చికోటితో సిద్ధిపేట జిల్లా ప్రజాప్రతినిధికి లింకు?

  • సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారిన ప్రవీణ్‌తో హెలికాప్టర్‌ ‌జర్నీ?
  • ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో హాట్‌ ‌టాపిక్‌
  • ఓ ‌పార్టీని కుదుపేస్తున్న ప్రజాప్రతినిధి యవ్వారం!

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 28: కేసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ ‌కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. చికోటి ప్రవీణ్‌కు రాజకీయ పలుకుబడి కూడా బాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే  చికోటి కేసినో బిజినెస్‌కు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సిద్ధిపేట-గజ్వేల్‌ ‌ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి లింకులు ఉన్నట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాలు గురువారం ‘ప్రజాతంత్ర’కు తెలిపాయి. చికోటి ప్రవీణ్‌తో కలిసి సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట-గజ్వేల్‌ ‌ప్రాంతానికి  చెందిన ఓ ప్రజాప్రతినిధి హెలీకాప్టర్‌లో దిగుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్‌ ‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చికోటి ప్రవీణ్‌తో కలిసి సదరు ప్రజాప్రతినిధి కేసినో బిజినెస్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం.

చికోటి ప్రవీణ్‌తో పాటు సిద్ధిపేట జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి కూడా కేసినోవాలో కొంత భాగస్వామ్యం, గత నెలలో విదేశాల్లో జరిగిన ఆటకు వెళ్లినట్లు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో పాటు ఇతరులు కూడా చర్చించుకోవడంతో ఈ యవ్వారం ఇప్పుడు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో హాట్‌ ‌టాపిక్‌గా మారింది.  చికోటి ప్రవీణ్‌ ఇం‌టిపై ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌కు చెందిన అధికారులు  దాడులు చేయడం సంచలనంగా మారింది. ఫెమా కింద కేసు నమోదు చేసిన ఈడి… హైదరాబాద్‌లో మొత్తం పలు చోట్ల దాడులు చేసిన విషయం విధితమే. ప్రవీణ్‌ ‌సెల్‌ఫోన్‌, ‌లాప్‌టాప్‌, ‌బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలోని సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ ప్రచారం ఓ పార్టీని ఒక కుదుపు కుదేపేస్తుంది.  కేసినో ఆడించడంలో చికోటి ప్రవీణ్‌ ‌దిట్టగా పేరు పొందారు. గతంలో చికోటి ప్రవీణ్‌ ‌పైన సిబిఐ కేసు నమోదు చేసింది. తాజాగా చికోటి ప్రవీణ్‌ ఇం‌టిపై  ఈడి దాడులు చేయడం సంచలనంగా మారింది. ఈ దాడుల సందర్భంలోనే ప్రవీణ్‌తో ఈ బిజినెస్‌తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే విషయం బయటపడిందనీ, దీని ఆధారంగా మరి కొందరిపై కూడా ఈడి కేసులు పెట్టే అవకాశం ఉందనీ సమాచారం. కేసినో ప్రవీణ్‌తో కలిసి సిద్ధిపేట జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి హెలికాప్టర్‌లో దిగుతున్న వీడియోలు ఇప్పుడు సామాజిక మాద్యమాలలో హల్‌చల్‌ ‌చేస్తున్నాయి. అయితే, దీనిపై ప్రజాప్రతినిధికి చెందిన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి! పదవీకి మాత్రం ఎసరు తప్పదని అదే పార్టీకి చెందిన ఓ నేత చెప్పుకొచ్చారు. ఈ కేసు ఎవరెవరికి మెడకు చుట్టుకుంటుందో.. !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page