భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కలిసివచ్చే పార్టీలన్నీ ఐక్యం అయ్యేందుకు ఒక పక్క మంతనాలు జరుగుతుంటే, కాంగ్రెస్‌లో మాత్రం నిత్యం ఎక్కడో ఒక దగ్గర అంతర్ఘత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు దేశంలోని పలు పార్టీలు చాలా కాలంగా వ్యూహరచన చేస్తున్నాయి. అయితే కేంద్రంలో ఎదురులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజెపిని ఎదుర్కునే స్తోమత ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న ఏ ఒక్క పార్టీకి లేదు. అందుకే భావసారూప్యం ఉన్న పార్టీలన్నీ ఒక తాటిపైకి వొచ్చే విషయంలో పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఒక వేళ ఈ పార్టీలన్నీ సంఘటితమైతే దానికి సారథ్యం వహించేది ఎవరన్న విషయంలోకూడా తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ విషయంలో పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ విస్తృత ప్రచారంలో ఉన్న వారు మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. బిజెపి, కాంగ్రెసేతర కూటమిగానే దీన్ని తీర్చిదిద్దాలని తెలంగాణ సిఎం కెసిఆర్ ఎలుగెత్తి చాటుతుంటే, మమతా బెనర్జీ, నితీష్‌కుమార్ లాంటి వారు మాత్రం కాంగ్రెస్‌ను కలుపుకుపోవాలంటున్నారు. తాజాగా నితీష్‌కుమార్‌తో పాటు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జెడి(యు) నేత లాలూప్రసాద్ యాదవ్‌లు జరిపిన సమావేశం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నది. వీరిద్దరు తాజాగా ఆదివారం కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధితో ఆమె నివాసం 10 జన్‌పథ్ సమావేశమై బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టే విషయంపైన సుదీర్ఘంగా చర్చించారు.
ఆ సమావేశానంతరం నితీష్ మీడియాకు తమ సమావేశ వివరాలను వెల్లడిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపే విషయంలో ప్రతిపక్షాలతో కలిసి పనిచేయాలన్న విషయంపై కాంగ్రెస్‌తో ఒక అవగాహనకు వొచ్చామని చెప్పారు. అంటే థర్డ్ ఫ్రంటో, కూటమో దానికి ఏ పేరు పెట్టినా అందులో కాంగ్రెస్‌కు మినహాయింపు లేదన్నది దీనిద్వారా స్పష్టమవుతున్నది. ఈ సమావేశానికి ముందు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డి) వ్యవస్థాపకుడు చౌదరీ దేవీలాల్ 109వ జయంతిని పురస్కరించుకుని హరియాణ మాజీ సిఎం ఓంప్రకాశ్ చౌతాలా అధ్వర్యంలో ఫతేహబాద్‌లో జరిగిన బహిరంగ సభలో నితీష్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నేతలు కూడా హాజరవడం గమనార్హం. హిందూ, ముస్లింల మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బిజెపికి అడ్డుకట్టవేసి, దేశ సమైక్యతను కాపాడాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెబుతూ, అందుకు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే పార్టీలుకూడా కూటమిలో భాగస్వాములు కావాలని నితీష్ పిలుపునివ్వడాన్ని బట్టి, భవిష్యత్‌లో కాంగ్రెస్ లేకుండా బిజెపిపై పోరాటం సాధ్యంకాదన్న అభిప్రాయం బిజెపియేతర పార్టీలకు ఉన్నట్లు స్పష్టమవతున్నది. విచిత్రమేమంటే ఈ కూటమికి సారథ్యం వహిస్తారన్న ప్రచారంలో ముందున్న తెలంగాణ సిఎం కెసిఆర్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీలు ఈ సమావేశంలో పాల్గొనకపోవడం. అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్భీర్ సింగ్ బాదల్, ఎన్సీపి నేత శరద్ పవార్, సిపిఎం కార్యదర్శి సీతారం ఏచూరి, ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వీయాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా లాంటివారు సమావేశానికి హాజరైనవారిలో ఉన్నారు.
అయితే ఈ కూటమికి కొద్ది వ్యవధి కావాలన్న సోనియాగాంధి అభ్యర్థనను వీరంతా అంగీకరించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి ఎన్నికలు ఉండడంతో ఆ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కూటమిపై చర్చిద్దామని సోనియా వారిని ఒప్పించ గలిగిందంటే ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్ అధినేత్రిగా ఆమెకి ఎంత విలువ ఉందన్నది స్పష్టమవుతున్నది. అలా ఇతర పార్టీలను ఏకం చేయడంలో, లేదా కూటమిలో ప్రధాన భూమికను పోషించే విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక స్థానాన్ని పొందుతున్నా, ఆ పార్టీ అంతర్ఘత కీచులాటల్లో మాత్రం మార్పు రావడంలేదు. అందుకు రాజస్థాన్‌లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అద్దం పడుతున్నవి. శతాబ్దానికి పైగా చరిత్రఉన్న కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం తర్వాత గాంధీల కుటుంబేతరులు సారథ్యం వహించే అవకాశం వొచ్చింది. అంత ప్రతిష్టాత్మకమైన ఈ పదవిలో కొనసాగే నేత ఎంతో ఉన్నతుడై ఉండాలనుకుంటారు. గత కొంతకాలంగా వెతికి వెతికి రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ ఇందుకు అర్హుడిగా పార్టీ భావించింది. కాని, ఇంకా ఆయన పార్టీ పగ్గాలు చేపట్టకుండానే పార్టీలో తనకు అయిష్టుల పట్ల ఆక్రోషాన్ని వ్యక్తం చేస్తుండడం చూస్తుంటే ఎంతో ఓపిక, నేర్పరితనంతో వ్యవహరించాల్సిన స్థానంలో కూర్చున్న తర్వాత పార్టీలో ఎంతటి సంక్షోభ పరిస్థితికి కారణమవుతాడోనన్న అభిప్రాయాలను కాంగ్రెస్ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్ష స్థానాన్ని ఎల్లకాలం గాంధీ కుటుంబాలే ఏలుతున్నాయన్న అపవాదను తప్పించుకోవడంతోపాటు, పార్టీలో వయోవృద్ధులకన్నా యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న రాహుల్ గాంధీ పట్టుదల పార్టీవర్గాలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో పేరున్న యువనేతలు ఒక్కొక్కరిగా పలువురు పార్టీనుండి నిష్క్రమించారు. రాహుల్‌కు అతి సన్నిహితంగా ఉన్న సచిన్‌పైలెట్, జ్యోతిరాదిత్య సింధియా లాంటివారు అసహనానికి లోనైనారు. సింధియా పార్టీ వదిలిపోగా, పైలెట్‌ను ప్రియాంకగాంధి బుదగరించడంతో ఆగిపోయాడు. రాజస్తాన్ సిఎం పదవి విషయంలో గతంలోనే ఆయనకు అన్యాయం జరిగింది. అనుకోకుండా అశోక్ గెహ్లత్ను కాంగ్రెస్ అధ్యక్షపదవికి ఎన్నుకోనున్న దృష్ట్యా ఖాలీ ఏర్పడే సిఎం స్థానంలో పైలెట్‌కు అవకావం లభిస్తుందనుకున్నారు. కాని గెహ్లత్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. ఆయనకు మద్దతుగా 90 మంది ఎంఎల్ఏల రాజీనామా పత్రాలతో సిద్దమయ్యారు. ఇప్పుడు రాజస్తాన్‌లో దీనివల్ల పెద్ద రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అసలే దేశంలో రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అందులో ఒకటైన రాజస్తాన్‌లో ఇప్పుడు సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. గెహ్లత్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత ఇంకా ఎలాంటి చిక్కులు తెస్తాడోనన్న భయం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఏర్పడింది.