బిజేపీ కొత్త నాటకం
కాంట్రాక్టుల కోసమే రాజ గోపాల్ రాజీనామా
మునుగోడు ఎన్నికల ప్రచారంలోమంత్రి హరీష్ రావు
చౌటుప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : హుజురాబాద్, దుబ్బాకలలో ఇలాంటి మాయమాటలు చెప్పి మోసం చేశారు..ఇప్పుడు మునుగోడు ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు..అని మంత్రి హరీష్ రావు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. ఉప ఎన్నికకు మ్యానిఫెస్టో విడదల చేయడం హాస్యాస్పదం..అని పేర్కొంటూ..‘‘మ్యానిఫెస్టోలో అంశాలు సత్య దూరం..టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టో పెట్టారు..కేంద్రం నాలుగు టెక్స్ టైల్ పార్క్‌లు పెడితే తెలంగాణకు మొండి చేయి చూపించారు. దుబ్బాకలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దుబ్బాక ప్రజలకు మొండి చేయి చూపించారు. దుబ్బాక ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి..అని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసారు. తెలంగాణకి టెక్స్ టైల్ పార్క్ ఇస్తామని కేంద్రం మోసం చేసింది. మునుగోడులో వంద పడకల హాస్పిటల్, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం పాత ముచ్చట…దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా 2016లో ప్రకటించి ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదన్నారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించినా ఇప్పటివరకు హామీ నెరవేర్చలేదు..జేపీ నడ్డాను డిమాండ్ చేస్తున్నాను. అరేండ్ల కింద ఇచ్చిన హామీ ఏమైందో చెప్పి ఇక్కడ వోట్లు అడగాలి. నవోదయ పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పడం ఒక జోక్..కొత్తగా ఏర్పాటు చేసుకున్న జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని దరఖాస్తు చేసుకున్నా వీళ్ళు పట్టించుకోలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. హక్కుగా రావాల్సిన నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని మూడేండ్ల నుండి అడుగుతుతున్నాం..కేంద్రానికి దరఖాస్తులు పెట్టుకున్నా స్పందించ లేదు..ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన పార్టీ బీజేపీ…ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఉద్యోగాల కల్పన అని చెప్పడం హాస్యాస్పదం. ఎనిమిది సంవత్సరాల పాలనలో ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం..బీజేపీ సంగతి దేశంలో యువతీ యువకులు అర్థం అయింది. అమృత్ సరోవర్ పథకానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శం. మిషన్ కాకతీయ ను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని పెట్టారు. తెలంగాణ అద్భుతమైన పద్ధతిలో జరిగిన చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయను కాపీ కొట్టింది.
మిషన్ భగీరథ హార్ ఘర్‌కో జల్ పథకానికి ఆదర్శం. మిషన్ భగీరథకి 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా ఒక్క పైసా ఇవ్వలేదు. కృష్ణా నది జలాల్లో మా వాటా తేల్చమని అడిగిన స్పందన లేదు. కేంద్ర మంత్రులను అడిగిన మా వాటా తేల్చలేదు. నీళ్ల వాటా తేల్చని వాళ్ళు ప్రాజెక్ట్‌లకు పైసలు ఏం ఇస్తారు. దేశములో పోలవరం, అప్పర్ భద్ర, కెన్ బెత్వ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వండి. నల్గొండ జిల్లా ప్రజలకు బీజేపీ అన్యాయం చేస్తుంది. కృష్ణ నదీ జలాల్లో వాటా తేల్చకుండా నల్గొండ, మహబూబ్ నగర్‌కి కేంద్రం అన్యాయం చేసింది..నడ్డా వాటా ఎందుకు తేల్చలేదో చెప్పాలి. బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ చుస్తే, ధర వింటేనే ప్రజల కళ్ళల్లో నీళ్ళు వొస్తున్నాయి…ధరను ఎందుకు పెంచారో చెప్పాలి. సిలిండర్లు పోయి కట్టెల పొయ్యి వొచ్చింది. ప్రజలు ధరలు తగ్గించాలని అంటున్నారు. అధికారంలోకి రాకముందు ధరలు తగ్గిస్తామని చెప్పి మూడింతలు పెంచారు. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు అభివృద్ధి కన్నా…కాంట్రాక్టుల మీద ప్రేమ ఎక్కువ. మునుగోడులో ఖచ్చితంగా గెలిచేది టీఆర్ఎస్.
మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేయలేదు..కాంట్రాక్టుల కోసం రాజీనామ చేశాడని మునుగోడులో ఎవ్వరిని అడిగినా చెప్తారు. హుజుర్నగర్, నాగార్జున సాగర్‌లో వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మునుగోడు ప్రజలు డిసైడ్ అయిపోయారు. శివన్న గూడెంలో పది లక్షలు ఇస్తా అని..ఒక్క రోజు అటు వైపు వెళ్ల లేదు. మూడు వేల పెన్షన్ హుజురాబాద్, దుబ్బాకలో ఎందుకు ఇవ్వలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మూడు వేల పెన్షన్ లేదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దేశానికి ఆదర్శంగా ఉన్నాయి. దేశంలో టాప్ 20లో టాప్ 16 తెలంగాణ గ్రామలే. నిధులు ఇవ్వనిదే టాప్ ర్యాంక్‌లో ఉన్నాయా?..రాష్ట్ర విభజన చట్టంలో వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చే 1300 కోట్లు విడదల చేయాలి. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే నిధులు విడదల చేయాలి. రాజగోపాల్ రెడ్డికి మునుగోడులో ఒక్క కొబ్బరికాయ కొడితే వంద పనులు అవుతాయని చెప్పాడు. రాజగోపాల్ రెడ్డికి కొబ్బరికాయ దొరకలేదా చెప్పాలి..మ్యానిఫెస్టోలో డ్రామా పేరుతో ప్రజల ముందుకు వొచ్చారు. దుబ్బాక, హుజురాబాద్‌లో జరగని అభివృద్ధి ఇక్కడ ఎలా జరుగుతుందని మంత్రి హరీష్ బిజేపీపై నిప్పులు చెరిగారు.