(‘ది వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ విడుదల చేసిన ‘ప్రపంచ లింగ వ్యత్యాస సూచిక – 2022’ ఆధారంగా)
ఇండియాలో 66.2 కోట్ల మహిళలు ఉన్నారు. మన సంస్కృతిలో మహిళను లక్ష్మి, సరస్వతి, దుర్గ రూపంలో మహాశక్తి మాతలుగా కొలుచుకుంటున్నాం. భారత మగ మహారాజులు లక్ష్మి ఇచ్చే సంపద, సరస్వతి ఇచ్చే చదువు, దుర్గ ఇచ్చే ధైర్యం కావాలని వాటి కోసం నిత్య పూజలు చేస్తారు. ఇంట్లో ఉన్న ఇల్లాలిని మాత్రం చులకనగా చూస్తున్నది నేటి పురుషాధిక్య సమాజం. మహిళ వంటింటి కుందేలని, మహిళకు మాట్లాడే హక్కు లేదని, కుటుంబ నిర్ణయాల్లో ఆమె పాత్ర శూన్యమని అనాదిగా వింటూనే ఉన్నాం. పురుషాధిక్య సమాజంలో భారతీయ మహిళలు పంజరంలో బంధించబడిన పక్షుల్ల వలె చీకట్లో మగ్గుతున్నారని లింగ వ్యత్యాస సూచిక వివరిస్తున్నది. మహిళలు పిల్లల్ని కనడం, వంట వండడం, ఇంటి చాకిరీ చేయడం, కూలీ పనికి వెళ్ళడం లాంటి పనులకు మాత్రమే పరిమితం అవుతూ స్వేచ్ఛను కోల్పోయి బలహీనుల్లా బతుకుతున్నారని అర్థం అవుతున్నది. నేటి డిజిటల్ యుగంలో కూడా మహిళకు ఆర్థిక స్వతంత్రం అనే మాట వినబడక పోవడం సోచనీయం. ఈ విషయాలనే తాజాగా విడుదలైన ‘ప్రపంచ లింగ వ్యత్యాస లేదా అసమానతల సూచిక-2022’ సమర్థిస్తున్నది.
లింగ అసమానతల కొలమాన అంశాలు:
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ది వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ తాజాగా విడుదల చేసిన ‘ప్రపంచ లింగ వ్యత్యాస సూచిక (గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్)-2022’ వివరాలు భారతీయ మహిళల దీన స్థితికి అద్దం పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లింగ వ్యత్యాసం లేదా లింగ అసమానతల్లో 146 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో భారత దేశం 135వ స్థానంలో చివరన నిలవడం అవమానకరంగా తోస్తున్నప్పటికీ 2021 వివరాలతో పోల్చితే 2022 సూచికల్లో భారత్ స్వల్పంగా మెరుగైన ఫలితాలను సాధించిందని అవగతం అవుతున్నది. 2021 ‘ప్రపంచ లింగ వ్యత్యాస సూచిక’ పరిశీలించిన 156 దేశాల జాబితాలో ఇండియా 140వ స్థానంలో నిలవడం మనకు తెలుసు. ‘ది వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్’ అధ్వర్యంలో 2006 నుంచి ప్రతి ఏట ‘ప్రపంచ లింగ వ్యత్యాస లేదా అసమానతల సూచిక’ల అధ్యయనంలో మహిళల ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాల కల్పన (ఎకనమిక్ పార్టిసిపేషన్ అండ్ అపర్చునిటీస్), విద్యా నైపుణ్యాల సాధన (ఎడ్యుకేషనల్ అటేయిన్‌మెంట్), ఆరోగ్యం మరియు మహిళా మనుగడ (హెల్త్ అండ్ సర్వైవల్), రాజకీయ సాధికారత (పొలిటికల్ ఎంపవర్‌మెంట్) అనబడే నాలుగు అంశాల ఆధారంగా వివిధ దేశాల లింగ వ్యత్యాస సూచికలు నిర్ణయించారు.
లింగ సమానత్వ సాధనలో తొలి 10 దేశాలు:
లింగ సమానత్వ సాధన జాబితాలో 90.8 శాతం(లింగ సమానత్వం)తో ప్రథమ స్థానంలో వరుసగా 12వ సారి ఐస్‌లాండ్ నిలిచింది. ఐస్‌లాండ్‌తో పాటు తొలి 10 స్థానాల్లో ఫిన్‌లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడెన్, రవడ, నికాగ్వా, నమీబియా, ఐర్లండ్, జర్మనీ దేశాలు నిలిచాయి. ప్రపంచ స్థాయిలో లింగ అసమానతలు 68.1 శాతంగా నమోదు అయ్యాయని నివేదిక స్పష్టం చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వ సాధనకు మరో 132 ఏండ్లు పడుతుందని నివేదిక అంచనా వేసింది. లింగ అసమానతల సూచిక-2022 జాబితాలో భారత పొరుగు దేశాల్లో బంగ్లాదేశ్ (71), నేపాల్(96), శ్రీలంక (110), మాల్దీవ్స్ (117), భూటాన్ (126), ఇరాన్ (126), పాకిస్థాన్ (145), అఫ్ఘానిస్థాన్ (146) స్థానాల్లో నిలవడాన్ని గమనించాలి.
అసమానతల భారతం :
ఆర్థిక భాగస్వామ్యం, అవకాశాల కల్పనలో 146 దేశాల అసమానతల జాబితాలో భారతం 143వ స్థానాన్ని (2021లో 151/156వ స్థానం), విద్య విషయంలో 107వ స్థానం(2021లో 114/156వ స్థానం), మహిళా ఆరోగ్య మనుగడలో చివరి 146వ స్థానం(2021లో 155/156వ స్థానం), రాజకీయ భాగస్వామ్యంలో 48వ స్థానం(2021లో 51/156వ స్థానం)లో నిలవడం గమనించాలి. భారత మహిళలు రాజకీయ భాగస్వామ్యంలో 48వ స్థానంలో నిలిచి మంచి ఫలితాలను, మహిళల ఆరోగ్య మనుగడల సమస్యల విషయంలో 146వ స్థానానికి దిగజారి అధమ స్థానంలో నిలవడం కనిపిస్తున్నది. పురుషులతో పోల్చితే భారతీయ మహిళలకు అక్షరాస్యత, ఉన్నత విద్య, ఆర్థిక భాగస్వామ్యం, ఆర్థిక స్వేచ్ఛ, వ్యక్తిగత ఆరోగ్య మనుగడలు లాంటి అంశాల్లో చాలా వెనుకబడి ఉన్నారని, అనాదిగా ఈ అంతరాలు కొనసాగుతున్నాయని తెలుస్తున్నది. భారతదేశంలో స్త్రీ పురుషుల నిష్పత్తి అంతరాలు, ముఖ్యంగా మహిళ ఆరోగ్య మనుగడలు గాలిలో దీపాలు అవుతూ ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తున్నాయి. మన దేశంలో 6 ఏండ్ల లోపు పిల్లల గణన వివరాల ప్రకారం 1991లో బాలికలు : బాలుర నిష్పత్తి 945 : 1000 (945 బాలికలకు 1000 మంది బాలురు) ఉండగా, 2001లో 927 : 1000, 2011లో 918 : 1000గా నమోదు కావడం హెచ్చరికగా భావించాలి.
