రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు
కేంద్రంలో రైతులపై నల్ల చట్టాలతో నడ్డి విరుస్తున్నారు
రాష్ట్రంలో గిరిజన దళితు రైతుల భూములను లాక్కుంటున్నారు
రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రైవేటు చేతుల్లోకి
ఫీజు రియంబర్స్‌మెంట్ లేక విద్యార్థుల కలలు చెదిరిపోతున్నాయి
నవ భారతావని కోసం ప్రజలు నాంది పలకాలి
జడ్చర్ల సభలో రాహుల్ గాంధీ
టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు రాజకీయ పార్టీలు కావని వ్యాపార పార్టీలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట నిలువునా ముంచడంతో అన్నదాతల ఘోష మొరపెట్టుకోలేక ఆత్మహత్యలతో అల్లాడిపోతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థను ప్రైవేటు చేతుల్లో పెట్టి అప్పనంగా డబ్బులు దండుకుంటున్నారని, విద్యాశాఖను నిర్వీర్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఘాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు. శనివారం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర సందర్భంగా నాలుగవ రోజు పాదయాత్ర అనంతరం జడ్చర్లలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఓ పక్క రైతులపై నల్ల చట్టాలను తెస్తూ రైతుల నడ్డి విరుస్తుంటే రాష్ట్రంలో అమాయక రైతుల భూములను లాక్కుంటున్నారని టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని ప్రజలు గమనించాలన్నారు.
లోక్‌సభలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ప్రకటించారని, రాష్ట్రంలో మాత్రం రైతులపై ప్రేమ చూపిస్తున్నట్టు నాటకాలు చేస్తున్నారన్నారు. ఆరుగాలం కష్టపడి రైతన్నలు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతులు వ్యవసాయం చేసి పండించిన పెట్టుబడి కూడా రాక లబోదిబోమంటున్నారన్నారు. పాదయాత్రలో విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకుంటే విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ లేక చదువుకోలేక కూలీలుగా మారుతున్నామని చెప్పడంతో గుండె చలించిపోయిందన్నారు. ఒక విద్యార్థిని అడిగి తెలుసుకుంటే ఆ విద్యార్థి కల మెకానికల్ ఇంజనీర్ కావాలని అనుకున్నాను కానీ జొమాటో డెలివరీ బాయ్‌గా అయ్యానని తెలిపాడని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వొస్తే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాన్ని చేపడతామన్నారు. అలాగే రాష్ట్రంలో విద్య, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేసి విద్యాలయాలు కళాశాలలు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. భారతదేశంలో పేదలతో పాటు ధనికులు కూడా ఉన్నారని భారతదేశాన్ని గర్వంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకుందామన్నారు. జోడో యాత్రకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వొస్తున్నారని యాత్ర నది ప్రవాహంలో కొనసాగుతుందన్నారు. విద్వేషాలు సృష్టిస్తున్న పార్టీకి గుణపాఠం చెప్పాలని నవ భారతావని కోసం అందరూ కలిసి రావాలని అన్నారు.