భారత్‌ను బయపెడుతున్న మంకీపాక్స్ ‌వ్యాధి

మార్చి 2020న ప్రారంభమై రెండు ఏండ్ల పాటు నాలుగు అలల ద్వారా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా భయ మేఘాలు తొలుగుతున్న వేళ మరో మంకీపాక్స్ ఆర్థోపాక్స్ ‌వైరస్‌ ‌రూపంలో ప్రపంచ మానవాళి ముందు దాడికి సిద్ధంగా నిలబడింది.  ప్రపంచవ్యాప్తంగా 83 దేశాల్లో 2 ఆగష్టు నాటికే 25,391 మంకీపాక్స్ ‌కేసులు నమోదైనాయని, అంతర్జాతీయంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా పరిణమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడం ఓ ప్రమాద హెచ్చరికగా దేశాలన్నీ భావించాల్సిన సమయం ఆసన్నమైంది. యూయస్‌లో 6,325, కెనడాలో 803, యూకెలో 2,759, జర్మనీలో 2,724, బ్రెజిల్‌లో  బెల్జియంలో 482, స్పేయిన్‌లో 4,577, ఫ్రాన్స్‌లో 2,054, ఇటలీలో 505, నెథర్‌లాండ్‌లో 927, పోర్చుగల్‌లో 633 మంకీపాక్స్ ‌కేసులు నమోదు కావడం వైరస్‌ ‌వ్యాప్తి తీవ్రతను తెలుపుతున్నది.  1958లోనే ఆఫ్రికన్‌ ‌దేశాల్లో గుర్తించిన మంకీపాక్స్ ‌కేసులు నేడు వేగంగా ప్రపంచ దేశాలను చుడుతూ నేడు కేరళ, ఢిల్లీ, కర్నాటక లాంటి రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఎనిమిది కేసులు బయట పడడం, అనుమానిత మరణాలు నమోదు కావడంతో సామాన్య ప్రజలు కూడా మరో వైరస్‌ ‌విజృంభన పట్ల భయకంపితులవుతున్నారు. మశూచి లేదా స్మాల్‌పాక్స్ ‌లాంటి వ్యాధి లక్షణాలు కలిగిన మంకీపాక్స్ ‌ప్రమాదకరమైనదే అయినప్పటికీ ప్రాణ భయం 3-6 శాతం మాత్రమే ఉంటుందని నిపుణులు వివరించడంతో కొంత ఊరటను ఇస్తున్నది.

మంకీపాక్స్ ‌వ్యాధి వ్యాప్తి, రోగ లక్షణాలు:
మంకీపాక్స్ ‌సోకిన రోగుల్లో ఫ్లూ-లాంటి లక్షణాలతో పాటు చలిజ్వరం, ఫాటిగ్యూ, లింఫ్‌ ‌నోడ్స్ ‌వాపు, దద్దుర్లు, తలనొప్పి, వికారం, చర్మ దురద లాంటి లక్షణాలు కనిపించినా వారం రోజుల తరువాత ముఖం, చేతులు, కాళ్లకు నొప్పులతో కూడిన బొబ్బలు బయటపడతాయి. వివిధ దేశాల్లో వైరస్‌ ‌ప్రభావాలను పూర్తిగా విశ్లేషించాల్సి ఉందని వైద్యులు అంగీకరిస్తున్నప్పటికీ వ్యాధి సోకిన రోగులు దగ్గినపుడు, తుమ్మినపుడు సూక్ష్మ బిందువులు లేదా తుంపర్లు, లాలాజలం రూపంలో ఇరుగుపొరుగు వారికి మంకీపాక్స్ ‌వైరస్‌ ‌సంక్రమిస్తుంది. రోగుల దుస్తువులు ముట్టడం, రోగులను నేరుగా తాకడం, రోగుల శరీర ద్రవాలు అంటుకోవడం, స్వలింగా సంపర్కం, లైంగిక కలయిక సందర్భాల్లో మంకీపాక్స్ ‌వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకుతుంది. కరోనా కన్న మంకీపాక్స్ ‌వైరస్‌ ‌వ్యాప్తి రేటు చాలా తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ కరోనా కాలంలో పాటించిన భౌతిక దూరాలు, వ్యక్తిగత శుభ్రత, గాలి ప్రవహించే గదులు, ఐసొలేషన్‌ ‌లాంటి నియమనిబంధనలు విధిగా పాటిస్తే మంకీపాక్స్ ‌వ్యాప్తి కట్టడి చేయబడుతుందని వివరిస్తున్నారు.  మశూచి వ్యాధికి వాడుతున్న ఆంటీవైరల్‌ ‌టీకా థెరపీని మంకీపాక్స్ ‌కట్టడికి కూడా వాడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

చికిత్స, టీకా అవకాశాలు:
1979లో మశూచి వ్యాధిని నిర్మూలించగలిగిన భారత్‌ ‌నేడు నిర్లక్ష్యం చేస్తే అదే రకమైన వైరస్‌ ‌బారిన పడవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొద్దిపాటి కేసులు మాత్రమే నమోదైన ఇండియాలో వెంటనే టీకాలను వాడే అవకాశం లేదు. అంతర్జాతీయ యాత్రికుల నుంచి వ్యాపిస్తున్న మంకీపాక్స్ ‌వ్యాప్తిని కట్టడి చేయడానికి విమానాశ్రయాల్లోనే పకడ్బందీగా స్క్రీనింగ్‌ ‌చేయడం, అనుమానితులను ఐసొలేట్‌ ‌చేయడం లాంటి చర్యలు తీసుకోవడం తక్షణమే ప్రారంభించాలి. నేడు కొద్ది కేసులే కనిపిస్తున్నప్పటికీ చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలనే నానుడిని అనుసరించి వైద్య ఆరోగ్య యంత్రాంగాన్ని తక్షణమే సమాయత్తం చేయాలి. మంకీపాక్స్ ‌వ్యాధికి చికిత్స ఉండడమే కాకుండా మశూచి వ్యాక్సీన్‌లు కూడా మంకీపాక్స్‌ను అదుపు చేయుటకు సత్వరమే అందుబాటులోకి తేవాల్సి ఉంది. రోగులను గుర్తించడం, చికిత్సలు అందుబాటులోకి తేవడం, రోగులను ఐసొలేట్‌ ‌చేయడం, టీకాలను అందుబాటులోకి తేవడం లాంటి ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజలు కరోనా నిబంధనలను విధిగా పాటించాల్సి ఉంది.
         – డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, కరీంనగరం, 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page