ఆడ్డగోలు హామీలు గుప్పించి
దొడ్డరీతుల పథకాలు వల్లించి
పిమ్మట నాలుక మడతేయడం
నేటి నేతగణకు పరిపాటే కదా!
తమ తప్పిదాలు కప్పిపుచ్చ
ఇపుడు మేఘ విచ్ఛిత్తి అనే
సరికొత్త డ్రామాకు తెరలేపింది
అనుమానం అనే అస్త్రంతో
నిందల పోరుకు సిద్ధపడింది
గోదావరి వరదల మాటున
విదేశీ శక్తుల హస్తముందని
సాక్షాత్ రాష్ట్రాధీశులవారు
శంకించడమే దీనికి సాక్ష్యం
పైగా క్లౌడ్ బరస్ట్ సంబంధిత
విదేశీ కుతంత్రపు ఘట్టాలను
ఉదహరిస్తూ ఆవిష్కరించారు
మహాగుట్టు రట్టు చేసినట్టు
గాంబిర్యంగా సెలవిచ్చారు
ఎంతైనా వేలాది బుక్కులు
పుక్కిట పట్టిన మేధావి కదా!
అయినా వరద భీభత్సానికి
అవాసాలు పంట చేలు చెదిరి
ఆధరువు నిలువునా కూలిన
దీనులకు భరోసా మాట మరిచి
సంశయం వల్లించుట భావ్యమా?
పరనిందకు తెగపడుట శ్రేయమా?
పాలకవర్యా ఇకనైనా !
క్లౌడ్ బరస్ట్ థియరీ చాలించి
విదేశి కుట్ర సంగతి అటుంచి
దిద్దుబాటుకు ఉపక్రమించండి
బాధితులకు బాసటగా నిలిచి
బతుకులను పునరుద్ధరించండి
(గోదావరి వరదలపై కె సి ఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..)
– కోడిగూటి తిరుపతి, 9573929493