- వరద సాయంపై మోడీని ప్రశ్నించేందుకు ఎందుకు భయపడుతున్నారు
- మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో సునామి సృష్టిస్తానన్న కేసీఆర్ తన ఇంటి నుంచి బయటకు రావడం లేదన్న ఆయన..వరదసాయంపై మోడీని ప్రశ్నించేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. మోడీ, కేసీఆర్ ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వివిధ బ్యాంకుల్లో రావాల్సిన లోన్లపై అధికారులతో కేసీఆర్ చర్చిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. లోన్లు వొచ్చాక కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి..కవిషన్లు తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారని విమర్శించారు.
కేసీఆర్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలన్న ఆయన.. తెలంగాణ ఎంపీలు కేంద్రం నుంచి నిధులు రాబట్టకుండా నిరసన చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారని మండిపడ్డారు. వరదల వల్ల రాష్ట్రంలో 3వేల కోట్ల నష్టం జరిగిందని..సీఎం, పీఎం రాష్ట్ర ప్రజలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కేంద్రంపై పోరాట కార్యాచరణను ప్రకటించిన తర్వాతే దిల్లీ నుంచి కాలు బయటపెట్టాలన్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై పార్టీ అంతర్గతంగా చర్చిస్తుందని, దీనిపై హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
వరదసాయం, కోల్‌మైన్ పై ఫిర్యాదు చేయడానికి అపాయింట్ మెంట్ అడిగితే..మోడీ ఇంతవరకు స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రైన కిషన్ రెడ్డి రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరించి నిధులను తీసుకురావాలని సూచించారు. కేసీఆర్ చేస్తున్న అక్రమాలపైనా విచారణ చేయించాలన్నారు.