- వరద ముంపులోనే మారుమూల గ్రామాలు
- చెరువులను తలపిస్తున్న పంటపొలాలు
- పునరావాస కేంద్రాల్లోనే వరదముంపు బాధితులు
- కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్, కలెక్టర్ అనుదీప్
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 12 : ఎడతెరుపు లేకుండా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రమాదస్థాయి చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భద్రాచలం వద్ద వేగంగా గోదావరి నీటిమట్టం పెరిగింది. సోమవారం రాత్రి 54 అడుగులకు చేరుకున్న నీటిమట్టం మంగళవారం ఉదయానికి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రానికి 51 అడుగులకు చేరింది. దీనితో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బుధవారం ఉదయం నుండి గోదావరి వరద క్రమంగా పెరిగే అవకాశం ఉంది. రామాలయం ప్రాంతం అంతా వరదనీటితో నిండిపోయింది. నిత్యాన్నదానం సత్రలోకి భారీగా వరదనీరు చేరుకుంది.
అధికారులు ముందస్తుగా మోటర్లు బిగించి వరదనీటిని గోదావరిలోకి పంపించినప్పటకి వరద ముంపు తప్పలేదు. రామాలయం చుట్టూ ఉన్న దుకాణాల్లో కూడ వరదనీరు చేరుకుంది. దీనితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మారుమూల గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. వరద ముంపుతో పలుమండలాలకు చెందిన గ్రామాల్లో ఇళ్ళు కూలి నేలమట్టమయ్యాయి. బాధితులు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ప్రతీఏటా గోదావరి వరదలతో లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి కూడ రహదారులపైన వరదనీరు తగ్గుముఖం పట్టలేదు.
భద్రాచలంకు దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు ప్రాంతాలకు రాకపోకలు స్థంభించిపోయాయి. ఇప్పటివరకు రహదారులు పునరుద్దరణ కాలేదు. అలాగే ఛత్తీస్‌ఘఢ్‌కు వెళ్ళే రహదారి కూడ వరదనీటితో మునిగిపోయింది.కూనవరం, విఆర్‌పురం ,చింతూరు ప్రాంతాలకురహదారి సౌకర్యం పూర్తిగా స్థంభించింది. అలాగే పినపాక మండలం ఐలాపురం గ్రామం వద్ద పెద్దవాగు ఉదృతితో రహదారులు నీటమునిగాయి. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అంతేకాకుండా పినపాక మండలంలోని పొట్లపల్లి గ్రామం వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్ పైనుండి వరదనీరు భారీగా పరవళ్ళు తొక్కుతుంది. మణుగూరుమున్సిపాలిటీ పరిధిలో బాపనకుంట ఏరియాలో మల్లీకార్జున్ అనే వ్యక్తి ఇళ్ళు వర్షాలకారణంగా కూలిపోయింది. సాంబయ్యగూడెం గ్రామం పేరంటాల చెరువు అలుగుపోసింది. బూర్గంపాడు మండలం సారపాక రెడ్డిపాలెం గ్రామాల మద్య రోడ్లపైకి నీరు చేరుకుంది. పినపాక మండలం పోతిరెడ్డిపల్లి పునరావాస కేంద్రానికి 15 కుటుంబాలను తరలించారు. భద్రాచలం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన కొత్తకాలనీ, అయ్యప్పకాలనీలోని బాధితులను పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు.
ఆర్& బి కార్యాలయం ,నన్నపనేని మోహన్, జూనియర్ కాలేజ్ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులను రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. అక్కడ ఉన్న వరద బాధితులను వారికి అందుతున్న సదుపాయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ద చూపెట్టాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఎటువంటి అంటురోగాలు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతీరోజు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని బ్లీచింగ్ చల్లాలని పంచాయితీ అధికారులను ఆదేశించారు. అలాగే బూర్గంపాడు మండలంలో పునారావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలిసి మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుకుండా చూడాలని సూచించారు.
పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే పొదెం వీరయ్య
వరదముంపుకు గురై పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వరద బాధితులను భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య పరామర్శించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ముంపుకు గురైన అయ్యప్పకాలనీ,కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీలోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులను అందుతున్న సౌకర్యాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులను ఎటువంటి ఇబ్బంది కలుగకుండా వరద ముంపు తగ్గేంత వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ఎటువంటి ఇబ్బంది పడకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అధికారులను కోరారు. గోదావరి వరద తగ్గుముఖం పట్టిన వెంటనే వరద ముంపు కాలనీలను శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని కోరారు. అంటు వ్యాధి ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.