- ప్రభుత్వ శాఖలకు సిఎస్ సోమేష్ కుమార్ అభినందన
- బిజినెస్ రిఫార్మస్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు అధికారులతో సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 12 : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పటిష్టంగా అమలు చేయడంలో పలు సంస్కరణలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థాయిలో(టాప్ అఛీవర్స్) నిలిపినందుకు ప్రభుత్వం లోని పలు శాఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అభినందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత పటిష్టంగా అమలు చేసేందుకై బిజినెస్ రిఫార్మస్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సిఎస్ బుధవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల్లో భాగంగా, వ్యాపార, వాణిజ్య ప్రోత్సాహాలకు అనుకూల విధానాలు ఉండేలా ప్రస్తుత నిబంధనల వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకువొస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. మెరుగైన సమాచార మార్పిడి, పారదర్శకతకు అవసరమైన చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు తమ శాఖల పనితీరులో సామర్థ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని సిఎస్ పేర్కొన్నారు.
ఈఓడీబీ సంస్కరణల అమలుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉన్నందున, ఫలితాల ఆధారితంగా పూర్తి చేసేలా చూడాలని సిఎస్ అధికారులను కోరారు. ప్రస్తుత బిజినెస్ రూల్స్ యాక్షన్ ప్లాన్ ఈఓబిడికి సంబంధించి 540 సంస్కరణలు అమలు చేస్తున్నట్టు సిఎస్ వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు.