- రాష్ట్రపతి భవన్ వైపు దూసుకెల్లే ప్రయత్నం
- రాహుల్ సహా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
న్యూ దిల్లీ, ఆగస్ట్ 5 : ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ నుంచి ‘చలో రాష్ట్రపతి భవన్’ మార్చ్ నిర్వహించారు. రాహుల్, కెసి వేణుగోపాల్, మల్లికార్జున కర్గే తదితర నేతలు ర్యాలికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తంగా మారాయి. దిల్లీలో పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలను.. విజయ్ చౌక్వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ రేట్ల పెంపు అంశాలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి.
దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా అనేక మంది నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తడమే తమ కర్తవ్యమని.. ఈ విధులు నిర్వర్తించినందుకు తమ ఎంపీలను అదుపులోకి తీసుకుంటాన్నరని రాహుల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు నలుపు దుస్తుల్లో పార్లమెంటుకు చేరుకున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పలువురు ఎంపీలు సైతం నలుపు రంగు దుస్తులు ధరించి తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కూడా నలుపు రంగు దుస్తులు ధరించారు.
నలుపు ఖుర్తా, తలపాగా ధరించి రాజ్యసభకు హాజరైన ఖర్గే… తన నిరసనను వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోలు, డీజీల్, గ్యాస్, జీఎస్టీ… ఇలా పలు దఫాలుగా రేట్లు పెంచడంతో సామాన్యునికి జీవితం గుది బండలా మారింది. ఈ నేపథ్యంలో వీటన్నింటికీ నిరసనగా… కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది.