- పేదరిక నిర్మూలనే టిఆర్‌ఎస్ ఎజెండా
- ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి
- మంత్రి హరీష్‌రావు డిమాండ్
పేదలకు ఉచిత పథకాలు వద్దన్న కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి హరీష్‌రావు డిమాండు చేశారు. పేదరిక నిర్మూలనే ఎజెండాగా పని చేయడం టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. సోమవారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయిలో రెడ్డి కమ్యూనిటీ హాల్, ఓపెన్ జిమ్, రెండు ఓహెచ్‌ఎస్‌ఆర్ నీటి ట్యాంకులు, శ్మశాన వాటిక, డంపింగ్ షెడ్, పాఠశాల అదనపు తరగతి గదులు, బిటి రోడ్డు నిర్మాణం పనులు ముండ్రాయి నుంచి దూల్మిట్ట సర్కిల్ వరకూ, అలాగే ముండ్రాయి నుంచి మందపల్లి వరకూ రోడ్డు నిర్మాణ పునరుద్ధరణ పనులకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వమని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోళ్లు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోళ్లు చేసి రైతులను ఆదుకున్నదని చెప్పారు. ప్రతీ ఎకరాకు యేటా 10 వేల పంట పెట్టుబడి సాయం రైతుబంధు అందిస్తున్నదని, కానీ కేంద్ర బిజెపి ప్రభుత్వం మాత్రం నీరవ్ మోదీ లాంటి బడా బడా వ్యాపారేత్తలకు 10 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ఇవొద్దద్దని చెప్పడం సబబేనా అని ఎద్దేవా చేశారు. ఏదీ ఉచితం.. ఏదీ అనుచితమో.. చెప్పాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. ఉచితాలు వద్దన్న బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని మనం వద్దని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందనీ.. ప్రశ్నిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లు తెచ్చి కొమురెల్లి మల్లన్న దేవుడి, తెలంగాణ ప్రజల కాళ్ళు కడిగినట్లు, అలాగే నిరంతరం 24 గంటలు కరెంటు, రూ.200 నుంచి రూ.2016 ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఇతరత్రా ముఖ్యమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. పేదరిక నిర్మూలనే ఎజెండాగా టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి తెలిపారు. అంతకు ముందు ముండ్రాయి నుంచి సిద్ధిపేట వరకూ నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తూ.. డివైడర్ బట్టర్‌ప్లై వీధి దీపాల వెలుగులు గ్రామానికి రానున్నాయని మంత్రి హామీనిచ్చారు.
ముండ్రాయి పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీయల్ పార్కు, రైల్వే లైను, ఎల్కతుర్తి నుంచి రామయంపేట వరకూ.. నాలుగు లేన్ల రాజీవ్ రహదారి నిర్మాణం పనులు మొదలుకానున్నాయని మంత్రి చెప్పారు. ముండ్రాయి నుంచి నాగరాజుపల్లి వరకూ రూ.20 కోట్లతో డబుల్ రోడ్, అంక్షాపూర్ గ్రామం వద్ద ఒక కోటి రూపాయలతో బ్రిడ్జిని, ముండ్రాయి, వెంకటాపూర్, నాగరాజుపల్లి వరకూ డబుల్ రోడ్, అలాగే రూ.60 లక్షలతో కొనాయపల్లి బీటీ రోడ్డు పునరుద్ధరణ, ముండ్రాయి నుంచి మందపల్లి వరకూ రూ.1.05 కోట్లతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మనఊరు మనబడి కింద ముండ్రాయి పాఠశాలలో రూ.52 లక్షలతో అదనపు తరగతి గదులు, గ్రామంలో ఓపెన్ జిమ్, వైకుంఠధామం, సెగ్రీ గేషన్ షెడ్డు తదితర గ్రామ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసుకున్నామని మంత్రి హరీష్‌రావు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి కమలాకర్‌రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.