రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఇకపోతే గణెష్ నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వినాయక శోభాయాత్రతో పాటు నిమజ్జనం జరుగనున్న ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేశామని జలమండలి ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఇప్పటికే 3, 5, 7, 9వ రోజుల్లో 74 నీటి కొలనుల వద్ద మంచినీటి శిబిరాలు జలమండలి నిర్వహించింది. శుక్రవారం కోసం అదనంగా మరో 122 తాగునీటి శిబిరాల ఏర్పాటు చేయనుంది. 3.72 లక్షల మంచినీటి పాకెట్ల పంపిణీకి సిద్ధం చేసింది. అన్నదానం జరిగే శిబిరాలకు ఉచిత మంచినీటి ట్యాంకర్లను జలమండలి సరఫరా చేయనుంది. ఏర్పాట్ల పరిశీలన, మంచినీటి శిబిరాల పర్యవేక్షణకు నోడల్ ఆఫీర్లను నియమించడం జరిగింది. నిమజ్జన శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో ఎటువంటి వాటర్ లీకేజీలు, సీవరేజి ఓవర్‌ఫ్లో లో లేకుండా జలమండలి జాగ్రత్తలు తీసుకుంటోంది.