కొరోనా కాటు :
కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసలు పెరగడం, మహిళల వేతనాలు అడుగంటడం, ఆదాయం తగ్గడం, ఆరోగ్య ఖర్చులు పెరగడం లాంటివి సర్వసాధారణం అయ్యాయి. 2020 కరోనా కాలంలో జాతీయ మహిళా కమీషన్‌కు 23,000 మహిళల (గత 6 ఏండ్లలో కనిపించనంత ఎక్కువగా) పిర్యాదులు అందడం మహిళల దుస్థితికి అద్దం పడుతున్నది. భారతీయ మహిళల్లో 90 శాతం అసంఘటిత రంగంలో పనులు చేయడంతో ఉద్యోగ భద్రత,ఆరోగ్య వసతులు, వేతన సెలవులు, పని క్షేత్రంలో గౌరవం లేకపోవడం గమనిస్తున్నాం. భారత మహిళ వీధి చిరువ్యాపారాలు, ఇంటి పనులు, గృహ-ఆధార వ్యాపారాలు, వస్త్ర పరిశ్రమ, బీడీ పరిశ్రమ లాంటి రంగాల్లో చిరు ఆదాయాలకు శ్రమించాల్సి వస్తున్నది. కోవిడ్-19 కాటుతో మహిళల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది. భారతంలో 35 శాతం మహిళలు మాత్రమే ఇంటర్నెట్ సేవలు వాడుతున్నారని, కరోనా నిబంధనలు, లాక్‌డౌన్లతో బాలికలు పాఠశాల ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విద్యకు దూరమై ఇంటికి, చిరు పనులకు పరిమితం కావడంతో విద్య అసమానతలు పెరగడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 26 శాతం మహిళలు పార్లమెంట్ సభ్యులుగా సేవలు అందిస్తున్నారని, భారత పార్లమెంట్‌లో (2019లో 78 మంది మహిళా యంపీలు) 14 శాతం మహిళా యంపీలు మాత్రమే ఉన్నారని తెలుసు కోవాలి.
పిండం నుంచి పండు ముసలి వృద్ధురాలి వరకు అసమానతలే:
గర్భస్థ శిశువు ఆడ బిడ్డ అని తెలిసి భ్రూణహత్యలను ప్రోత్సహిస్తోంది నేటి సమాజం. పిండం నుంచి పండు ముసలి మహిళ వరకు అసమానతల చట్రంలో బందీ అవుతున్నది భారతీయ మహిళ. పురుషులకు సమానంగా మహిళలకు మానవ హక్కులు, ఆర్థిక స్వేచ్ఛ, వేతనాలు, అవకాశాలు, గౌరవం, పోషకాహారం, విద్య కల్పించటంలో నేటి పురుషాధిక్య సమాజం విఫలం అవుతున్నది. సినిమా హీరోయిన్స్ నుంచి దినసరి కూలీ వరకు మహిళల వేతనాలు పురుషుల కన్న అతివలకు అనేక రెట్లు తక్కువగా ఉంటున్నాయి. విద్యావంతులైన మహిళలకు కూడా నేటి సమాజం తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. ఆసిడ్ దాడులు, గృహ హింస, లైంగిక వేదింపులు, మానభంగాలు నేటికీ నిత్య వేదనలను కలిగిస్తూనే ఉన్నాయి.
మొన్నటి ఝాన్సీ రాణి, రాణి రుద్రమదేవి, నిన్నటి సరోజినీనాయుడు, ఇందిరాగాంధి, లతా మంగేష్కర్, నేటి పి వి సింధూ, సానియామిర్జాల వరకు అనేక మహిళలు ప్రపంచ ఖ్యాతిని గడించడం చూస్తున్నాం. సీత, సావిత్రిని పూజించిన సమాజం ఇంట్లోని మహిళను కనీస మనిషిగా గుర్తించలేక పోతున్నది. మహిళా హక్కుల కల్పనలో పురుషుల పాత్ర ఉన్నప్పటికీ మహిళలు చొరవ తీసుకొని తమ స్థానాలను సమాజంలో సుస్థిరం చేసుకోవాలి. ప్రేమను పంచే అమ్మగానే కాకుండా అవసరమైతే అపర దుర్గగా గర్జించేందుకు మగువ వెనుకాడగూడదు. హద్దు మీరిన మృగాళ్ల చెంపకు చెప్పు దెబ్బ రుచి చూపాలి. పురుషాధిక్య కంచెలో బందీ అయిన మహిళ బంధనాలు ఛేదించుకొని తమ తమ స్థానాలను పటిష్ట చేసుకోవాలి. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు. మహిళ గళమెత్తనిదే పురుష సమాజం చేస్తున్న తప్పు గుర్తించదు. గృహిణిని గృహ దేవతగా, అమ్మను ప్రేమామృతం పంచే అక్షయ పాత్రగా, కూతురును రుద్రమగా, కోడలిని సీతగా, మహిళను మహాశక్తి రూపంగా చూసుకున్నపుడే భారతంలో లింగ అసమానతలు కరిగి పోయి సమ సమాజం సుస్థిరమవుతుందని నమ్ముదాం. అతివను ఆది దేవతగా చూసుకుందాం.