- 1600 మంది పోలీస్ సిబ్బందితో ఏర్పాటు
- విలేఖరుల సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు 16వ తేదీన వికారాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లాలో మొత్తం 1600 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారన్నారు. నలుగురు ఎస్పీలు, 6 గురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్సైలు మిగతా సిబ్బంది విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి మధ్యాహ్నం రెండు నుంచి రెండున్న గంటల మధ్యలో చేరుకుంటారని అనంతరం హెలిపాడ్ ద్వారా ఎస్పీ కార్యాలయం నుండి జిల్లా టిఆర్ఎస్ పార్టీ భవన్‌కు చేరుకుని ప్రారంభిస్తారని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే నివాసానికి సీఎం వెళ్లదలిస్తే బ్రిడ్జి మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా నుండి ఎమ్మెల్యే ఇంటికి చేరుకునే అవకాశం ఉందని, లేనిపక్షంలో నేరుగా టిఆర్ఎస్ భవన్ ప్రారంభించి అక్కడి నుండి నేరుగా నూతన కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా సమీకృత కార్యాలయ సముదాయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. తదనంతరం అధికారులతో సీఎం రివ్యూ మీటింగ్ ఉంటుందన్నారు. అనంతరం బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా పరిగి రోడ్డు మార్గంలో రెండు గంటల ముందుగా రహదారి నిలిపివేసి వాహనదారులను మన్నెగూడ మీదుగా తరలిస్తామని, తాండూరు నుంచి వొచ్చే వారికి, కొడంగల్, పరిగి నుంచి వొచ్చే వారికి, చేవెళ్ల నుంచి వొచ్చే వారికి వివిధ ప్రదేశాల్లో సభా స్థలానికి అర కిలోమీటర్ దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
హైదరాబాద్ తాండూర్ మధ్య రాకపోకలను పరిగి కొడంగల్ మీదుగా దారి మళ్లించడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో కొందరు సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటన చేశారని అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసుల నిఘా ఉంటుందని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా ప్రజా ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక పాసులు ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.