నిజాం తరహాలో… పేదల భూములను గుంజుకుంటున్న కేసీఆర్‌ ‌సర్కార్‌

  • రైతుల భూములకు గుర్తింపు, హక్కు లేకుండా చేయడమే లక్ష్యం
  • న్యాయం జరిగే వరకు పోరాటం
  • టిజెఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ప్రొ।। కోదండరామ్‌

తెలంగాణ ప్రభుత్వం నిజాం తరహాలో పేదల భూములను గుంజుకుంటున్నదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ ఆరోపించారు. సోమవారం కొండాపూర్‌ ‌మండల పరిధిలోని గిర్మాపూర్‌ ‌గ్రామం నుంచి కలెక్టరేట్‌ ‌వరకు త్రిపులార్‌లో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ‌ముందు ధర్న నిర్వహించి కలెక్టర్‌ ‌శరత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. కేసీఆర్‌ ‌ప్రభుత్వం రాష్ట్రంలో పేదల భూములు ఎక్కడ ఉన్న అడ్డగోలుగా భూములు గుంజుకుంటున్నారని విమర్శించారు. గతంలో నిజాం ప్రభుత్వం పేదల భూములను గుంజుకుని వెట్టి చాకిరి చేయించారని, ప్రస్తుతం కేసీఆర్‌ ‌ప్రభుత్వం కూడా నిర్దాక్షిణ్యంగా పేదల భూములను గుంజుకుని రోడ్డు పాలు చేస్తుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో పేద రైతుల భూములను ప్రభుత్వం గుంజుకుంటుందని, వారికి అండగా ఉంటూ.. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.

పేద రైతుల భూములకు గుర్తింపు, హక్కు లేకుండా చేయడమే కేసీఆర్‌ ‌ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంగారెడ్డి ప్రాంతంలో రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు పేర విచిత్రం జరుగుతుందని, అవసరం లేకపోయినా గిర్మాపూర్‌ ‌నుంచి శివ్వంపేట వరకు నాలుగు లైన్ల రోడ్డు వేసేందుకు నిర్ణయించి సుమారు 300 మంది పేద రైతుల నుంచి భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు.సంగారెడ్డి నుంచి నాందేడ్‌ ‌నుంచి కంది మీదుగా నాలుగు లైన్‌ల రోడ్డు బెంగుళూరు రోడ్డును కలుపుతూ వేశారని, కానీ గిర్మాపూర్‌ ‌నుంచి పెద్దాపూర్‌ ‌శివ్వంపేట వరకు ఎవ్వరికి ఎలాంటి ఉపయోగం లేకపోయిన నాలుగు లైన్‌ల రోడ్డు వేసేందుకు ప్రభుత్వం భూములు గుంజుకోవడం విచిత్రంగా ఉందన్నారు. అవసరం లేని రోడ్డు ఎందుకు వేస్తారని..? వెంటనే ఆ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

గిర్మాపూర్‌ ‌నుంచి శివ్వంపేట వరకు వేసే రోడ్డు రద్దు చేయడం వల్ల గిర్మాపూర్‌, ‌పెద్దాపూర్‌, ‌చింతలపల్లి, ఇరిగిపల్లి, నాగపూర్‌, ‌కలబ్‌ ‌గూర్‌, ‌కులబ్‌ ‌గూర్‌ ‌గ్రామాలకు చెందిన భూములు కోల్పోతున్న 300 కుటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు. అదే విధంగా భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్టం ప్రకారం.. పరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ ‌రాష్ట్ర నాయకురాలు లక్ష్మీ, జిల్లా అధ్యక్షుడు తుల్జా రెడ్డి, భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు అనంతయ్య, ప్రధాన కార్యదర్శి మహిపాల్‌, ఉపాధ్యక్షుడు జైరాం, సంయుక్త కార్యదర్శి రమేష్‌, ‌భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page