సంతలో బేరం.. మునుగోడు కోలాహలం..

రాజకీయాల్లో డబ్బు ఖర్చు చేయడం పెట్టుబడిగా మారిపోతుందని, రాజకీయం ఫక్తు వ్యాపారంలా మారు తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలే దీనిని సృష్టిస్తున్నాయి. సామాన్య జనానికి అందనంతగా ఎన్నికల ఖర్చును తీసుకుని వెళ్లాయి. ప్రజలను కూడా వోటుకు నోటు అన్నచందంగా తయారు చేశారు. గెలిచాక తమ మొఖం చూడరన్న రీతిలో ప్రజలు కూడా ఎవరు ఎంత ఇస్తారన్న ధోరణిలో ఉన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ముప్పు అంచున ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. గతంలో హుజూరాబాద్‌లో వందలకోట్లు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుచేశారు. ఇప్పుడు మునుగోడులోనూ అదే పద్దతి నడుస్తోంది. తెలుగు రాష్టాల్ల్రో ఎన్నికలంటేనే భయపడే పరిస్థితిని తీసుకుని వొచ్చారు. ఇంతగా డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్న గణాంకాలను లెక్కించే యంత్రాగం ఎన్నికల సంఘం వద్ద లేదు. తూతూ •మంత్రంగా ఎన్నికల వ్యయపరిశీలకులు తమ పరిధి మేరకు లెక్కలు వేసుకుని పోతున్నారు. దేశంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే మన తెలుగు రాష్టాల్ల్రోనే ఈ దౌర్భాగ్యం ఉంది.

మన దేశంలోని ఎనిమిది ఈశాన్య రాష్టాల్ల్రో ఎన్నికల ఖర్చును ఒక ఉప ఎన్నికల్లో తగలేస్తున్నారు. అసోం, అరుణాచల్‌‌ప్రదేశ్‌, ‌మణిపూర్‌, ‌మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, ‌త్రిపుర, సిక్కింలో 498 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈశాన్య రాష్టాల్ల్రో ఎన్నికల ఖర్చు సుమారు రూ.వెయ్యి కోట్లేనని అంచనా. అంటే, ఒక్కో అసెంబ్లీ సీటుకు అక్కడ పార్టీల ఖర్చు రూ.2 కోట్లు దాటదు. కానీ, ఈ ఆరు రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికల్లో చేసే ఖర్చును ఒక్క ఉప ఎన్నకలోనే ఖర్చు చేస్తుండడం గమనార్హం. అధికారంలో ఉండగా పథకాలతో ప్రజలను బందీలను చేస్తున్నారు. దీంతో పన్నులు కట్టిన ప్రజల సొమ్ము కూర్చుని తినేవాళ్ల పరం అవుతోంది. ఇది సమాజంలో అశాంతిని రేపుతోంది. ధరల పెరుగుదలకు కారణం అవుతోంది. అభివృద్ది మందగించింది. ఎన్నో అనర్థాలకు ఇది కారణంగా మారుతోంది. ప్రజలు కూడా ఈ ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ఇప్పటికే దిగజారిన రాజకీయాలను ప్రస్తుత ధనస్వామ్యం మరింత పాతాళానికి చేర్చనుంది. సామాన్యులకు చట్టసభల్లో ప్రవేశించే అర్హత లేకుండా పోతోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో చేసిన ఖర్చుపై ఇప్పటి వరకు చర్చ సాగుతోనే ఉంది. ఇక్కడే దళిబంధు పుట్టింది. దళితులు తమకు ఆసరాగా భావిస్తున్న ఈ పథకం డబ్బుల పందేరంగా సాగి.. వింతగా మాట్లాడుకుంటు న్నారు. ఈ ఎన్నికలో ఈటలను ఓడించేందుకు టిఆర్‌ఎస్‌ ‌విపరీతంగా డబ్బులను వెదజల్లింది.

ఇప్పుడు మునుగోడులో అంతకుమించి అన్నట్లుగా డబ్బులు వెదజల్లు తున్న తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదిగా కనిపిస్తోంది. హుజూరాబాద్‌లో కోట్లు ఖర్చు చేస్తే.. మునుగోడు ఉప ఎన్నికకు అన్ని పార్టీల ఖర్చూ కలిపి వెయ్యి కోట్లు దాటేస్తుందని, ఎన్నికల ఖర్చులో తెలంగాణ పాత రికార్డులు బ్రేక్‌ ‌చేసి కొత్త రికార్డు రాయడం ఖాయమని చెబుతున్నారు. కండువా కప్పు కుంటే రూ.30 వేలు అంటూ ..మునుగోడు లో ఆపరేషన్‌ ఆకర్ష్‌తోపాటు నేతల కొనుగోలు కొత్తపుంతలు తొక్కుతోంది. మొబైల్‌ ‌యాప్‌ల ద్వారా డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడిపోతున్నాయి. కేవలం కండువా కప్పుకుంటే చాలు రూ.30 వేలు ఖాతాల్లో పడిపోతున్నాయి. ఇటీవల గట్టుప్పల్‌ ‌మండలంలో ఓ పార్టీలో చేరేందుకు వచ్చిన నాయకుడి తో పాటు అనుచరులకూ ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమచేసేశారన్న ప్రచారం సాగుతోంది. కొనుగోళ్ల వ్యవహారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల్లోనూ సాగిందన్న ప్రచారం ఉంది. ఎన్నికల్లో గెలవడం..ఓడితే కొనుగోలు చేయడం అన్నచందంగా మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. అధికారం పొందేందుకు..నిలబెట్టుకునేందుకు.. పడగొట్టేందుకు అన్న చందంగా బేరాలు సాగిస్తున్నారు. ఇప్పుడు అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తారస్థాయికి చేరింది. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. బిజెపి కూడా ఇప్పుడు అదే దోవలో నడుడస్తోంది. వారే మడికట్టుకుని కూర్చోలేదు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు సగటున రూ.2 లక్షల చొప్పున కొన్ని పార్టీలు పంపిణీ చేశాయి. రోజులు గడిచేకొద్దీ రెండు లక్షలన్నది చాలా చిన్న మొత్తం అయిపోయింది. మునుగోడు ఉప ఎన్నికతో తాజాగా వీరికి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలు పలుకు తోందని స్థానికంగా ముక్కున వేలేసుకుంటు న్నారు. గతంలో ఒక పార్టీ డబ్బిచ్చినా.. ఇప్పుడు మళ్లీ రెండో పార్టీ కూడా డబ్బిస్తోంది. అయితే, తమ పార్టీ తరఫున పనిచేయాలని చెబుతోంది. కుదరకపోతే, ఇప్పుడున్న పార్టీ తరఫున పని చేయకుండా ఉండాలని చెబుతోంది. పార్టీలో చేరితే ఇంత..ఉన్న పార్టీలో సైలెంట్‌గా ఉంటే ఇంత అన్న చందంగా రాయబేరాలు నడిపిస్తున్న తీరు ఆందోళన కలిగించే అంశంగా పరిగణించాలి. ఇకపోతే ఛోటామోటా లీడర్లు తెలివి రారు. ఎన్ని పార్టీలు ఎంత ముట్ట చెప్పినా తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఎన్నికలంటే డబ్బుతో పెద్దగా పని ఉండేది కాదు. ఆంధ్ర ప్రాంతంలో ఎన్నికల ఖర్చును రికార్డు గా చెప్పుకొనేవారు. అక్కడితో పోలిస్తే ఎన్నికల ఖర్చు, వోటుకు డబ్బు పంపిణీ తెలంగాణలో చాలా తక్కువ స్థాయిలో ఉండేది.

మండలాల వారీగా, పోలింగ్‌ ‌దగ్గరకు వచ్చాక గ్రామాల వారీగా ఎన్నికల్లో ఎవరి పార్టీ కార్యాలయాలను వారు నిర్వహించుకునేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌ ‌మారింది. ఎన్నికకు చాలా ముందు గానే ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు భవనాలను అద్దెకు తీసుకుంటు న్నారు. ప్రతి ఊళ్లోనూ చికెన్‌, ‌మటన్‌తో భారీఎత్తున విందు భోజనాలు పెడుతున్నారు. మునుగోడునే తీసుకుంటే ఆత్మీయసమ్మేళనాల పేరుతో గత నెల రోజులుగా దసరా జరుగుతోంది. దుర్గమ్మజాతరలను తలపిస్తోంది. సాయంత్రం అయితే విందు ఖాయం అన్న భరోసాతో ప్రజలు ఎదురుచూసేలా చేస్తున్నారు. సోషల్‌ ‌డియా ప్రచారానికి కూడా లెక్కలేనంతగా చేయివిదులుస్తున్నారు. గ్రామస్థులను నమ్మించడానికి లోకల్‌ ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు. గతంలో వోటు కోసం బీదాబిక్కీలకు పోలింగ్‌కు ముందురోజు రూ.100 నుంచి రూ.300 చొప్పున ఇచ్చి వారు పోలింగ్‌ ‌కేంద్రాలకు వొచ్చేలా చేసేవారు. ఇప్పుడు సీన్‌ ‌మారింది. ఒక ఎన్నికలో ఇంత ఖర్చు చేస్తే.. మరో ఎన్నికలో అంతకుమించి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఈ పరిస్థితి మారకుంటే సామాన్యుడికి దూరంగా రాజకీ యాలు నడుస్తాయని ప్రజలు గుర్తించాలి. ప్రజల్లోనే మార్పు రావాలి. లేకుంటే మూల్యం చెల్లించుకునేది తామే అని గుర్తించాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page