కర్నాటక గ్రామంలో వెల్లివిరిసిన ఆనందం
ఇరువర్గాలతో కలసి రాహుల్ భోజనం
ఇదే జోడో లక్ష్యం అని ప్రకటించిన కాంగ్రెస్
బెంగళూరు,అక్టోబర్3:కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర కోసం సోమవారం మధ్యాహ్నం మైసూరు చేరుకున్నారు. గురువారం ఉదయం (అక్టోబర్ 6) రెండు రోజుల విరామం తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమైనప్పుడు ఆమె యాత్రలో పాల్గొంటారు.అంతకు ముందు .. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా వర్గ విభేదాల కారణంగా విడిపోయిన రెండు వర్గాలతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. ఇదే భారత్ జోడో యాత్ర స్ఫూర్తి అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలో సాగుతోంది. ఇందులో భాగంగా ఓ గ్రామంలో వర్గ విభేదాల కారణంగా విడిపోయిన రెండు వర్గాలను ఆదివారం సహపంక్తి భోజనాలతో కలిపారు. రాహుల్ గాంధీతో పాటు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్ గ్రామస్థులతో కలిసి భోజనం చేశారు. ఈ రెండు వర్గాలను కలపడానికే ఈ భోజనాలు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ తెలిపింది. దీంతో 29 ఏళ్ల తర్వాత ఆ వర్గాల ప్రజలు ఒక్కటయ్యారని చెప్పింది.గ్రామస్థులతో కలిసి భోజనం చేస్తున్న రాహుల్ గాంధీ1993లో జరిగిన గొడవ తర్వాత.. ఇరు వర్గాలు నివసించే ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు శ్రమదానం చేసి.. రోడ్డును పునరుద్ధరించారు. దీనికి భారత్ జోడో రోడ్డు అని పేరు పెట్టారు. ’దాదాపు 30 ఏళ్ల క్రితం వర్గ విభేదాల కారణంగా బడనవాలు అనే గ్రామంలో నరమేధం జరిగింది. ఇప్పటివరకు ఆ వార్గాల మధ్య ఆ దూరం అలానే ఉంది. కానీ ఇప్పుడు ఆ రెండు వర్గాలతో కలిసి రాహుల్ గాంధీ భోజనం చేశారు. విరిగి పోయిన వారి మనసులను తిరిగి రాజీ పడేలా చేశారు. ఇది భారత్ జోడో యాత్ర విజయం అని కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.