పెద్ద ఎరుపు కాదు కానీ అదో మెరుపు!
ఓ చిన్న కాడకు
నాలుగు రెక్కల కుసుమం
తావి లేని పరాగం!
అయినా నీ సిగలో అదో అద్బుతం!
ఓ రెండు మూరల దండ!
బారెడుజడలో దూరి ముంగురులతో
అల్లరి చేస్తూ చెక్కిళ్ళపై ఆడుతుంటే!
ఎక్కడో గుండెల్లో గుబులు అయ్యేది
మనసు ఎందుకో దిగులు పోయేది!
ప్రతీ రోజు నీకోసమే పూచేవేమో?
మరెన్నో విరులు ఉన్నా అదే
నీ కురులలో సిగ్గులు పోయేది!
గాలి వాలుకు అటూ ఇటూ ఊగి
నీ ముఖంచూసి మొగ్గలు వేసేది!
ఏదో పెద్ద వరం పొంది ఉండాలి
నిన్ను చేరాలంటే ,
ఎంతో గొప్ప పుణ్యం చేసి ఉండాలి
నువ్వు దక్కాలంటే!
దాని జీవితం ఒక్క రోజే అయినా,
జీవిత కాలం నీ సమక్షంలోనే మరి!
అందుకేనేమో నాకు తెలియకుండానే
దాని మీద కడవంత ప్రేమ పుట్టింది!
నీకు దగ్గరైంది కాబట్టి!
కొండంత అసూయ పుట్టింది!
నువ్వు అక్కున చేర్చుకున్నావు కాబట్టి!
అయినా!.. నాదో చిన్న సందేహం!
కనకాంబరాలనే కనికరించిన నువ్వు
నన్నెందుకు కనికరించలేదో?
– ఉషారం, 9553875577