- రోడ్డుపై బైఠాయించిన సీఎల్పీ బృందం
- మంజూరు నగర్ వద్ద ఉద్రిక్తత
- కాళేశ్వరం పాకిస్తాన్లో ఉన్నదా.. సీతక్క ఫైర్
చిట్యాల(భూపాలపల్లి), ప్రజాతంత్ర, ఆగస్టు 17 : కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ బృందాన్ని భూపాలపల్లిలో బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళుతున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీని మంజూరు నగర్ వద్ద ఆపివేశారు. స్థానిక పోలీసులు సీఎల్పీ బృందాన్ని అడ్డుకోవడంతో ప్రభుత్వం విమర్శల పాలైంది. తమ నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వందలాదిగా రావడంతో మంజూరు నగర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని ప్రతిపక్ష సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు సీతక్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కూడిన బృందం గోదావరి ముంపు ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించాలని మంగళవారం బయలుదేరింది విధితమే. భద్రాచలం వెళ్తున్న సిఎల్పీ బృందాన్ని ఇల్లంద వద్ద పోలీసులు అడ్డుకుని రాత్రి అంతా అడవి ప్రాంతం గుండా తిప్పి అదే రాత్రి ఇల్లంద సింగరేణి క్లబ్లో వొదిలి పెట్టారు.
కాగా బుధవారం ఉదయం సిఎల్పీ బృందం కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శించేందుకు బయలుదేరింది. కాగా కాళేశ్వరం వెళ్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న పోలీసులు మంజూరునగర్ వద్దకు రాగానే వారిని అడ్డుకున్నారు. కాళేశ్వరం వెళ్లడానికి అనుమతి లేదని సీఎల్పీ బృందాన్ని ఆపివేశారు. దీంతో తమ నేతలను పోలీసులు అడ్డుకున్నారని కాంగ్రెస్ శ్రేణులకు తెలిసింది. వెంటనే జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మంజూరు నగర్ చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎల్పీ బృందం కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపోయిన బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి రాకపోకలు స్తంభించాయి. అనంతరం బలవంతంగా సీఎల్పీ నాయకులను అక్కడ నుండి వ్యాన్లోకి ఎక్కించి గణపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాళేశ్వరం పాకిస్తాన్లో ఉన్నదా.. సీతక్క
కాలేశ్వరం వెళ్లకుండా సీఎల్పీ బృందాన్ని అడ్డుకున్న క్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క మీడియాతో మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు వెళితే ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని సూటిగా ప్రశ్నించారు. కాలేశ్వరం తెలంగాణలో లేదా? అని అదేమైనా పాకిస్తాన్లో ఉందా? అంటూ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న డబ్బుంతా కాలేశ్వరంలో దాచిపెట్టినట్లు అర్థమవుతుందన్నారు. మునిగిన మోటార్లను, ప్రాజెక్టు పనితీరును పరిశీలించేందుకు వెళితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదో బహిరంగంగా చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనించాలని కోరారు.