అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యం

‘‘‌వ్యక్తి వికాసానికి, విజ్ఞానాన్ని అందించడానికి, అంతరాలను అధిగమించడానికి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది. కేవలం సంతకం పెట్టడమే కాకుండా చదవడం, రాయడంతో పాటుగా చదివిన విషయాన్ని ఆకలింపు చేసుకుని నిత్యజీవితంలో ఉపయోగించుకుంటేనే అక్షరాస్యులుగా పరిగణించబడతారు. ప్రపంచంలో అనేక దేశాలు వెనుకబడడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ చెప్పినట్టు నిరక్షరాస్యత దేశానికి తీరని కళంకం.’’

నేడు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం

‘అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం’ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 8‌వ తేదీన 1967వ సంవత్సరం నుండి అన్ని దేశాలలో ఘనంగా జరుపుకు ంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను తెలియజేస్తూ అక్షరాస్యతా శాతాన్ని పెంచుటకు కృషి చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన, సమానమైన, సమగ్రమైన విద్యను అందించడానికి కృషి చేయవలసిన అవసరాన్ని అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం గుర్తు చేస్తుంది. అక్షరాస్యతా మానవ అభివృద్ధిలోనే కాదు దేశ ప్రగతికి కూడా అత్యంత కీలకం. వ్యక్తి వికాసానికి, విజ్ఞానాన్ని అందించడానికి, అంతరాలను అధిగమించడానికి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుంది. కేవలం సంతకం పెట్టడమే కాకుండా చదవడం, రాయడంతో పాటుగా చదివిన విషయాన్ని ఆకలింపు చేసుకుని నిత్యజీవితంలో ఉపయోగించుకుంటేనే అక్షరాస్యులుగా పరిగణించబడతారు. ప్రపంచంలో అనేక దేశాలు వెనుకబడడానికి ప్రధాన కారణం నిరక్షరాస్యతే అని చెప్పవచ్చు. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు నిరక్షరాస్యత దేశానికి తీరని కళంకం.
ముఖ్యంగా మన దేశంలో 50 సంవత్సరాలు పైబడిన వారిలో అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉన్నది. వారిలో మహిళల సంఖ్య ఇంకా తక్కువగా ఉన్నది. స్వాతంత్య్రం సిద్ధించే నాటికి దేశ సగటు అక్షరాస్యత కేవలం 12 శాతం మాత్రమే. ప్రభుత్వాలు   నియత విద్యపై చూపిన శ్రద్ధ వయోజన విద్యా కార్యక్రమాలపై చూపకపోవడంతో ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా మన అక్షరాస్యత రేటు 77 శాతానికే పరిమితమైంది. మనదేశంలో అధిక జనాభా, మూఢనమ్మకాలు, పేదరికం ఆడపిల్లలకు, మహిళలకు చదువు ఎందుకనే భావం, అణగారిన వర్గాల పట్ల తగిన శ్రద్ధ లేకపోవడం, వలసలు లాంటి ఎన్నో కారణాలు నిరక్షరాస్యతకు కారణమవుతున్నవి. నిరక్షరాస్యత నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సాక్షర భారత్‌’ ‌పథకం వంటివి కొంతవరకు అక్షరాస్యత శాతాన్ని పెంచుటకు దోహదపడినవి. కానీ అట్టి కార్యక్రమం 2018 మార్చ్‌తో ముగిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని తిరిగి పొడిగించలేదు.
కోవిడ్‌-19 ‌కారణంతో గత రెండు సంవత్సరాలుగా అక్షరాస్యత కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్పవచ్చు. కోవిడ్‌ ‌సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. దాదాపు 1.1 కోట్ల మంది బాలికలు పాఠశాల విద్యకు దూరమయ్యారని యునెస్కో ఆందోళన వ్యక్తం చేసింది. దీనివలన లింగ అసమానతలు, బాల్య వివాహాలు పెరిగిపోయాయి. వీరిలో ఎక్కువమంది పేదలు, అణగారిన వర్గాలకు చెందిన వారి పిల్లలు. ఈ ప్రతికూల ప్రభావం వారికి జీవితాంతం ఉంటుంది. లాక్‌ ‌డౌన్‌, ‌కోవిడ్‌ ‌సంక్షోభంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడం, వలస కార్మికులు గ్రామాలకు తరలి వెళ్లడం కూడా విద్యార్థులు విద్యకు దూరం కావడానికి కారణమయ్యాయి. కానీ ఈ కొత్త పరిణామంతో ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పాఠశాలల్లో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు నమోదు కావడం విశేషం. ఈ కొత్త పరిణామం ఎదుర్కోవడానికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచాల్సిన అవసరం ఉంది. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల సంఖ్యను పెంచాలి. దాంతో పాటుగా తరగతి గదుల సంఖ్యను, బోధన వసతులను పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వయోజనుల అక్షరాస్యతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కూడా కలదు. కేంద్ర ప్రభుత్వం‘నవభారత్‌ ‌సాక్షరత పథకం’ పేరిట నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చుటకు నూతన పథకాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా ఏడాదికి కోటి మందిని అక్షరాస్యులుగా మార్చాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుతో నిరక్షరాస్యులైన వయోజనులకు అవసరమైన ఆర్థిక అక్షరాస్యత, ఆరోగ్య అవగాహన, శిశు సంరక్షణ, కుటుంబ సంక్షేమం, వృత్తి విద్యా నైపుణ్యాలు, మౌలిక విద్య, డిజిటల్‌ ‌లిటరసీతో పాటుగా నిరంతర విద్య అందేలా చూడనున్నారు. ముఖ్యంగా మహిళల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నందున ఈ కార్యక్రమంలో వారిని ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో మాత్రం వెనుకబడియున్నది. దీనితో జాతీయస్థాయి మనవాభివృద్ధి సూచిలో రాష్ట్రం వెనుకబడిపోతున్నది. అక్షరాస్యత శాతం పెంపుతోనే అభివృద్ధి సూచిలో తెలంగాణ స్థానం మెరుగవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా వయోజనులైన నిరక్షరాస్యుల యొక్క పూర్తి వివరాలు పల్లె ప్రగతి మరియు పట్టణ ప్రగతి కార్యక్రమాలలో సేకరించడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిని అక్షరాస్యులుగా మార్చడం కొరకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర అక్షరాస్యత శాతం పెంచుటకు కృషి చేయుచున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ ‌సంక్షోభం చేసిన గాయాల నుంచి విద్యారంగాన్ని త్వరగా కోలుకునేలా పటిష్ట ప్రణాళికలు రూపొందించి సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా తగు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
image.png
 పుల్లూరు వేణుగోపాల్‌, అసోసియేట్‌ అధ్యక్షులు
టిఎన్జీవోస్‌ ‌యూనియన్‌,  ‌హన్మకొండ జిల్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page