భారత్ జోడో యాత్ర వేళ కాంగ్రెస్‌కు షాక్
గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ
పనాజి, సెప్టెంబర్ 14 : గోవాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న తరుణంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరడం గమనార్హం.ఆ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది బీజేపీలో చేరారు. దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ పల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ కమలం పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ప్రధాని మోడీ, సీఎం ప్రమోద్ సావంత్‌లను బలోపేతం చేసేందుకే బీజేపీలో చేరామని మైఖేల్ లోబో తెలిపారు. గోవా అసెంబ్లీలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీకి 20 మంది, కాంగ్రెస్‌కు 11 మంది సభ్యులున్నారు. 2019 జులైలోనూ.. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును తప్పించుకునే అవకాశం ఉంటుంది. గతంలో కూడా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే వార్తలు వచ్చినా..అధిష్టానం చర్యలతో అది సద్దుమణిగింది.
గోవా అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 11 మంది సభ్యులు ఉండగా.. అందులో 8 మంది భాజపాలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు గోవా సీఎం ప్రమోద్ సావంత్, అసెంబ్లీ స్పీకర్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తమతో కలిసేందుకు వీరంతా ముందుకొచ్చారని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సదానంద్ శేఠ్ వెల్లడించారు. సావంత్‌ను కలిసిన నాయకుల జాబితాలో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైకెల్ లోబో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. రెండు నెలల క్రితం కూడా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సమావేశానికి గైర్హాజరైన సమయంలోనూ ఈ తరహా వార్తలే వచ్చాయి. గోవా అసెంబ్లీ సమావేశానికి ఒక రోజు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయగా.. ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. త్వరలోనే వారంతా భాజపాలో చేరతారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ను రంగంలోకి దింపి నాటి సంక్షోభం సద్దుమణిగేలా చూశారు. ఇక 2019లో కూడా 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన తరుణంలో తాజా పరిణామాలు పార్టీకి గట్టిదెబ్బగానే భావిస్తున్నారు.