- రాజగోపాల్ రెడ్డి బాటలో దాసోజు శ్రవణ్
- పార్టీకి రాజీనామా సమర్పించిన అధికార ప్రతినిధి
- రేవంత్ తీరుతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బిజెపిలో చేరే అవకాశం
- అమిత్‌షాతో భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్టు 5 : వరుస ఎదురుదెబ్బలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతుంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు రాజీనామా చేయగా పార్టీకి చెందిన కీలక నేత దాసోజు శ్రవణ్ కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో ప్రారంభమైన రాజీనామాల పర్వం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఆ తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన పార్టీ మారుతారేమోననే ప్రచారాన్ని బలపరిచేలా ఉన్నాయి. ప్రస్తుతం దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టి.కాంగ్రెస్‌లో విజయారెడ్డి చేరికపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో ఉన్నారు.
దీంతో నేడు ఆయన తన రాజీనామాను ప్రకటించారు. ఇకపోతే శుక్రవారం ఉదయమే దిల్లీలో తెలంగాణ ఇంటిపార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ఆనందం ఇంతలోనే ఆవిరయ్యింది. ఇంతకాల్ పార్టీకి అధికార ప్రతనిధిగా ఉన్న దాసోజు రాజీనామా చేయడం కలకలం రేపుతుంది. ఇదిలా వుంటే రేవంత్ వ్యాఖ్యలు, చెరుకు సుధాకర్ చేరికతో ఆగ్రహంగా ఉన్నా ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బిజెపిలోకి జంప్ అవుతారని ప్రచారం సాగుతుంది. రాజగోపాల్‌రెడ్డితో పాటు వెంకటరెడ్డి కూడా కలవనుండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా కేంద్రం హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు.
బీజేపీ జాతీయ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి రాజగోపాల్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరిక, మునుగోడులో బహిరంగ సభ ఏర్పాటు అంశంపై ముగ్గురు నేతలు చర్చించినట్లు తెలుస్తుంది. దిల్లీ పర్యటనలో భాగంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి చెందిన ఇతర నేతలను కూడా కలవనున్నట్లు తెలుస్తుంది. రాజీనామా ప్రకటించిన అనంతరం ఆయన దిల్లీకి రావడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ ఎమ్మెల్యే పదవిని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 8న స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేయనున్నారు.