- అభ్యర్థులకు ప్రధాని క్షమాపణ చెప్పాలి…లేకుంటే నిరసనలు తెలుపుదాం
- మల్కాజిగిరి సత్యాగ్రహ దీక్షలో పార్టీ శ్రేణులకు రేవంత్ పిలుపు
- అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: బిజెపి జాతీయ సమావేశాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ వొచ్చినప్పుడు నిరసనలు తెలియజేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే మోదీ పర్యటనలో నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు. మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా యువతన నిరసన తెలపాలని అన్నారు. కేంద్రం వెంటనే అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందన్నారు. రైల్వే ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన వారిని విడుదల చేయాలని కోరారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడే జవానులను అవమనించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మల్గాజ్‌గిరి కూడలి వద్ద చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రైతులను, సైనికులను సమాజాన్ని నిర్మించే శక్తులుగా వారిని కాంగ్రెస్ గుర్తించిందన్నారు.
అంబాని, ఆదాని కంపెనీల రక్షణకు అగ్నిపథ్ పథకాన్ని తెచ్చారని ఆరోపించారు. నాలుగేళ్లు సైన్యంలో ఆ తరువాత జీవిత కాలం బడా పారిశ్రామిక వేత్తలకు కాపలా కాయలా? అని ప్రశ్నించారు. అగ్నిపథ్‌తో ఉద్యోగ భద్రత లేదని, మాజీ సైనికుల హోదా లేదని, ఫించన్ కూడా లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అగ్నిపథ్ పథకంతో యువత భవిష్యత్తును చీకటి మయం చేస్తున్నారని మండిపడ్డారు. యువకులు నాలుగేండ్లు ఆర్మీలో పనిచేసి నిరుద్యోగిగా బయటకు వొస్తే వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా చట్టాలు తీసుకొచ్చి యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చాయని ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన యువకులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.