- బిజెపి పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగింది
- బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
- రాజగోపాల్‌రెడ్డి చేరికను ధృవీకరించిన బండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : యాదగిరిగుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. మొదటి విడత పాదయాత్రలో భాగ్యలక్ష్మి అమ్మవారు..రెండో విడత పాదయాత్రలో జోగులాంబ అమ్మవారి శక్తి ఏంటో చూశారన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే వాళ్ళను యాదగిరిగుట్ట నర్సింహ స్వామి వారు ఎలా తెరమరుగు చేస్తారో అందరికి తెలుసని..అందుకే మూడో విడత పాదయాత్రను స్వామి వారి ఆశీస్సులతో మొదలు పెట్టబోతున్నామన్నారు. యాదగిరిగుట్ట నుంచి వరంగల్ భద్రకాళి అమ్మవారు దేవాలయం వరకు మూడో విడత పాదయాత్ర ఉంటుందన్నారు.
రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల జరిగాయంటే పాదయాత్రే కారణమని బండి సంజయ్ అన్నారు. నిజాయితీ గల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణా ప్రజల్లో మార్పు వొస్తుందని..ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. ఈ మార్పునకు ప్రజాసంగ్రామ యాత్రనే కారణమన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు పాదయాత్రపై విమర్శలు చేశాయన్నారు. పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా అని బండి సంజయ్ అన్నారు. బీజేపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికను బండి సంజయ్ ధృవీకరించారు. బుధవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డితో పాటు అనేక మంది బీజేపీలోకి వొస్తారని స్పష్టం చేశారు. త్వరలో రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు.
అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, సరైన సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీ కండువా కప్పుకుంటారన్నారు. చేరికలపై తమ పార్టీలో భిన్నాభిప్రాయాలు లేవని, హైకమాండ్‌కు మాత్రమే తాము జవాబుదారీ అని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతి విషయంలో ఈడీ తన పని తాను చేసుకుపోతుందని, ఈడీని బీజేపీ కంట్రోల్ చేస్తుందనేది ప్రతిపక్షాల ప్రచారం మాత్రమేనని బండి సంజయ్ అన్నారు.