- పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు, వేలాదిగా ప్రజలు
- ఆదివాసీలతో కలసి గుస్సాడి నృత్యం చేసిన రాహుల్
- యాత్రలో పాల్గొన్న సిఎల్పీ నేత భట్టి
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ జనసందోహం నడుమ..రాహుల్ శనివారం ఉదయం ధర్మాపూర్ వద్ద యాత్రను ప్రారంభించారు. రాహుల్ వెంట పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల సందడితో పాదయాత్ర రూట్ కిక్కిరిసిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్రకు మంచి ఆదరణ లభిస్తున్నది. శనివారం మహబూబ్‌నగర్ మీదుగా జడ్చర్ల వరకు పాదయాత్ర కొనసాగింది. 20.3 కిలోవి•టర్ల మేర రాహుల్ పాదయాత్ర చేశారు. కాగా రాహుల్ వెంట సిఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, పలువురు నేతలు నడుస్తున్నారు. సాయంత్రం పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్రలో జాయిన్ అయ్యారు.
యాత్ర సందర్భంగా రాహుల్ పలువురిని కలుస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభూత్వాల వైఫల్యాలపై రాహుల్ గళమెత్తుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని..పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అత్యంత ఉల్లాసంగా..ఉత్సాహంగా కొనసాగుతున్నది. పాదయాత్రకు వొస్తున్న వందలాది మందితో కలిసి రాహుల్.. తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ పట్టణంలోకి ప్రవేశించిన సమయంలో లంబాడ కళారూపాలతో ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. గిరిజనులతో కలిసి రాహుల్ సంప్రదాయ నృత్యం చేశారు. ఎమ్మెల్యే సీతక్క, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా రాహుల్‌తో కలిసి కాలు కదిపారు. ఇక, పాదయాత్ర చేస్తున్న సమయంలో.. సమస్యలపై ప్లకార్డులు చూపిస్తున్న వారివద్దకు రాహుల్ గాంధీ వెళ్లారు.
వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక, పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులతో కూడా రాహుల్ గాంధీ ముచ్చటించారు. ఉస్మానియా వర్సిటీ పీహెచ్డీ స్కాలర్స్, తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ జేఏసీ సభ్యులతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా పీహెచ్డీ స్కాలర్స్, వర్సిటీ జేఏసీ సభ్యులు.. తాము ఎదుర్కుంటున్న సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు. ఇక, పలువురు పారిశుద్ద్య కార్మికులు రాహుల్ గాంధీతో కలిసి ఫొటోలు దిగారు. శనివారం యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివాసీలతో కలిసి గుస్సాడీ నృత్యం చేశారు.
రాహుల్ గాంధీ పాదయాత్రలో సినీ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు పూనమ్ కౌర్ కొద్దిసేపు కలిసి నడిచారు. చేనేత కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీతో మాట్లాడినట్టుగా పూనమ్ కౌర్ చెప్పారు. రాహుల్ గాంధీ సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని అన్నారు. చేనేత సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించాలని రాహుల్‌ను కోరానని చెప్పారు. రాహుల్ తమతో కలిసి నృత్యం చేయడంతో ఆదివాసీ మహిళలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క, సంపత్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్‌తో కలిసి స్టెప్పులు వేశారు. కొమ్ము కోయ కళాకారులతో కలిసి రాహుల్ ఉత్సాహంగా నృత్యం చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివాసీల కళారూపం గురించి వివరించారు.
భారత్ జోడో యాత్రలో కొమ్ముకోయ కళారూపం ఆకట్టుకుంటుంది. భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క..ఖమ్మం జిల్లాకు చెందిన ఆదివాసీలతో కొమ్ము కోయ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. దీనిని రాహుల్ మహబూబ్ నగర్ పాదయాత్రలో ఆసక్తిగా తిలకించినట్లు భట్టి సోషల్ వి•డియాలో పోస్ట్ చేశారు. కొమ్ము కోయ ప్రదర్శనలో కళాకారులతో కలసి రాహుల్ లయబద్ధంగా అడుగులు వేస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. రాహుల్ గాంధీ..విద్యా సంబంధిత సమస్యలపై వివిధ సంస్థలు, ప్రముఖులతో భేటీ అయ్యారు. పాలమూరు విద్యావంతుల వేదిక తరపున ప్రో. హరగోపాల్, రఘవాచారి, ఎం.వి ఫౌండేషన్ తరపున వెంకట్ రెడ్డిలతో పాటు స్వచ్చంద సంఘాల నాయకులు నీలిమ, విద్యార్థి నాయకులు తదితరులు రాహుల్ గాంధీతో ఎనుగొండ క్యాంప్‌లో భేటీ అయ్యారు.
సమగ్ర విద్యా విధానం, ఫీజు రీయంబర్స్మెంట్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమస్యలు, విద్యార్థులకు కలుషిత ఆహారం, సౌకర్యాల లేమి, యూనివర్సిటీలలో సమస్యలు తదితర అంశాలపై చర్చించారు. ఇక యాత్రంలో సినీ నటి పూనమ్ కౌర్ కూడా పాల్గొని.. రాహుల్‌తో ముచ్చటించారు. కాగా..భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట వొస్తున్న కార్యకర్తలు, అభిమానుల సందడితో పాదయాత్ర రూట్ కిక్కిరిసి పోవడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి..ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ యాత్రలో రాహుల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గళమెత్తుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని..పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నారు.