ప్రకృతి నీకు చెబుతుంది
ప్రతి ఒకటి ప్రయోజనం కలదని
ప్రకృతిలో వృధాగా ఏది లేదని
ఉదహరించి చెబుతుంది
ఈ భూమి కర్మల కార్మాగారం
భువిని దివి చేయు భాండాగారం
మంచిచెడు అనుభవాల కారాగారం
ప్రతి మనిషి ఓ పనిమనిషి
మనిషి లేకుంటే ఈ జగతి
కలుపు తీయని పంట చేను గతి
కృషితోనే ఈ జగతికి ఖుషి!
అలుగు దూకి చెబుతుంది
తిరిగి చెరువు చేరలేనని
పంట చేలకు నీళ్లు అందించక
వరదై బురదై పోతున్నానని!
పరవశాల పైరగాలి
రుసరుసల వడగాలి
వీస్తుంది కనిపించక
జీవుల బ్రతికించు చెప్పుకొనక!
పక్షుల కిలకిల రావాలు
ఉదయ తెర తీస్తాయి
కోకిలల మధుర గానాలు
వసంతాన్ని ఆహ్వానిస్తాయి!
ఉదయం చెబుతుంది
వెలుగు తొలగి చీకటి వస్తుందని
వెలుగున్నప్పుడే మేల్కొని
జాగ్రత్త పడమని!
రాయి రప్ప అని చులకన చేయకు
ఏ శిల ఏ అహల్య ,ఏ శిల్పం అవునో
ఆల్చిప్ప చెబుతుంది
ముత్యం ఎలా అవుతుందో !
నిలబడి చెట్టు ఏదో చెబుతుంది
విత్తన, ఫల, పుష్పాదులిచ్చి
కష్టసుఖాలకు తట్టుకుని
నిస్వార్థ అనురాగం పంచమని !
గ్రహణం ఏదో చెబుతుంది
నిగ్రహం నీకుంటే,
తొలగిపోవు నీడలని
తప్పిపోవు అశ్వత్థామ తిప్పలని!
తేలిపోయే మేఘాలు
మోసుకొస్తాయి ‘మెగా’ సందేశాలు
మబ్బులు చూసి
ముంత వొలుక పోసుకోవద్దని!
ప్రకృతి లో ఏది వృధాగా లేదని
చెబుతున్నాయి అందరాని
అంబరాన ఆ తారకలు
అందనంత దూరంలో ఉన్న
అవసరమైనప్పుడు
అంధకారం తొలిగించే
వెలుగై నీవు నిలువాలని !
– పి.బక్కారెడ్డి, 9705315250