ఎక్కడో అంతంకాని శూన్యంలో
దిగంతాల ఆవల లోకంలో!
ప్రశాంత వీచికల గాలుల్లో
ప్రభాత జ్వాలల కీలల్లో!
చిన్ముద్రల శాంతంతో
చిదానంద చిత్తంతో!
ఉన్నాడని అనుకుంటే
పక్కనే ఉంటాడు!
ఉన్నాడా అని ప్రశ్నిస్తే
అక్కడే ఉంటాడు!
చెదిరి పోని విశ్వాసంలో
అరమర లేని నమ్మకంలో!
ఊపిరిలో దిగి దేహములో
ఊహల్లో దూరి మనసులో!
సత్యం చూపే మనసాక్షితో
ప్రక్షాళన చేసే పశ్చాత్తాపంతో!
ఉన్నాడని అనుకుంటే
ప్రాణంలా ఉండిపోతాడు!
ఉన్నాడా అని ప్రశ్నిస్తే
గాలిలో కలసిపోతాడు!
మాయతెలీని నవ్వులో
మర్మం లేని ఆలోచనలో!
ఆశించని సహయంలో
ద్వేషించని హృదయంలో!
స్ఫూర్తినిచ్చే భాషణంతో
స్ఫురణఉన్న ఉపకారంతో!
ఉన్నాడని అనుకుంటే
నిదర్శనమై నిలుస్తాడు!
ఉన్నాడా అని ప్రశ్నిస్తే
దర్శనాన్ని కాంచలేడు!
– ఉషారం, 553875577