రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 1 :
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర 55వ రోజు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి నుండి మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. తొండుపల్లె నుండి ప్రారంభమైన జోడోయాత్ర శంషాబాద్ ఆరంఘర్ మీదుగా హైదరాబాద్ నగరంలోని బహదూర్ పూరాలో ప్రవేశించింది. ఆరంఘర్ సమీపంలో పలు పాఠశాలల విద్యార్థులు రాహుల్ గాంధీని కలిశారు. కొంతమంది విద్యార్థులు చేసిన విన్యాసాలను ఆయన స్వయంగా వీక్షించారు. బహదూర్ పుర కాంగ్రెస్ నాయకుడు ఖలీమ్ బాబా ఆధ్వర్యంలో నేషనల్ పోలీస్ అకాడమీ వద్ద రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం మంత్రముగ్ధులను చేసింది. బహదూర్ పుర ప్రవేశం తర్వాత సెక్యూరిటీ వలయంలోకి నాయకులు కార్యకర్తలు అధికంగా దూసుకువెళ్లడంతో నిలువరించడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. హైదరాబాద్ నగరంలోకి యాత్ర ప్రవేశించడంతో ట్రాఫిక్ ఇతర సెక్యూరిటీ అంశాలు పోలీసులకు సవాలుగా మారాయి.
సోమవారం పాలమాకుల దాటిన తర్వాత ఒక వ్యక్తి సెక్యూరిటీ వలయంలోకి దూసుకు వెళ్లిన సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు మంగళవారం మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ముగ్గురు ఐపీఎస్ అధికారులు పాదయాత్ర వెంట ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా శంషాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. రాహుల్ యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. కాంగ్రెస్ సైనికులు వేలాదిగా తరలి రావడంతో యాత్ర శుభమయమానంగా ఉత్సాహంగా సాగింది. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో యాత్ర ఆద్యంతం పులకించిపోయింది. రాహుల్ గాంధీని చూడటానికి ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. అందరికీ ఆయన చేయి ఊపుతూ అభివాదం తెలియజేశారు. మహిళలు పిల్లలు కనిపిస్తే వారిని ఆప్యాయంగా పలకరించారు. కొందరు చిన్నారులను తన వెంట నడిపించుకుంటూ వెళ్లారు.