర్షి విచ్చయగా గాంధారి ఆయనకు పరిచర్యలు గావించి మెప్పించింది. మహర్షి చాలా సంతోషించి ఆమెకు వరం ప్రసాదించాడు. నూరుగులు బిడ్డలకు తల్లి కాగలవన్నాడు.అక్కడ పాండురాజు ఒకలేళ్లజంట రతిక్రీడలో ఉండగా అధర్మమని కూడా తలచకుండా తన బాణాలతో కొట్టిచంపాడు. ఒక లేడి ఆక్రందనంతో మరణించే ముందు పాండురాజుని శపించింది. ఆ లేడి రూపంలో ఉన్నది కిందముడనే ముని. మునీ, అతని భార్యా లేడి రూపంలో సుఖించాలనుకుంటే బాణాలకు గురయ్యారు.
‘మహారాజా! కురువంశీయులు సిగ్గుపడే పని చేశావు. రతి క్రీడలో ఉన్న మృగాలను కరకుగుండె ఉన్న కిరాతుడు కూడా కొట్టడు. అలాంటిది రాజ వంశంలో పుట్టిన నీవు హింసకు పాల్పడ్డావు. అందువలన నీవు కామదృష్టితో స్త్రీని దగ్గరకు తీసుకుంటే ఆక్షణాన ప్రాణం విడుస్తావు’ అంటూ శపించాడు కిందముడు. పాండురాజు చాలా బాధపడ్డాడు. ధనుర్భాణాలు విడిచి సన్యాసం స్వీకరించాలనుకున్నాడు. ఆయన భార్యలు సన్యాసం ఎందుకు, వన ప్రస్థమార్గం అనుసరిద్దామన్నారు. మేమూ మీతోనే ఉంటాం అన్నారు. పాండురాజు అందుకు అంగీకరించి అనుచరులందరినీ రాజధానికి పంపి, తాను తన భార్యలతో కూడి పర్వత వన ప్రాంతాలు తిరిగాడు. శతశృంగపర్యతం చేరాడు. మునులతో సత్కాలక్షేపం గావించాడు. ఇంద్రియాలపై పట్టు సాధించే ప్రయత్నం గావించాడు. తపోధీక్షలో ఉన్నాడు. ఒకనాడు ఆ ఋషులను తాను పితృ ఋణవిముక్తి ఎలా పొందగలనంటూ ప్రశ్నించగా, వారు పాండురాజుకు పరాక్రమవంతులైన పుత్రులు కలిగే అదృష్టం ఉందన్నారు. కావున చింతించవల్సిన పని లేదన్నారు.
ఆ తరువాత పాండురాజు కుంతిని సమీపించి, మాతృపితృవంశాలను ఉద్దరించడానికి సంతానాన్ని కనాలి. ఖంధుదాయాదులూ అఖంధు దాయాదులు అంటూ పన్నెండు విధాలుగా సంతాన పొందే అవకాశం ఉంది. ఉత్తమ పురుషులతో కలిసి పొందే సంతానాన్ని ప్రణీతులు అంటారు. నీవు ఆ మార్గంలో సంతానాన్ని పొందాలని కోరాడు. కుంతి అందుకు అంగీకరించలేదు. అతనికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది పాండురాజు ఆమెకు ధర్మాధర్మ నిర్ణయాల గురించి వివరించాడు. భర్త మాటకు ఎదురుచెప్పకుండా ఆయన శాసనాన్ని పాటించడమే స్త్రీకి పరమోత్తమ ధర్మం. అలాంటి మహోత్తమ ధర్మాన్ని విడచి ఎన్ని మంచి పనులు చేసినా, పూజలూ, వ్రతాలూ సాగించినా వ్యర్థమే. భర్త మనస్సు తెల్సుకుని భార్య ప్రవర్తించాలి. అలా గాక భర్తకు భాధ కలిగిస్తూ ఎన్ని ధర్మకార్యాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అని పాండురాజు ఆమెకు గట్టిగా చెప్పాడు.
(తరువాయి..వొచ్చే సంచికలో)