ప్రకృతి జలాగ్నీ ప్రళయాలు
దంచి కొడుతున్న వానలు
ఆవేదనల వరద బురదలు
తడిసి ముద్దైన తనువులు
పంట చేనులన్నీ చెరువులు
తిరగబడ్డ అప్పుల కుప్పలు
అన్నదాత రుణ గుండె కోతలు
కోతకు గురైన బాటల బాధలు !
నదులైన భాగ్య నగర వీధులు
పడవలే ప్రయాణ సాధనాలు
అరి గోస పడుతున్న బడుగులు
కొట్టులోని సరుకులన్నీ వర్షార్పణాలు
పళ్లెంలో కష్టాల కన్నీటి వరదలు
వరదల్లో కొట్టుకు పోయిన ఆశలు
పొట్టన పెట్టుకుంటున్న ప్రాణాలు
ఆపన్నహస్తాలే కానరాని అకాలాలు !
ఎడతెరిపిలేని కుండపోత వర్షాలు
ముసురుతున్న తీవ్ర విష రోగాలు
పొంగిపొక్లుతున్న మురుగు నీళ్లు
గుట్టలు గుట్టలుగా చెత్తాచెదారాలు
కుప్పలు తెప్పలవుతున్న దోమలు
పడగ విప్పిన అతిసార అనారోగ్యాలు
పెచ్చరిల్లుతున్న డెంగీ, మలేరియాలు
పాలకుల అలవిమాలిన అశ్రద్ధలు
చేతులు కాలాక కూడా దొరకని ఆకులు !
– డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగరం, 9949700037