జ్ఞానదీపిక అక్షరం,
మార్గదర్శి అక్షరం.
అదొక జీవన వేదం,
తరతరాల ఆస్తి.
మంచిచెడులు బోధించే
విద్యాబుద్ధులు,
నడక,నడత,నాగరికత నేర్పే
అక్షరమే…
విజ్ఞానం,విశ్వపరిజ్ఞానం.
అదొక అనుబంధం,
అనుసంధానం,
ప్రగతికి సోపానం.
అజ్ఞాన తిమిరనాశినియై
వెలుగునిచ్చే అక్షరం
ఆయుధాల కన్నా,
అణుబాంబుల కన్నా శక్తివంతం.
అక్షర సేద్యం అభివృద్ధి ఫలం,
అజారామరం,
వలచిన వారికి వరం.
అదొక అక్షయ తూణీరం,
లక్ష్య సాధకునికి ఆధారం.
అక్షరం లేని జీవితం వ్యర్థం
అదే పోస్తుంది ప్రాణం.
మార్పుకు ఆధారమైన
అక్షరాన్ని గౌరవిద్దాం.
అదే సంక్షేమ రాజ్య సోపానమని,
అందరూ అక్షర పిపాసులైతే
సమాజమే స్వర్గధామమని,
గుర్తెరుగుదాం.
ఇన్ని సుగుణాల కలబోతైన
ఓ అక్షరమా!
నీకు వందనం,అభివందనం.
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం