ఫెసాతో స్వయంపాలన.. ఓ సుదూర స్వప్నం !

భారతస్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంలో గిరి ప్రగతిని పరిశీలిస్తే అభివృద్ధిలో ఆశిం చినంత మార్పు రాలేదు. గిరిజనుల అభ్యున్నతికి ఇంతవరకు పాలకులు చేపట్టిన బృహత్తర ప్రణాళికల అమలులోని అలసత్వమే గిరిజన సంక్షేమానికి పెద్ద సంక్షోభం. అందుకే గిరిజన సమాజం దేశంలోనే అత్యంత వెనుకబడి ఉంటోంది. అక్కడ కన్పించేవన్నీ సమస్యల తోరణాలే ! మన్యంలో మలేరియా మరణాలు, పిల్లల పౌష్టికాహార లోపాలు, గర్భిణీల్లో రక్తహీనత, అవిద్య, అంధకారం, భూమి విస్తాపనం, సామాజిక వివక్ష, అంతర్గతంగా రిజర్వేషన్ల అసమతుల్యత వంటివి ప్రత్యక్ష ఉదాహరణలు. అడవి, భూమి, సహజ వనరులు, ఆచార సంస్కృతులు వంటివి ఆదివాసీల సంప్రదాయక హక్కులు. వీటిని పునరుద్ధరించడానికి ప్రపంచ దేశాలన్నీ నడుంకట్టి, గిరిజనుల సంరక్షణకు కృషి చేయాలన్నదే ఆదివాసీల హక్కులపై ఐక్యరాజ్య సమితి ఆమోదించిన తీర్మాన సారాంశం. ప్రపంచ వేదికల నుండి ప్రాంతీయ స్థాయి వరకు ఏ దేశంలో చూసినా, ఆదివాసీల సంప్రదాయ హక్కులను పరిరక్షిస్తామని పాలకులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. అటవీ హక్కుల చట్టాలు ఏటేటా సవరణలకే పరిమిత మవుతున్నాయి. ప్రపంచంలోనే ఆదివాసీ సమాజాలు అత్యంత నిరాదరణకు గురవుతున్నాయి. అపారమైన అటవీ వనరులు, ఖనిజాలు, ఔషధాలు, జంతుజాలం, జీవన వైవిధ్యాలకు ఆలవాలమైన ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి పేరుతో సాగిస్తున్న పారిశ్రామీకరణ వల్ల అడవి బిడ్డల మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడింది. పరోక్షంగా ఇది పర్యావరణ అసమతుల్యానికి, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడటానికి పెనుసవాలుగా మారింది.

ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచంలో 70 దేశాల్లో ఐదు వేల తెగలకు చెందిన 37 కోట్ల వరకు ఆదివాసీ జనాభా ఉంది. 6,700 భాషలను ఆదివాసీలు మాట్లాడుతున్నారు. వీటిలో చాలా భాషలు అంతరించిపోతున్నాయి. 2011జనాభా లెక్కల ప్రకారం మనదేశంలో 5, 6 వ షెడ్యూల్లో పేర్కొన్న రాష్ట్రాల్లో ఉన్న 705 తెగలకు చెందిన ఆదివాసీలు దేశ జనాభాలో 8.9శాతం (సుమారు 12 కోట్లు) మంది ఉన్నారు. వీరిలో అధిక శాతం వ్యవసాయం (పోడు), వేట, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో 30 తెగల ఆదివాసీలు, మరో 5 తెగల మైదానులు కలిపి జనాభాలో 7.9 శాతం (సుమారు 62 లక్షలు) మంది భిన్నమైన సంస్కృతులు, జీవన శైలిని కలిగి ఉన్నారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఆదివాసీల వారసత్వ అటవీ వనరులు, మానవ హక్కులు, తదితర సమస్యలపై 1982 ఆగస్టు 9 న జెనీవాలో మానవ హక్కుల నిపుణులతో జరిగిన వర్కింగ్‌ ‌గ్రూపు సమావేశంలో అంతర్జాతీయంగా ఆదివాసులు ప్రధానంగా ఎదుర్కొంటున్న విద్య, ఆరోగ్యం, భూమి విస్తాపనం, సాంప్రదాయక హక్కులు, అటవీ హక్కులు వంటి వాటిపై సమితి సర్వప్రతినిధి సభ 1993లో ఒక తీర్మానం చేసింది. అలాగే ఆదివాసీల హక్కులపై 1994లో ఓ ముసాయిదా ప్రకటన వెలువరిస్తూ ఏటా ఆగష్టు 9 న అంతర్జాతీయ ఆదివాసీల హక్కుల దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించింది. కానీ ఏ రాష్ట్రంలోనూ అధికారికంగా నిర్వహించటం లేదు. ఈయేడు ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన వాటి రక్షణ కోసం ఆదివాసీ మహిళల పాత్ర అనే థీమ్‌ ‌తో వేఢుకలు నిర్వహించాలని ఐ.రా.స నిర్దేశించింది.

మనదేశంలోని ఉద్యమాల చరిత్రలో ఆదివాసీల భూపోరాటాలు కీలమైనవి. ఆదివాసీల స్పూర్తిదాతలైన ప్రముఖ ఐఏఎస్‌ అధికారులు స్వర్గీయ బి.డి. శర్మ, ఎస్‌.ఆర్‌.‌శంకరన్‌, ‌దిలీప్‌ ‌సింగ్‌ ‌భూరియాలు గిరిజన చట్టాల ఏర్పాటు వెనుక వారి కృషి ఉంది. 73వ రాజ్యాంగ సవరణతో 1992 నుండి అమలవుతున్న పంచాయితీరాజ్‌ ‌చట్టాన్ని అందరికీ ఒకేరీతిన అమలు చేయడంతో గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఎక్కడ ఆనకట్టలు కట్టినా మునిగి పోయేది ఆదివాసీల గ్రామాలే. అడవుల పెంపకానికి, బొగ్గు, లోహనిక్షేపాల వెలికితీతకు వారి భూములే కావాలి. పులుల్ని రక్షించడానికి ఆదివాసులు అభయారణ్యాల నుంచి బయటికి రావాలి. ఇక గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఏజెన్సీలలో ఏర్పడేది ఎన్నడు ? అందుకే వారు ఉద్యమబాట పట్టారు. దీంతో కేంద్రప్రభుత్వం దిలీప్‌ ‌సింగ్‌ ‌భూరియా నేతృత్వంలోని కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1996 డిసెంబర్‌ 24‌న పంచాయతీరాజ్‌ ‌షెడ్యూల్డ్ ‌ప్రాంతాల విస్తరణాధికారాల చట్టం (ఫీసా) రూపొందించింది. రెండున్నర దశాబ్దాల పాటు జరిగిన గిరిజనుల పోరాట ఫలితమే ఈ ఫీసా చట్టం.

కొండ, కోనల్లోని ఆదివాసుల సంప్రదాయ గ్రామసభలకు సముచిత గౌరవం కల్పించినదీ చట్టం. దీని ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామపంచాయితీకి బదులు గ్రామసభను కేంద్రబిందువు చేసి విశేషా ధికారాలను కట్టబెట్టారు. ఒక ప్రాంతంలో నివసించే గిరిజనులందరూ ఆ గ్రామసభ పరిధిలోకి వస్తారు. నివాసిత ప్రాంతాల చుట్టూర గల సహజ వనరులు, అటవీ సంపదపై యాజమాన్య హక్కులు వారివే. ఆ వనరులను గిరిజనులు తమ అవసరాల కోసం వినియోగించుకుంటూ, సంప్రదాయ పరిరక్షణకు కట్టుబడతారు. ఆ ప్రాంతాల్లోని పాఠశాలలు, వైద్య కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత ఆ సభలకే ఉంటుంది. అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ, నష్టపరిహారం పంపిణీ, గనుల తవ్వకాలకు సంబంధించిన లీజులు, సామాజిక, ఆర్ధిక అభివృద్ధి కార్యక్రమాల కొరకు వివిధ ప్రణాళికల రూపకల్పన, ఉప ప్రణాళిక నిధుల ఖర్చుకు సైతం గ్రామసభల అనుమతి తీసుకోవాలి. అంతేకాదు ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో లబ్దిదారుల గుర్తింపు, చిన్న తరహా అటవీ ఉత్పత్తులపై యాజమాన్య హక్కులు, మద్యం అమ్మకాలు, వడ్డీ వ్యాపారులపై నియంత్రణ, నీటివనరుల నిర్వహణ వంటి విషయాల్లో గ్రామసభలకే సర్వాధికారాలు ఉన్నాయి.

ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామసభకు విశేషాధికారాలను కట్టబెడుతూ రూపొందించిన ఫీసా చట్టానికి 2021 డిసెంబర్‌ 24 ‌నాటికే 25 ఏళ్లు నిండాయి . కానీ దాని లక్ష్యం మాత్రం నెరవేరడంలేదు. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల సమగ్ర అభివృద్ధి, గ్రామీణుల సాధికారత కోసం గ్రామ పంచాయతీలకు మార్గనిర్దేశం చేయడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఆదివాసులు జీవనోపాధి మెరుగుదల, అటవీ హక్కుల కల్పన, మౌలిక వసతుల ఏర్పాటు తదితర కీలక అంశాల్లో వారికి స్వయంపాలన హక్కులు కల్పించే ఫీసా చట్టం స్ఫూర్తిని కాదని దేశమంతటా ఒకే రీతిన అమలుచేసే పంచాయతీ రాజ్‌ ‌చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసులతో పాటు, వారి మద్దతు సంఘాలు ఉద్యమించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం దిలీప్‌ ‌సింగ్‌ ‌భూరియా అధ్వర్యంలో పంచాయతీ రాజ్‌ ‌చట్టం (1992) పై ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. కమిటీ సిఫార్సులతో పార్లమెంటు 1996లో పీసా చట్టాన్ని ఆమోదించింది. అప్పటి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు గ్రామసభలకే అధికారం ఉంది.

రాజ్యాంగంలోని అయిదో షెడ్యూలు జాబితాలోని ఆంధ్రప్రదేశ్‌, ‌తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్‌, ‌ఝార్ఖండ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బిహార్‌ ‌లోని షెడ్యూలు ప్రాంతాలకు ఈ చట్టం వర్తిస్తుంది. దాని ప్రకారం నోటిఫై చేసిన గ్రామసభలకు ఆ ప్రాంత సహజ వనరులపై పూర్తి యాజమాన్య హక్కులు ఉంటాయి. జల, అటవీ వనరులను తమ అవసరాలకు వాడుకుని సంరక్షించుకునే విధంగా గ్రామసభలను సుశిక్షితం చేయాలి. గిరిజన ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనుల కోసం విడుదలయ్యే జమా ఖర్చుల ధ్రువపత్రాలను అధికారులు గ్రామసభల నుంచి తీసుకోవాలి. నిర్దేశిత లక్ష్యాలు గల ఫీసా చట్టం ప్రభుత్వాల అలక్ష్యం వల్ల ఆలస్యంగా 2011లో నియమ నిబంధనలు రూపొందించబడ్డాయి. ఆ తరువాత 2013లో గిరిజన సంక్షేమ శాఖ జిల్లా, మండల, పంచాయతీల వారీగా గ్రామసభలను గుర్తించి, జాబితాను ‘నోటిఫై’ చేసింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ‘ఫీసా’ ప్రకారం గిరిజన గ్రామసభలకు హక్కులు వర్తింపజేసే ప్రయత్నమే జరగలేదు. చట్టానికి పాతికేళ్లయినా ఒక్క గుజరాత్‌ ‌తప్ప ఛత్తీస్‌ ‌గఢ్‌, ‌ఝార?ండ్‌, ‌మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికీ నిబంధనలను రూపొందించు కోలేదు.

షెడ్యూల్డ్ ‌ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టుకోసం భూసేకరణకు ముందు గ్రామసభలను సంప్రదించాలి. ఆ ప్రాజెక్టువల్ల భూమి నష్టపోయేవారికి పరిహారం, పునరావాసం కల్పించాలని చట్టం చెబుతోంది. ఆ నిబంధనలను అనేక రాష్ట్రాలు ఇష్టానుసారం అన్వయించుకుని గ్రామసభల తీర్మానాలను లెక్క చేయడం లేదు. గనుల లీజులు, నీటిపారుదల నిర్వహణ, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం… ఇలా అనేక అంశాల్లో ఫీసా స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలు శాసనాల్లో మార్పులు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల తీసుకొచ్చిన అటవీ సంరక్షణ నియమాలు 2022 కూడా ఫీసా స్ఫూర్తిని, ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయి. ప్రభుత్వం పునరాలోచించాలి. స్థానిక వనరులపై ఆదివాసీలకు హక్కులు కల్పించి, గ్రామసభల తీర్మానాలతో పరిపాలన సామర్థ్యం పెంచి, పారదర్శకంగా నిధుల వినియోగం, సంక్షేమ ఫలాల పంపిణీ సరిగా జరిగినప్పుడే గిరిజన ప్రాంతాల్లో వెలుగు రేఖలు విచ్చుకుంటాయి.

ఆదివాసీ ప్రాంతాల్లో సంప్రదాయ పాలన, కట్టుబాట్లు, భౌగోళిక, సామాజిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ప్రధాన స్రవంతి చట్టాలను యధావిధిగా అమలు చేయడంతో ఆదివాసీ ప్రాంతాలలో దశాబ్దాలుగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కీలకమైన గ్రామసభలను విస్మరించడం సరికాదని కొన్ని సర్వేలు కేంద్రానికి నివేదించాయి. గిరిజనుల పాలనలో ఎదురయ్యే సవాళ్లపై కేంద్ర పంచాయతీ రాజ్‌ ‌మంత్రిత్వ శాఖ సాయంతో ‘ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌రూరల్‌ ‌మేనేజ్‌ ‌మెంట్‌’ అధ్యయనం, పాలన సంస్కరణల కమిషన్‌, ‌ప్రణాళికా సంఘ నిపుణుల కమిటీ, చిన్నతరహా అటవీ ఉత్పత్తుల యాజమాన్య కమిటీ ( ఎ.కె. శర్మ), భూ పరాయీకరణ, నిర్వాసితుల అధ్యయన కమిటీ ( రాఘవ చంద్ర )లు ఫీసాను పటిష్టంగా అమలు చేస్తేనే, అదివాసుల స్వయంపాలన సాధ్యమని తేల్చిచెప్పాయి. గిరిజనుల రాజ్యాంగ రక్షణ కవచాలైన భూ బదలాయింపు, ఫీసా, అటవీ హక్కుల చట్టంతోపాటు రాజ్యాంగంలోని అయిదో, ఆరవ షెడ్యూళ్ళలోని రాజ్యాంగ రక్షణలు కాస్తా చేవతగ్గి నిర్వీర్యం అవుతున్నాయి. ఫీసాతో సహా మరో 10 గిరిజన రక్షణ చట్టాలు, వాటి నిబంధనలపై శిక్షణను ఇప్పించి వాటి, అమలు తీరును పర్యవేక్షించే ఆయా రాష్ట్రాల్లోని గిరిజన సంస్కృతీ పరిశోధన శిక్షణా సంస్థలలో సరిపడా సిబ్బంది, నిధులు లేక కుంటుపడుతున్నాయి. పాతికేళ్లు నిండిన ఈ ఫీసా చట్టం ప్రకారం గిరిజనుల అభిమతాన్ని గౌరవించాలి. తెలుగు రాష్ట్రాల పంచాయతీ పాలకవర్గాలతో గిరిజన ఆవాసాల్లో గ్రామసభల కమిటీలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలకు తగినన్ని వనరులను సమకూర్చి ఫీసా అమలుకు కేంద్రం పూనుకుంటేనే ఆదివాసీలకు స్వయంపాలన సాకారమవుతుంది.
-గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక,
9491328409

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page