వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ

మూసీ మూడు గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు

నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 27 : ఇటీవల కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. ఫలితంగా మూసీ ప్రాజెక్టు నీటిమట్టం కూడా పెరుగుతుంది. ఇప్పటికే ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. మూసీ నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండడం..మరో వైపు ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో మూడు గేట్లు అడుగు మేర ఎత్తి నీటి విడుదల ప్రారంభించడంతో  ప్రాజెక్టు ఆయకట్టు.. కాల్వల కింద సాగు చేసే రైతులను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టు వద్ద మూడు గేట్లు(3,7,10 నంబర్లు) అడుగు మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

మూసీ నదిలో వరద ప్రవాహం (ఇన్‌ ‌ఫ్లో) 1247.79 క్యూసెక్కులు ఉండగా.. మూడు గేట్ల ద్వారా 1992.74 క్యూసెక్కులు విడుదల ( అవుట్‌ ‌ఫ్లో) చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 644.61 అడుగులకు చేరుకుంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా..  4.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పైనుంచి వొచ్చిన వరద ప్రవాహాన్ని వొచ్చినట్ల దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లు జలకళను సంతరించుకుంటున్నాయి. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం వద్ద మూసీ రిజర్వాయర్‌ ‌నిండుకుండను తలపిస్తుంది. ఎగువన గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో.. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. మరోవైపు నిర్మల్‌ ‌జిల్లా కడెం జలాశయంలోని ఉద్ధృతంగా వరద నీరు చేరుతుంది. జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులకు గానూ..679.300 అడుగుల మేరకు నీరు చేరింది. జలాశయంలోకి 1621 క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page